త్రిగుణాత్మకం మానవదేహం

ABN , First Publish Date - 2020-07-01T08:18:03+05:30 IST

ప్రతి వ్యక్తీ భుజించే ఆహారం మూడు విధాలుగా ఉంటుందని.. సత్వ గుణం కలిగిన వారు సాత్విక ఆహారాన్ని, రజో గుణం కలిగిన వారు రాజసిక ఆహారాన్ని, తమో గుణం కలిగిన...

త్రిగుణాత్మకం మానవదేహం

ప్రతి వ్యక్తీ భుజించే ఆహారం మూడు విధాలుగా ఉంటుందని.. సత్వ గుణం కలిగిన వారు సాత్విక ఆహారాన్ని, రజో గుణం కలిగిన వారు రాజసిక ఆహారాన్ని, తమో గుణం కలిగిన వారు తామసిక ఆహారాన్ని ఇష్టపడతారని భగవద్గీత పదిహేడో అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశాడు. పాలు, పెరుగు, నెయ్యి, కాయగూరలు, ఆకుకూరలు, కందమూలాలు మొదలైనవి సాత్వికాహారం. సాత్వికాహార సేవనం వలన ఇంద్రియాలకు శక్తి, బుద్ధి వికాసం, చురుకుదనం, ఆయుర్వృద్ధి, ఉత్సాహం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత కలుగుతాయి.


అన్నం బ్రహ్మేతి వ్యజానాత్‌

..అన్నాన్ని పరబ్రహ్మగా భావించాలి అని తైత్తరీయోపనిషత్తు చెబుతోంది. అన్నమే ప్రాణాన్ని నిలబెడుతుంది. ఆకలిని తీర్చి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆహారం సరైనది కానప్పుడు అనారోగ్యం కలుగుతుంది. కాబట్టి ఆహారం శరీరపోషణకు సరియైునదై ప్రాణశక్తిని అందించేదిగా ఉండాలి. అది శరీర ఆరోగ్యానికే కాక మానసిక ఆరోగ్యానికి కూడా అవసరం.


అన్న మశితం త్రేధావిధీయతే తస్యయః స్థవిష్ఠోదాతు!

స్తద్‌ పురీషం భవతి యోమధ్యమస్తన్మాంసంయోణిష్ఠ స్తన్‌ మనః!!


మనం భుజించిన ఆహారం జీర్ణమై మూడు విధాలుగా మారుతుంది. దానిలోని స్థూల తత్వం ‘మలం’గాను, మధ్యమ తత్వం మాంసంగా, సూక్ష్మ తత్త్వం మనసుగానూ అవుతాయని ఛాందోగ్యోపనిషత్తు తెలియజేస్తున్నది. కాబట్టి అన్నమే మనసుకు ఆధారం. ఆహారం చేతనే మనసు ఏర్పడుతోంది. గుణాలకు ఆధారం మనసు. గుణాలననుసరించి ఆహార సేవనం. 


శాంతం, పవిత్రత, విద్య- విచారణ మొదలైనవి సత్వగుణాలు. ఈర్ష్య, ద్వేషం, కామం, గర్వం మొదలైనవి రజోగుణాలు. కోపం, మాలిన్యం, కాలహరణం, వ్యసనం మొదలైనవి తమో గుణాలు. ఒక వ్యక్తి సత్వ గుణాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కొంతకాలం దీక్షగా సాత్విక ఆహారాన్ని మాత్రమే సేవిస్తే చాలు. రజస్తమో గుణాలు అణచివేయబడతాయి. సత్వ గుణం వృద్ధి చెందుతుంది. అదే ఆహారం అలవాటుగా మారి ఇక వేరే ఆహారం సేవించడానికి కూడా అతని మనసు అంగీకరించదు. శరీరం కూడా ఆ విధంగా తయారవుతుంది. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం అతని గుణం(స్వభావం)పైన, గుణం మనసుపైన.. మనసు అతడు భుజించే ఆహారం పైన ఆధారపడి ఉంటాయి. సాత్వికాహారం వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది. అందుకే యోగ సాధకులు ఆహార విషయంలో నియమాలు పాటిస్తారు. యోగ సాధన సాత్విక ఆహార సేవనంతోనే మొదలవుతుంది. భోగలాలసతను వదిలిపెట్టిన వాడే యోగి.


- జక్కని వెంకటరాజం, 9440021734

Updated Date - 2020-07-01T08:18:03+05:30 IST