పెన్షన్ల దందా..

ABN , First Publish Date - 2020-05-16T10:15:20+05:30 IST

నిరుపేదలను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న పెన్షన్లు రామగుండం మున్సిపల్‌

పెన్షన్ల దందా..

జంటగా జీవిస్తున్నా ఒంటరి పెన్షన్లు

ముత్తైదువులకు వితంతుపెన్షన్లు

యాభై ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్లు

వేరే ప్రాంతాల్లో ఉన్న బంధువులకూ లబ్ధి

రామగుండం కార్పొరేషన్‌లో భారీ కుంభకోణం

ప్రతినెల రూ.50లక్షల ప్రభుత్వ ధనం దుర్వినియోగం

కమిషనర్‌కు ఫిర్యాదు.. పెన్షన్‌ సెక్షన్‌లో ఉద్యోగుల మార్పిడి


గోదావరిఖని, మే 15: నిరుపేదలను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న పెన్షన్లు రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పక్కదారి పడుతున్నాయి. పరిపాలన లోపాలను ఆసరాగా చేసుకుని దోపిడీ ముఠాలు కార్పొరేషన్‌ పరిధిలో సుమారు మూడు వేలకు పైగా దొంగ పెన్షనర్లను సృష్టించి ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం చేకూర్చుతున్నారు. అర్హులైన వారికి పెన్షన్లు అందకుండా చేస్తున్నారు. ఇదంతా ఒక పథకం ప్రకారం వ్యూహాత్మకం గా జరుగుతున్న దోపిడీ వ్యవహారం. కార్పొరేషన్‌లోని సంబంధిత విభా గం నుంచే కొందరు నకిలీ పెన్షనర్లను సృష్టించి ప్రతినెల కార్పొరేషన్‌కు సుమారు రూ.50లక్షల మేర ప్రభుత్వ ధనాన్ని అనర్హుల ఖాతాల్లోకి పంపిస్తున్నారు. 


ప్రభుత్వం రూ.200 నుంచి రూ.1000 పెన్షన్‌ పెంచినప్పటి నుంచి ఈ దొంగ దందాకు కొందరు తెరలేపారు. రూ.2వేల పెన్షన్‌ అయిన తరువాత ఈ దందా మరింత కమర్షియల్‌ అయ్యింది. లబ్ధిదారులను వీరే సృష్టించి వా రినుంచి సంవత్సరం పెన్షన్‌ నెలకు రూ.2వేల చొప్పున రూ.25 వేల ఈ రాకెట్‌ సభ్యులు వసూలు చేస్తారు. జీవితాంతం లక్షల రూపా యల పెన్షన్‌ వస్తుంది కనుక రూ.24 వేలు ఇవ్వాల్సిందేనని కన్విన్స్‌ చేస్తారు. దొంగ పెన్షన్‌దారులను వీరే సృష్టిస్తారు. దొంగ పెన్షన్‌ సృష్టిం చేందుకు కాగితాలను కూడా ఈ రాకెటే తయారుచేస్తుంది. వీరంతా ఎ క్కువగా వృద్దాప్య, ఒంటరి, వితంతు మహిళల పెన్షన్లపై గురిపెట్టారు. మానవీయ కోణంలో ఉండే ఈ పెన్షన్ల బాగోతం బయటకు రాదనే ఎత్తుగడతో ఈ మూడు రకాల పెన్షన్లపై దృష్టి సారించారు. 


మూడు వేల మంది అనర్హులు..

ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కార్పొరేషన్‌లోని కొందరు అధికారులతో పాటు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఆయా డివిజన్లలో నమ్మకమైన చోటామోటా రాజకీయ నాయకులు, మాజీ కార్పొరేటర్లు కొందరిని ఈ దందాకు ఏజెంట్లుగా వాడుకుంటున్నట్టు తెలుస్తున్నది. వచ్చిన డబ్బులో వీరంతా వాటాలుగా పంచుకుంటారు. కార్పొరేషన్‌లో మొత్తం 16,099 పెన్షన్లు ప్రభుత్వం నుంచి ప్రతినెల ఇక్కడి పెన్షనర్లకు వస్తున్నాయి. మొత్తం రూ.3,53,20,000 ప్రతి నెల కార్పొరేషన్‌కు పెన్షన్ల రూపంలో వస్తుంది.


ఇందులో సుమారు 3వేల మంది వరకు ఈ రాకెట్‌ ద్వారా సృష్టించబడిన దొంగ పెన్షన్లు ఉన్నట్టు తెలుస్తున్నది. అంటే ప్రతి నెల ప్రభుత్వ సొమ్ము రూ.50లక్షల నుంచి రూ.60లక్షల మేర అనర్హులైన వారికి పెన్షన్ల రూపంలో వెళు తున్నది. ఫలితంగా లక్షలాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్విని యోగం అవుతున్నది. 5,041 వృద్ధాప్య పెన్షన్లు, 2,915 వికలాంగుల పెన్షన్లు, 7,420 వితంతు పెన్షన్లు, 43 నేత కార్మికు లకు, 64 కల్లుగీత కార్మికులకు, 551 ఒంటరి మహిళలకు, 65బీడీ వర్కర్స్‌కు పెన్షన్లు వస్తున్నాయి. 


రెండుమూడేళ్లుగా..

ఇదంతా రెండుమూడేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న దందా. ఈ దందాలో ఆర్థిక కోణం కాకుండా రాజకీయ కోణం కూడా ముడిపడడంతో ఈ రాకెట్‌ చేసిన పెన్షన్ల బాగోతం అనుమానాలకు తావిచ్చింది. కార్పొరేషన్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల పందేరం కోసం కొందరు అప్పటి కార్పొరేటర్లు కొన్ని డివిజన్లలో ఇలాంటి అనర్హ మైన పెన్షన్లు అధికంగా మంజూరు చేయించుకున్నారు. ఎన్నికల్లో ఈ పెన్షనర్లను ఓట్లుగా మార్చుకునే కోణం కూడా ఇందులో ఉంది. ఇలాం టి రాజకీయ నాయకులకు కూడా ఆ రాకెటే మార్గదర్శనం చేసింది. దీం తో ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు ప్రత్యర్థులు ఈ విషయాన్ని పసిగట్టి వివరాలు సేకరించారు. అయితే ఎన్నికల సమయంలో దొంగ పెన్షన్లపై ఫిర్యాదు చేస్తే నష్టం జరుగుతుందని, ఆ తరువాత పూర్తి వివరాలతో రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌కు కొందరు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.


ఈ ఫిర్యాదులో దొంగ పెన్షన్‌ పొందుతున్న వారి ఐడీ నెంబర్లతో సహా వివరాలు అందించినట్టు సమాచారం. దీంతో సం బంధిత పెన్షన్‌ సెక్షన్‌లో పనిచేస్తున్న కొందరిపై కమిషనర్‌ వేటు వేసిన ట్టు తెలుస్తున్నది. ఆ సెక్షన్‌లో పనిచేస్తున్న వారిని ఇతర సెక్షన్లకు బది లీచేసి వారిపై విచారణ జరుపుతున్నట్టు సమాచారం. ఈ బాగోతంపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవ కాశం ఉంది. గోదావరిఖని పట్టణంలోని ఒక డివిజన్‌లో 540 పెన్షన్లు ఉంటే 124పెన్షన్లు వితంతు, ఒంటరి మహిళ, వృద్ధాప్య క్యాటగిరిల్లో ఉన్న అనర్హులకు మంజూరవుతున్నట్టు తెలుస్తున్నది. 


Updated Date - 2020-05-16T10:15:20+05:30 IST