అమిత్‌షాకు వ్యతిరేకంగా నాగాలాండ్‌లో భారీ నిరసనలు

ABN , First Publish Date - 2021-12-12T00:12:07+05:30 IST

అమిత్‌షాతో పాటు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను తగలబెట్టారు. ఎన్‌కౌంటర్ జరిగిన మోన్ ప్రాంతంలోనే శనివారం సాయంత్రం భారీ నిరసన చేపట్టారు. చనిపోయిన 14 మందిలో 12 మంది ఓటింగ్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబం వారు..

అమిత్‌షాకు వ్యతిరేకంగా నాగాలాండ్‌లో భారీ నిరసనలు

కోహిమా: నాగాలాండ్‌లో ఆర్మీ కాల్పుల్లో 14 మంది చనిపోయిన వారం రోజుల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తాయి. ఈ దారుణ ఘటనపై పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా అబద్దాలు చెప్పారని, అందుకు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా సాయుధ బలగాల ప్రత్యేక హక్కుల చట్టాన్ని (ఏఎఫ్ఎస్‌పీఏ) చట్టాన్ని రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఈ చట్టం హంతకులను కాపాడుతోందని ఆందోళనకారులు విమర్శించారు.


అమిత్‌షాతో పాటు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను తగలబెట్టారు. ఎన్‌కౌంటర్ జరిగిన మోన్ ప్రాంతంలోనే శనివారం సాయంత్రం భారీ నిరసన చేపట్టారు. చనిపోయిన 14 మందిలో 12 మంది ఓటింగ్ అనే గ్రామానికి చెందిన ఒకే కుటుంబంవారు. వీరంతా కోన్యాక్ అనే గిరిజన తెగకు చెందినవారు కావడంతో ఓటింగ్ గ్రామంలో కోన్యాక్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ ఉపాధ్యక్షుడు హోనాంగ్ కోన్యాక్ మాట్లాడుతూ ‘‘మాకు సానుభూతి వద్దు. న్యాయం కావాలని అడుగుతున్నాం. పార్లమెంట్ సాక్షిగా అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం. ఆయన మాటలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలి. అలాగే ఏఎఫ్ఎస్‌పీఏ చట్టాన్ని కూడా రద్దు చేయాలి. 14 మంది మృతులకు న్యాయం జరిగే వారకు మా పోరాటం ఆపబోం’’ అని డిమాండ్ చేశారు.


కాగా, పార్లమెంట్‌లో అమిత్‌షా ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై బీజేపీ మిత్రపక్షమైన నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ తీవ్రంగా ఖండించింది. అమిత్‌షా అబద్దాలు చెప్పారని విమర్శలు గుప్పించింది. ఇక ఏఎఫ్ఎస్‌పీఏ చట్టాన్ని రద్దు చేయాలంటూ నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో సహా మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మ డిమాండ్ చేశారు. త్రిపుర బీజేపీ యూనిట్ సైతం నాగాలాండ్ ఘటనను నరమేధంగా అభివర్ణించింది. నాగాలాండ్ ఘటన అనంతరం పార్లమెంట్‌లో అమిత్‌షా మాట్లాడుతూ సైనికులు సిగ్నల్ ఇచ్చినప్పటికీ వాహనం ఆపకుండా ముందుకు కదలడంతో ఉగ్రవాదులనే అనుమానంతో కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. అయితే తమకు అలాంటి సిగ్నల్ ఏం రాలేదని, తమ వాహనంపై ఉద్దేశపూర్వకంగానే సైనికులు కాల్పులు జరిపినట్లు జవాన్ల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న ఒక వ్యక్తి తెలిపారు.

Updated Date - 2021-12-12T00:12:07+05:30 IST