Abn logo
Oct 13 2021 @ 00:51AM

మిగులు సంపదలో నలుగుతున్న మానవ చరిత్ర

గ్రీస్‌ మాజీ ఆర్థికమంత్రి యానిస్‌ వేరూఫెకిస్‌ గ్రంథం ‘టాకింగ్‌ టు మై డాటర్‌ ఎబౌట్‌ ద ఎకానమీ’తెలుగు అనువాదం ‘మర ముచ్చట’ను హైదరాబాద్‌ బుక్ ట్రస్ట్‌ ప్రచురించింది. ఇటీవల ఆ పుస్తకం ఆవిష్కరణ సభలో పదిహేను సంవత్సరాల మాటూరి అర్ణవ్‌ చేసిన ప్రసంగానికి సంక్షిప్త అనువాదమిది.


మనయుగంలో ఆర్థికవ్యవస్థే సమస్త ఇతర మానవ కార్యకలాపాలను శాసిస్తోంది. అయినప్పటికీ, ఆ రంగంలో ఏమి జరుగుతుందనే విషయమై అసంఖ్యాక ప్రజల అవగాహన అంతంతమాత్రమే.

ఆర్థికవ్యవస్థ గురించి ప్రతి ఒక్కరికీ సరైన అవగాహన కలిగించేందుకు గ్రీస్ మాజీ ఆర్థికమంత్రి యానిస్ వేరూ ఫెకిస్ తన ‘టాకింగ్ టు మై డాటర్ ఎబౌట్‌ ద ఎకానమీ’లో ప్రయత్నించారు. ఒక అత్యంత జటిల అంశాన్ని సులభగ్రాహ్యం చేయడంలో ఆయన అసాధారణంగా సఫలమయ్యారు. అర్థశాస్త్ర పరిభాషను ఉపయోగించకుండానే రుణం, ధనం, సరుకు, మారకం విలువ మొదలైన ఆర్థికాంశాలను సూటిగా, సమగ్రంగా సుబోధకం చేశారు. ‘పెట్టు బడిదారీ విధానం’ అనే పదానికి బదులుగా ‘మార్కెట్ సమాజం’ అనే పదబంధాన్ని ఉపయోగించేందుకే ఆయన మొగ్గు చూపారు.

‘ఎందుకు ఇన్ని అసమానతలు?’ అనే ప్రశ్నతో ఆర్థికవ్యవస్థ గురించి తన కుమార్తెతో యానిస్ వేరూఫెకిస్ మాటామంతీ ప్రారంభమవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానమివ్వడానికై వేరూఫెకిస్, మానవేతిహాసంలో వ్యవసాయ యుగోదయం నాటికి వెళ్ళారు. ఒక ‘మార్కెట్’ (సరుకు బదలాయింపు ప్రదేశం)కు, ఒక ఆర్థికవ్యవస్థ (శ్రమశక్తి సహాయంతో ఒక సరుకును ఉత్పత్తి చేయడం)కు మధ్య ఉండే భేదాన్ని ఆయన గుర్తించారు. మానవుడు వేల సంవత్సరాల క్రితం ప్రకృతి తనకు సమర్పించిన వాటిపైనే ఆధారపడి జీవించేవాడు. అప్పట్లో వస్తువినిమయ పద్ధతి ద్వారా వ్యక్తులు, సమాజాలు తమ పరస్పర అవసరాలు తీర్చుకునేవారు. ఆర్థికవ్యవస్థ అనేది ఆనాడు ఇంకా ఉనికిలోకి రాలేదు. 12వేల సంవత్సరాల క్రితం మానవశ్రమ ఆహారాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. వ్యవసాయం ద్వారా మానవులు మొట్టమొదటగా మిగులు సంపదను సృష్టించారు. అదే ఆర్థికవ్యవస్థ ఆవిర్భావానికి దోహదం చేసింది. 


