కేంద్ర వైఫల్యం వల్లనే భారీ మూల్యం

ABN , First Publish Date - 2021-05-05T05:42:18+05:30 IST

ప్రస్తుతం రోజుకి సుమారు నాలుగు లక్షలకు పైగా కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి అవసరమైన స్థాయిలో వాక్సిన్‌లు, రెమిడెసివిర్‌ మందులు...

కేంద్ర వైఫల్యం వల్లనే భారీ మూల్యం

ప్రస్తుతం రోజుకి సుమారు నాలుగు లక్షలకు పైగా కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి అవసరమైన స్థాయిలో వాక్సిన్‌లు, రెమిడెసివిర్‌ మందులు, మెడికల్‌ ఆక్సిజన్‌ మున్నగువాటిని అందుబాటులో ఉంచేందుకు నిర్దిష్ట ప్రణాళికను మోదీ ప్రభుత్వం ముందుచూపుతో రూపొందించకపోవడం కరోనా రెండవ వేవ్‌ తీవ్రతరమయ్యేందుకు కారణమైంది. వాక్సిన్ల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల కొద్దిరోజుల క్రితం మాత్రమే సీరం ఇన్‌స్టిట్యూట్‌కు రూ.3,000 కోట్లు, భారత్‌ బయోటెక్‌కు రూ.1,500 కోట్లు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. మన దేశంలో వ్యాక్సిన్లు తయారు చేసే సామర్థ్యం ఏడు ప్రభుత్వరంగ సంస్థలకు ఉంది. వీటిలో సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, కసౌ; బి.సి.జి. వాక్సిన్‌ లేబరేటరీ, ఢిల్లీ; పాక్చర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, కూనూర్‌‍లతో పాటు తమిళనాడులో ఒక సమీకృత వాక్సిన్‌ కాంప్లెక్స్‌ ఉంది. బొంబాయి లోని హాఫ్‌కిన్‌ బయోఫార్మాసూటికల్‌ కార్పొరేషన్‌, హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్, బులంద్‌ షహర్‌లోని భారత్‌ ఇమ్యునోలాజికల్స్‌ బైలాజికల్స్‌ లిమిటెడ్‌ సంస్థలలో వాక్సిన్ల ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఏప్రిల్‌ 16, 2021న నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయం ఆరు నెలల క్రితమే తీసుకుని ఆ సంస్థలకు తగిన ఆర్థిక సహాయాన్ని అందించి ఉంటే ప్రస్తుత భయానక పరిస్థితి వచ్చేది కాదు. 


నేడు అనేక రాష్ట్రాలలో ఆక్సిజన్‌ సరఫరా లేక కొవిడ్‌ రోగులు పిట్టల వలె రాలిపోతున్నారు. మొత్తంగా మన దేశానికి రోజుకు 7,127 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉన్న 28 స్టీల్‌ ప్లాంట్లలో నుంచి రోజుకు 1500 టన్నుల ఆక్సిజన్‌‍ను ఉత్పత్తి చేయవచ్చు. మన దేశంలోని అతిపెద్ద ఆక్సిజన్‌ తయారి సంస్థ ఐనాక్స్‌ వివిధ ప్రాంతాలలో ఉన్న 44 యూనిట్ల ద్వారా రోజుకు 2000 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఏప్రిల్‌ నెలలో రోజుకు 2,500 టన్నుల అవసరం ఉండే తొమ్మిది క్యాటగిరీల పరిశ్రమలు మినహా మిగతా పరిశ్రమలకు ఆక్సిజన్‌ సరఫరాను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది. ఆ తొమ్మిది రకాల పరిశ్రమలకు అందాల్సిన ఆక్సిజన్‌‌ను కూడా కొవిడ్‌ ట్రీట్‌మెంటుకు మళ్ళిస్తే తప్ప పరిస్థితి మెరుగుపడదు.


