జగద్గిరిగుట్టలో భారీ పేలుడు

ABN , First Publish Date - 2020-10-25T07:23:16+05:30 IST

శనివారం ఉదయం 7:15 గంటలు. కాలనీ ప్రజలు ఇంకా పూర్తిగా నిద్రలేవలేదు. ఒక్కసారిగా భారీపేలుడు. కిలోమీటరు మేర భారీ శబ్దం

జగద్గిరిగుట్టలో భారీ పేలుడు

కిలోమీటర్‌ మేర శబ్దం

ఉలిక్కిపడ్డ ఆస్బెస్టాస్‌ కాలనీ

బాంబు పేలిందని వదంతులు

పార్క్‌ చేసిన ఆటోలోకి ఎక్కుతుండగా ఘటన

తీవ్రంగా గాయపడిన బిహార్‌ యువకుడు

జిలిటిన్‌ స్టిక్‌ పేలినట్లు అనుమానం..?


హైదరాబాద్‌ సిటీ/జీడిమెట్ల, అక్టోబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): శనివారం ఉదయం 7:15 గంటలు. కాలనీ ప్రజలు ఇంకా పూర్తిగా నిద్రలేవలేదు. ఒక్కసారిగా భారీపేలుడు. కిలోమీటరు మేర భారీ శబ్దం. కొద్దిదూరం వరకు పొగలు.. దాంతో కాలనీ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాంబు పేలిందన్న వదంతులు నిమిషాల్లో కాలనీ మొత్తం దావానలంలా వ్యాపించాయి. ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ పేలుడు లో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఎడమకాలు మడి మ తెగి దూరంగా పడింది. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆస్బెస్టాస్‌ కాలనీలో శనివారం జరిగింది. 


బిహార్‌ రాష్ట్రం శివాన్‌ జిల్లా, కురారీగల్‌ గ్రామానికి చెందిన ఇమామ్‌, సైమూన్నీసా దంపతులు 20 ఏళ్ల క్రితం బతుకు దెరువుకోసం నగరానికి వచ్చారు. అస్బెస్టాస్‌ కాలనీలోని బిర్లా ఫంక్షన్‌ హాల్‌ వెనుక భాగంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరి కుమారుడు యూసుఫ్‌ అలీఖాన్‌ అలియాస్‌ టిట్టూ (20) హైటెక్‌సిటీ ప్రాంతంలోని కొండాపూర్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ సమీపంలో గల వెల్డింగ్‌ షాపులో పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం ఉదయం 7:15 గంటల ప్రాంతంలో ఆటోలో విధులకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఇంటిముందు పార్కు చేసిన ఆటోలో ఎక్కబోయే క్రమంలో తన ఎడమకాలును ఇంటి గోడ పక్కన కిందపెట్టాడు. కాలు తీసి ఆటోలో పెట్టే లోపు.. ఊహించని విధంగా భారీ విస్ఫోటనం సంభవించింది. పెద్ద ఎత్తున శబ్దం, పొగలు కమ్ముకున్నాయి. దాంతో ఇంట్లో టిఫిన్‌ చేస్తున్న కుటుంబసభ్యులు పెద్దగా అరుస్తూ బయటకు వచ్చి చూడగా, యూసుఫ్‌ అలీఖాన్‌ ఎడమకాలు మడిమ తెగిపోయి దూరంగా పడింది. యువకుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఒళ్లంతా గాయాలు అయ్యాయి. దాంతో అదే ఆటోలో అతడిని హుటాహుటిన సూరారంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జగద్గిరిగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పేలుడు జరిగిన తీరును పరిశీలించారు. యువకుడి కాలుకింద ఏముంది, ఎందుకు పేలుడు సంభవించింది, అనేది అంతు చిక్కలేదు. బాంబ్‌స్క్వాడ్‌, క్లూస్‌టీమ్‌ బృందాలు ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సంఘటనా స్దలంలో దొరికిన కొన్ని ఆనవాళ్లను సేకరించారు.


ఇటీవలే గ్యాస్‌ పైప్‌లైన్‌.. 

కాలనీలో ఇటీవలే భారత్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. ఇంటింటికి గ్యాస్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి.  యువకుడు కాలుపెట్టిన స్థలం సరిగ్గా గోడపక్కన ఉన్న గ్యాస్‌పై్‌పలైన్‌ కిందే ఉంది. పైపులైన్‌ పనులు జరుగుతున్న క్రమంలో ఏదైనా పేలుడుకు సంబంధించిన పరికరం అక్కడ పడిపోయి ఉంటుందా..? దానిపై ఆ యువకుడు కాలుపెట్టాడా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

జిలిటెన్‌ స్టిక్‌గా అనుమానం..

జిలిటెన్‌ స్టిక్స్‌ పేలడం వల్లనే ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. జగద్గిరిగుట్ట శివారు ప్రాంతం కావడం.. కన్‌స్ట్రక్షన్‌కు పనులు ఎక్కువగా జరుగుతుంటాయి. పెద్ద పెద్ద బండరాళ్లు, గుట్టలు తొలగించేటప్పుడు జిలిటెన్‌ స్టిక్స్‌ వాడుతుంటారు. వాహనాల్లో వాటిని తరలిస్తున్న క్రమంలో ఏదైనా పేలుడు పరికరం అక్కడ పడిపోయి ఉంటుందా..? దానిపై యువకుడు కాలుపెట్టి తీయడంతో ఒత్తిడికి అది పేలి ఉంటుందని అనుమానిస్తున్నారు. పేలుడు జరిగినప్పుడు వచ్చిన శబ్దం తీవ్రత, యువకుడు గాయపడిన తీరు, సంఘటనా స్థలంలో సేకరించిన ఆనవాళ్లను బట్టి జిలిటెన్‌స్టిక్‌గా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఒకవేళ అదే నిజమైతే.. ఈ జిలిటిన్‌ స్టిక్స్‌ అక్కడ ఎందుకు ఉన్నాయి..? ఎలా వచ్చాయి..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఇంకేదైనా బాంబును పోలిన వస్తువు పేలి ఉంటుందా..? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఫోరెన్సిక్‌ నివేదిక కీలకం..

పోలీసులు, క్లూస్‌టీమ్‌ సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఎఫ్‌ఎ్‌సఎల్‌ నివేదిక వచ్చిన తర్వాతనే అసలేం జరిగింది, ఎందుకు పేలుడు సంభవించింది, దానికి కారణం ఏమిటీ అనే ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2020-10-25T07:23:16+05:30 IST