మిగులు సంపద ఉన్నదంటే అది ఎంత ఉన్నదీ, ఎవరెవరు దాని నుంచి ఎంత, ఎప్పుడు తీసుకున్నారు అనే విషయాలను గుర్తుగా రాసుకోవలసి ఉంది. ఈ ఆవశ్యకతే ధనం, లేఖన కళ, ఉద్యోగస్వామ్య వ్యవస్థను సృష్టించింది. సంచితమైన మిగులు సంపదను నిబంధనల ప్రకారం సమూహంలోని ప్రతి ఒక్కరికీ పంపిణీ చేయవలసి ఉంది ఇది న్యాయ నియమావళిని ప్రారంభించింది. మిగులు సంపదను శత్రువుల నుంచి రక్షించుకోవలసి ఉంది. ఇందుకు రాజ్యవ్యవస్థ, సైనికదళాలు అవసరమయ్యాయి. ప్రతి ఒక్కరూ రాజ్యవ్యవస్థకు పూర్తి విధేయత చూపవలసి ఉంది ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పూజారివర్గం ప్రభవించింది. మిగులు అసమాన పంపిణీ దైవనిర్దేశమని, సహజసిద్ధ వ్యవహారమని సామాన్యులు విశ్వసించేలా చేయడమే పూజారివర్గం బాధ్యత. ఆర్థికవేత్తలు పెట్టుబడిదారీ విధాన పూజారివర్గమని వేరూ ఫెకిస్ అభిప్రాయపడ్డారు. 


ఈ పరిణామాల ఫలితంగా మానవచరిత్ర అనేది మిగులుసంపదపై నియంత్రణకు పాలకశ్రేణుల మధ్య ఎడతెగని పోరుగా వర్ణించబడుతోంది. అణచివేతకు గురవుతున్న శ్రామిక శ్రేణుల తిరుగుబాట్లను అణచివేయడం చరిత్రలో ఒక నిత్యకృత్యమయింది. మిగులును సృష్టించేందుకు మానవుని అత్యంత సమర్థనీయ ప్రభావశీల సాధనం పెట్టుబడిదారీ విధానమని వేరూఫెకిస్ వాదించారు. అయితే ఇందులో ఒక ప్రమాదకరమైన లోపం ఉంది. అసమానతలను మరింతగా పెంచే అవలక్షణం ఒకటి అందులో వ్యవస్థీకృతమై ఉంది. దీనివల్లే పెట్టుబడిదారీ విధానం నియత కాలిక సంక్షోభాలకు లోనవుతూ ఉంటుంది. 


ఆర్థికవిధాన నిర్ణయ ప్రక్రియలను ప్రజాస్వామ్యీకరణ చేయాలనే పిలుపుతో వేరూఫెకిస్ తన పుస్తకాన్ని ముగించారు. ప్రభుత్వాలు ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అల్పజన ఆధిక్య ధనస్వామ్య పాలన నియంత్రణలో ఉంది. మీ డబ్బుతో ఎవరు ఏమి చేస్తున్నారనే విషయాన్ని ఈ పుస్తకాన్ని చదివిన తరువాత మీరు అర్థం చేసుకోగలిగితే ఆర్థిక నిపుణులు అనే వారిపై ఆధారపడడాన్ని మీరు తప్పక మానుకుంటారు. అయితే ఇప్పటికీ పెట్టుబడిదారీ విధానం ఏమిటి అనే విషయమై ప్రజలు గందరగోళపడుతూనే ఉన్నారు! మిమ్ములను దోపిడీ చేస్తున్న వ్యవస్థ పెట్టుబడిదారీ విధానమే. మీరు కష్టపడి సాధించుకున్న దంతా దోపిడీ అయిపోతుంది. మీరు ప్రతి రోజూ ఇంటి నుంచి పని ప్రదేశానికి వచ్చిన క్షణం నుంచి మీరు దోపిడీకి గురవుతుంటారు. మిమ్ములను స్వార్థంగా ఉపయోగించుకునేందుకు మీ బాస్ సదా ప్రయత్నిస్తుంటాడు. మీరు చేసే పనికి విలువ ఉండదు. ఇవ్వరు కూడా. 