ఆక్సిజన్‌ తయారీకి పరిమితులేగాక రవాణా, నిల్వలకు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. హాస్పిటల్‌‍లోనే రూ.1.25 కోట్ల ఖర్చుతో పి.యస్‌.ఎ., ఆక్సిజన్‌ జనరేటింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయవచ్చు. రూ.200ల కోట్ల ఖర్చుతో 162 హాస్పిటల్స్‌లో ఈ తరహా వ్యవస్థలను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం జరిగినా, ఇప్పటికి కేవలం 33 హాస్పటల్స్‌లోనే వీటి ఏర్పాటు జరిగింది. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఒక్కచోట కూడా ఏర్పాటు కాలేదు. కేంద్రం రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించి 1620 హాస్పిటల్స్‌లో ఈ సదుపాయం కల్పించి వుంటే 1540 టన్నుల ఆక్సిజన్‌ సులభంగా హాస్పిటల్స్‌‍లోనే రోగులకు అందుబాటులో ఉండేది.


దేశంలో ఏడు కంపెనీలు రెమిడెసివిర్‌ మందును ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. నెలకు 38.80 లక్షల ఇంజక్షన్లను తయారుచేసే సామర్థ్యం ఉంది. గత ఆరు మాసాల కాలంలో 30 లక్షల ఇంజక్షన్లు ప్రైవేటు రంగానికి, 5 లక్షల ఇంజక్షన్లు ప్రభుత్వ రంగానికి సరఫరా అయ్యాయని అంచనా. 


11 లక్షల ఇంజక్షన్లు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఇప్పుడు ఈ మందు పెద్ద ఎత్తున బ్లాక్‌మార్కెట్‌లో అమ్మబడుతోంది. ఆవిధంగా లేని కొరత సృష్టించబడి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సరైన నియంత్రణ, కఠినమైన ఆంక్షలు లేకపోవడం వలన దాదాపు 10 రెట్ల ఎక్కువ ధరకు ప్రజలు దీన్ని కొనుక్కోవలసిన దుస్థితి ఏర్పడింది.


మరొక ముఖ్యమైన అంశాన్ని కూడా మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అక్టోబర్‌ 5, 2020నే ఇప్పుడు వ్యాప్తిలో ఉన్న బి.1.617ను కొత్త కరోనా స్ట్రెయిన్‌గా శాస్త్రజ్ఞులు తెలిపారు. ఈ కరోనా స్ట్రెయిన్‌కు సంబంధించి వేలాది శాంపిల్స్‌ను సేకరించి, జీన్‌ సీక్వెన్సింగ్ పైన పరిశోధనలు జరిపి, కట్టడి చేసేందుకు తీసుకోవలసిన మందులపై శాస్త్రజ్ఞులు కృషి చేయాలి. కేంద్రప్రభుత్వం మూడు మాసాలు పోయిన తరువాత జనవరి 2021లో రూ.115 కోట్ల ఖర్చుతో దేశంలోని పది ప్రముఖ లేబరేటరీలలో ఈ అంశంపైన పరిశోధనలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నది. కానీ బయో టెక్నాలజి డిపార్టుమెంటుకి ప్రభుత్వం తరఫు నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల చెయ్యలేదు. చివరకు ఆ సంస్థ తన అంతర్గత వనరుల నుంచి రూ.80 కోట్లను ఇందుకు ఖర్చు చేసేందుకు నిర్ణయించాల్సి వచ్చింది. సెకండ్‌ వేవ్‌ విషయంలో నిపుణుల కమిటీ ఎన్నడో హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కరోనా వ్యాధిని కట్టడి చేసేందుకు రూ.35,000 కోట్లు ఖర్చు చెయ్యాలని కేంద్రం నిర్ణయించినప్పటికీ అందులో నుంచి ఇప్పటికీ పెద్దగా ఖర్చు చేసింది లేదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా వాక్సిన్లు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నందుకు అభినందించాలి. ఈ పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వమే మొత్తంగా వాక్సిన్‌లను రూ.150 లేక రూ.250 చొప్పున కంపెనీల నుంచి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు అందజేయాల్సిన అవసరం ఉంది. మే 1 నుంచి 18 ఏళ్ళు దాటిన వారికి కూడా కరోనా టీకాలు వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇంతవరకు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కరోనా వాక్సిన్‌ను ప్రజలకు ఉచితంగా వేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో 18 ఏళ్ళు పైబడినవారు బహిరంగ మార్కెట్‌లో వాక్సిన్లను కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ఇటీవలి కాలంలో పెట్రోలు, డీజిలు, వంటగ్యాస్‌ ధరలను చాలా అత్యధిక స్థాయికి పెంచడం ద్వారా దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల పైన అదనపు ఆదాయాన్ని పొందింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుత విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వమే నేరుగా వ్యాక్సిన్లను కొని రాష్ట్రాలకు సరఫరా చేయవలసిన బాధ్యత ఉండగా అందుకు విరుద్ధంగా 50శాతం భారాన్ని రాష్ట్రాల పైకే నెట్టేసింది. కేంద్రం తాజా నిర్ణయానుసారం భారత్‌లో వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేసే సంస్థలు 50 శాతాన్ని కేంద్రానికిచ్చి, మిగిలిన 50శాతాన్ని రాష్ట్రాలకు, బహిరంగ మార్కెట్లకు అమ్ముకోవచ్చు. ‘‘ఒకే దేశం-–ఒకే మార్కెట్‌’’ అని మాట్లాడే ప్రధాని మోదీ సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సముచితమైన ధరకు కేంద్రానికి, రాష్ట్రాలకు, ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు ఒకేవిధంగా సరఫరా చేసేట్టు ఉత్తర్వులు ఇవాలి. ఇతర దేశాల నుంచి దిగుమతి చేయబోతున్న స్పుత్నిక్‌–‌-వి; ఫైజర్‌, మెడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ లాంటి సంస్థల ఉత్పత్తులను ప్రభుత్వానికి ఇవ్వకుండా పూర్తిగా బహిరంగ మార్కెట్‌లో అదే ధరకు అమ్మేలా ఉత్తర్వులను ఇవ్వాలి. లేదంటే రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కరోనా కట్టడి కొరకు తీసుకొనే చర్యలకు కొంత విఘాతం ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఉద్దేశ్యం మంచిదైనప్పటికీ ఆచరణలో అందుకు భిన్నంగా మార్కెట్‌ శక్తులు చొరబడి, బ్లాక్‌ మార్కెట్‌కు ఆస్కారం ఏర్పడి, పేద ప్రజలపైన భారం పడే ప్రమాదముంది. 


