వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా టికెట్లపై అమెరికాలో భారీ ఆఫర్లు

ABN , First Publish Date - 2020-02-12T22:04:42+05:30 IST

విజయ్ దేవరకొండ అనేది పేరు అని చెప్పడం కంటే ఒక బ్రాండ్ అని చెప్పడం కరెక్ట్. ఇప్పటి వరకు ఒక్క స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయనప్పటికి..

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా టికెట్లపై అమెరికాలో భారీ ఆఫర్లు

ఇంటర్నెట్ డెస్క్: విజయ్ దేవరకొండ అనేది పేరు అని చెప్పడం కంటే ఒక బ్రాండ్ అని చెప్పడం కరెక్ట్. ఇప్పటి వరకు ఒక్క స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయనప్పటికి.. విజయ్ దేవరకొండ తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌డమ్‌ను తెచ్చుకుని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. తన తెలివితేటలతో ప్రతి సినిమాను వినూత్న రీతిలో ప్రచారం చేసుకోవడం ఈ రౌడీ స్పెషాలిటి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. 155 నిమిషాల నిడివితో క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ సినిమా వేలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కోసం విజయ్ అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు.  


విజయ్ సినిమా వస్తుందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని విజయ్ అభిమానులే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. విజయ్ దేవరకొండ గత చిత్రాలైన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం చిత్రాలు అమెరికాలో అత్యధిక వసూళ్లను రాబట్టాయి. ఇదే తన చివరి లవ్ స్టోరీ అని చెప్పిన విజయ్ దేవరకొండ.. వరల్డ్ ఫేమస్ చిత్రంలో ఒకేసారి నలుగురు భామలతో కలిసి నటించి సినిమాపై అంచనాలను పెంచేశాడు. అమెరికాలో ఈ చిత్ర ప్రీమియర్లు ఫిబ్రవరి 13న పడనున్నాయి. ఈ చిత్ర అమెరికా రైట్స్‌ను మూన్ షైన్ సినిమాస్ దక్కించుకుంది. మరోపక్క ఈ సినిమా టికెట్లపై అమెరికాలోని అనేక సంస్థలు భారీ ఆఫర్లను కూడా ప్రకటించాయి. 


రీగల్ అన్‌లిమిటెడ్‌, ఏఎమ్‌సీ స్టబ్స్ ఏ లిస్ట్ ద్వారా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను ఉచితంగా చూసే అవకాశముంది. అదే విధంగా సినిమ్యాక్స్ మూవీ క్లబ్‌తో ఈ సినిమా టికెట్‌పై ఆరు డాలర్ల ఆఫర్‌ను పొందవచ్చు. వీటితో పాటు మూన్ షైన్ సినిమాస్ కూడా అమెరికాలో ఉన్న వారికి భారీ ఆఫర్‌ను ప్రకటించింది. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్ర కథను కనిపెట్టి moviesmoonshine@gmail.comకు మెయిల్ చేసిన వారికి 50 డాలర్ల అమెజాన్ వోచర్‌ను ఉచితంగా అందిస్తామంటూ వినూత్నంగా ప్రచారం మొదలుపెట్టింది.

Updated Date - 2020-02-12T22:04:42+05:30 IST