పెట్టుబడిదారుల లక్ష్యం లాభార్జన. ధనాన్ని సంచితం చేసుకునేందుకు సదా లాభాలను ఆర్జించేందుకు వారు ప్రయత్నిస్తుంటారు. ఇదొక విధమైన మృగ స్వభావం. అది పెట్టుబడిదారీ విధాన ఏకైక ప్రేరణ. అయితే అది పెట్టుబడిదారులను వ్యక్తిగతంగా దురాశపరులను చేయదు. వారిలో కొంతమంది అత్యాశాపరులు లేకపోలేదు. ఏమైనా ఇక్కడ మంచి-చెడు అనే వాటికి ఎటువంటి ప్రమేయం లేదు. ఇతర విషయానిల కంటే లాభాలను గరిష్ఠంగా పెంపొందించుకోవడమే వారి లక్ష్యం. లేనిపక్షంలో మరింత నిర్దాక్షిణ్యమైన తెలివైన పెట్టుబడిదారుల ధనాశకు బలి కావలసి ఉంటుంది. ఇది మార్కెట్ అటవీన్యాయం. కనుక లాభం అనేది పెట్టుబడిదారీ విధాన జీవ శోణితం. అయితే ఈ లాభాలు ఎక్కడ నుంచి వస్తాయి? మీ నుంచే. అవును, మీ శ్రమే పెట్టుబడిదారు లాభాలకు మూలాధారం. 


మీ నగరం లేదా పట్టణం మీ రాష్ట్రం, మీ దేశంలోనూ, ఇంకా యావత్‌ ప్రపంచంలోనూ ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు. లేనివారు మరింతగా అణగారిపోతున్నారు. ఒక యజమాని మీ శ్రమను ‘దోపిడీ’ చేస్తాడు. భావోద్వేగంతో నేనీ మాటలు అనడం లేదు. ఉత్పత్తి, వేతనాల మధ్య ఉన్న వ్యత్యాసం ఆధారంగానే నేనీ మాట అంటున్నాను. పెట్టుబడిదారీ వ్యవస్ధలు దోపిడీకి దోహదం చేసే ఆచరణలకు ప్రసిద్ధి. ఈ వ్యవస్థలో దోపిడీ అనేది ఎప్పటికీ అంతమవదు. శ్రామికులకు తక్కువ వేతనాలు ఇస్తారు. ఎక్కువ పని చేయించుకుంటారు. వేతనాలు పెంచకుండా ఈ ఉత్పత్తిని మరింత పెంచేలా చేస్తారు. ఒక కార్పొరేట్ సంస్థకు లాభాలు వచ్చినప్పుడు జరిగేది ఇదే. మరింత అదనపు విలువ సృష్టించేందుకు మీరు శాయశక్తులా కృషి చేయాలి. అయితే మీకు అదనంగా చెల్లించరు. వ్యాపార వేత్తల సంఖ్య లక్షల్లో ఉండవచ్చుగానీ మీలాంటి శ్రామికులు వందల కోట్ల సంఖ్యలో ఉన్నారు. 


యజమానుల, శ్రామికుల వ్యక్తిత్వాలు భిన్నమైనవి. ఈ రెండు వర్గాల మధ్య ఒక వ్యత్యాసం ఉంది. యజమానులు ఉత్పత్తి సాధనాలకే గాకుండా శ్రమించే శ్రామికులకు కూడా యజమానులే. పెట్టుబడిదారీ సమాజాలలో కార్మికులు తమ శ్రమ ద్వారా సృష్టిస్తున్న మిగులు సంపద పెట్టుబడిదారులకే భుక్తమవుతుంది. ఇందులో మినహాయింపు ఏమీ లేదు. మీ సామర్థ్యాన్ని బట్టి మీకు వేతనం చెల్లిస్తారు. మరింత ధనాన్ని సంచితం చేసుకునేందుకు మీ సామర్థ్యం తోడ్పడాలి. అలా చేస్తేనే మీకు మనుగడ. మీరు చేసే పనికి సరైన విలువ ఇవ్వరు. అందుకే పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మికులకు వేతనాలు చాలా తక్కువస్థాయిలో ఉంటాయి. శ్రమ అదనపు విలువను స్వార్జితం చేసుకోవడమే లాభం. ఏ లాభాలు అయినా సరే చౌర్యంతో సంపాదించినవే. మీరు శ్రమ దోపిడీకి బాధితులు. 