జనవరి 16, 2021లో కరోనా వాక్సినేషన్‌ ప్రారంభమైన దరిమిలా యిప్పటివరకు సుమారు 12 కోట్ల ప్రజలు ఒక డోస్‌ తీసుకొని వుండగా దాదాపు 3 కోట్ల మంది మాత్రమే రెండవ డోస్‌ తీసుకున్నారు. జూలై నాటికి 25 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలన్న లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. నవంబరు 2020 నుండి ఫిబ్రవరి 2021 వరకు మొదటి దశ కరోనా తీవ్రత కొంత తగ్గిన కాలంలో, మన దేశంలో తయారవుతున్న కరోనా వాక్సిన్లను ఇతర దేశాలకు వాణిజ్యపరంగా విక్రయించకుండా ఆంక్షలు విధించి, కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు, ఆరోగ్యశ్రీతో అనుబంధం వున్న ప్రైవేట్‌ ఆసుపత్రులకు అందచేసి ఉంటే రెండవ దశ ఇంత తీవ్రరూపం దాల్చివుండేది కాదు. పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికలపైన చూపిన ఆసక్తి, పట్టుదల దేశప్రజలకు కరోనా వాక్సిన్‌ అందించే విషయంలో మోదీ చూపలేకపోయారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం వెంటనే ‘‘జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి’’ని ప్రకటించి ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ కొవిడ్‌ బాధితుల నుంచి వసూలు చేస్తున్న చార్జీలను నియంత్రించాలి. ప్రజల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత అధికంగా కేంద్ర ప్రభుత్వంపైన, కొంతమేరకు రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. అందుకనుగుణంగా ప్రధానమంత్రి మోదీ వ్యవహరించకపోతే చరిత్రహీనుడిగా నిలిచిపోతారు.

వడ్డే శోభనాద్రీశ్వరరావు

Updated Date - 2021-05-05T05:42:18+05:30 IST