Advertisement
Advertisement
Abn logo
Advertisement

గోదావరి జిల్లాల్లో టీడీపీకి ఊహించని షాక్.. ఎమ్మెల్యే రాజీనామా..!

అమరావతి : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు నుంచే మొదలైన నేతల జంపింగ్‌లు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అసలు ఎప్పుడు ఏ నేత.. ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. ఊహించని రీతిలో సీట్లు దక్కించుకుని అధికారంలోకి వచ్చిన వైసీపీలోకి పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీలు, కీలక నేతలు జంప్ అయ్యారు. ఇంకొందరు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనప్పటికీ వారి కుటుంబ సభ్యులను పార్టీలో చేర్చి.. అధికార పార్టీకి మద్దతిస్తూ వస్తున్నారు. అంతేకాదు.. తామంతా రాజీనామాకు కూడా సిద్ధంగా ఉన్నట్లు అనేక సార్లు ప్రకటనలు కూడా చేశారు. అయితే.. ఈ వరుస షాకుల నుంచి తెలుగుదేశం పార్టీ తేరుకోక ముందే మరో ఊహించని షాక్ తగలబోతోంది.

కారణం ఇదేనా...!?

గోదావరి జిల్లాల్లో ఇప్పటికే పలువురు సిట్టింగ్‌లు వైసీపీ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా మరో సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి గుడ్ బై చెప్పేయడానికి సిద్ధమైపోయారు. రెండు మూడ్రోజుల్లో శాసన సభ్యత్వానికి, టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ తీరుపై బుచ్చయ్య తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలియవచ్చింది. సీనియర్లను హైకమాండ్ అవమానిస్తోందని బుచ్చయ్య ఆవేదనకు లోనైనట్లు సమాచారం. తన లాంటి సీనియర్ నేత ఫోన్‌ను కూడా తండ్రీకొడుకు (నారా చంద్రబాబు, నారా లోకేష్) అటెండ్ చేయట్లేదని ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని తెలుస్తోంది.

ఆవిర్భావం నుంచి టీడీపీలోనే..!

కాగా.. టీడీపీ ఆవిర్భావం నుంచి బుచ్చయ్య చౌదరి పార్టీలో ఉన్నారు. 1995 టీడీపీ సంక్షోభంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ వెంటే బుచ్యయ్య నడిచారు. అయితే.. చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీ అధికారంలోకి వచ్చాక సీనియర్ నేత అయినప్పటికీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. అధినేత తీరుపై అప్పట్లో బుచ్చయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా చౌదరి ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ హవాను తట్టుకుని నిలిచి మరీ బుచ్చయ్య విజయం సాధించారు. ఆయన పార్టీ మార్పుపై ఇంతవరకూ తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరూ రియాక్ట్ అవ్వలేదు.

వైసీపీలోకేనా...!?

అయితే.. బుచ్యయ్య పార్టీకి రాజీనామా  చేయలేదు.. ఒకవేళ పార్టీ పెద్దలు బుజ్జగిస్తే వెనక్కి తగ్గుతారా..? లేకుంటే రాజీనామా చేసేసి పార్టీ మారిపోతారా..? అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ రాజీనామా చేసేస్తే రాష్ట్రం అధికారంలో ఉన్న వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా..? లేకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా..? అనేది తెలియాలి. వాస్తవానికి వైసీపీపై మొదట్లో బుచ్చయ్య.. తీవ్ర స్థాయిలో అటు మీడియా ముందు.. ఇటు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రశ్నాస్త్రాలు సంధిస్తుండే వారు. గత మూడు నాలుగు నెలలుగా ఆయన టీడీపీ కార్యక్రమాల్లో కానీ.. అధికార పార్టీ గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. దీన్ని బట్టి చూస్తే బుచ్చయ్య కచ్చితంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఏదేమైనా రెండు మూడ్రోజుల్లో బుచ్చయ్య వ్యవహారం ఓ కొలిక్కి రానుంది.

Advertisement
Advertisement