 రోజువారీ జీవితంలో పేద-ధనిక అంతరాలు పెరిగి పోతున్నాయి. కోటీశ్వరులు తమ కార్మికుల శ్రమను దోపిడీ చేసి, సంపదను దాచుకుంటున్నారు. మహమ్మారి కాలంలో పన్నుల చెల్లింపును ఎగవేసి 565 బిలియన్ డాలర్ల మేరకు తమ ఆస్తులను మరింతగా పెంచుకున్నారు. ఒక పక్క మహమ్మారి మనలను సతమతం చేస్తోంది. మరోపక్క వాతావరణ మార్పులు తీవ్రమవుతున్నాయి. ప్రపంచంలో దాదాపు 300 కోట్ల మందికి తమ తదుపరి భోజనం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అయినా కుబేరులు మరింతగా లాభాల ఆర్జనకే ఆరాటపడుతున్నారు. ప్రపంచంలో అత్యధిక ఆస్తులు గల మొదటి 26 మంది మహా కోటీశ్వరులు, 380 కోట్ల మంది పేదలకు ఉన్న మొత్తం ఆస్తుల కంటే ఎక్కువ సంపద కలిగిఉన్నారు. మనదేశంలో 140 మంది మహా కోటీశ్వరులు ఉన్నారు. అయినా మన ప్రధానమంత్రి నగదీకరణ ప్రక్రియ ద్వారా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు!


ఇటువంటి క్లిష్ట సమయంలో యానిస్ వేరూఫెకిస్ పుస్తకం ‘టాకింగ్ టు మై డాటర్ ఎబౌట్ ది ఎకానమీ’ తెలుగులో వెలువడడం ఒక గొప్ప మేధో అవసరాన్ని తీరుస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కార్మికులు ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా తాము ఎలా దోపిడీకి గురవుతున్నదీ అర్థం చేసుకోగలుగుతారు. ఒక సంఘంగా సంఘటితమై హక్కుల కోసం పోరాడి తమ జీవితాలలోనూ, విశాల సమాజంలోను మార్పులు తీసుకురాగలుగుతారు. సంపద సృష్టికర్తలైన శ్రామికులు ఎలా దోపిడీకి గురవుతున్నారో ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా విద్యార్థులు సైతం తెలుసుకోగలుగుతారు. ఈ కల్లోల కాలంలో ఈ దేశ విద్యార్థులను ‘మీరు ఎవరి పక్షాన ఉన్నారు?’ అని ప్రశ్నించవలసిన అవసరం ఉంది. మహాకవి శ్రీశ్రీ ఏమన్నారో ఒకసారి గుర్తుచేస్తాను: ‘కొంతమంది కుర్రవాళ్ళు/ పుట్టుకతో వృద్ధులు/ పేర్లకీ పకీర్లు/ పుకార్లకీ నిబద్ధులు’. విద్యార్థుల గురించే మన మహాకవి ఆ మాటలన్నారు! కనుక మీరు పాత, దిక్కుమాలిన భావాలతోనే కొనసాగుతూ ప్రభుత్వాలు తీసుకువస్తున్న అసమాన చట్టాలను సమర్థిస్తారా? లేక, శ్రీశ్రీ మహాకవి అన్నట్టు ‘కొంతమంది యువకులు/ రాబోవు యుగం దూతలు/ పావన నవజీవన/ బృందావన నిర్మాతలు’గా ఉంటారా? అలా ఉండడమంటే మార్క్స్, భగత్‌సింగ్ లాంటి వారి భావాలను ఔదలదాల్చాలి. దేశంలో మరింత మెరుగైన పరిస్థితుల కోసం పోరాడుతున్న విద్యార్థి సంఘాలకు బాసటగా నిలబడాలి. ఈ రెండూ మీ విధ్యుక్త ధర్మాలు. మరి మీరు వాటిని నిర్వర్తిస్తారా?


పెట్టుబడిదారుల లక్ష్యం లాభార్జన. ధనాన్ని సంచితం చేసుకునేందుకు సదా లాభాలను ఆర్జించేందుకు వారు ప్రయత్నిస్తుంటారు. ఇదొక విధమైన మృగ స్వభావం. అయితే అది పెట్టుబడిదారులను వ్యక్తిగతంగా దురాశపరులను చేయదు. వారిలో కొంతమంది అత్యాశాపరులు లేకపోలేదు. ఏమైనా ఇక్కడ మంచి-–చెడు అనే వాటికి ఎటువంటి ప్రమేయం లేదు. ఇతర విషయాల కంటే లాభాలను గరిష్ఠంగా పెంపొందించుకోవడమే వారి లక్ష్యం. ఇది మార్కెట్ అటవీన్యాయం. అయితే ఈ లాభాలు ఎక్కడ నుంచి వస్తాయి? మీ నుంచే. అవును, మీ శ్రమే పెట్టుబడిదారు లాభాలకు మూలాధారం.