మానవ తప్పిదమే కారణం

ABN , First Publish Date - 2020-06-02T07:50:27+05:30 IST

ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ నిర్లక్ష్యం వల్లే విశాఖపట్నంలోని ఆ సంస్థ నుంచి గ్యాస్‌ లీకైందని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) నియమించిన జస్టిస్‌ శేషశయనారెడ్డి కమిటీ తేల్చింది. ఇందులో మానవ తప్పిదం ఉందని స్పష్టం చేసింది. గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనను సుమోటోగా స్వీకరించిన ఎన్జీటీ విచారణ...

మానవ తప్పిదమే కారణం

  • విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనపై ఎన్జీటీ 
  • ట్యాంకుల నిర్వహణ లోపంతోనే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం 
  • జస్టిస్‌ శేషశయనారెడ్డి కమిటీ నివేదిక 

న్యూఢిల్లీ, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ నిర్లక్ష్యం వల్లే విశాఖపట్నంలోని ఆ సంస్థ నుంచి గ్యాస్‌ లీకైందని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) నియమించిన జస్టిస్‌ శేషశయనారెడ్డి కమిటీ తేల్చింది. ఇందులో మానవ తప్పిదం ఉందని స్పష్టం చేసింది. గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనను సుమోటోగా స్వీకరించిన ఎన్జీటీ విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సోమవారం ఎన్జీటీ చైర్మన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌, న్యాయ సభ్యులు జస్టిస్‌ ఎస్‌కే సింగ్‌, సభ్య నిపుణుడు డాక్టర్‌ నాగిన్‌ నందాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్‌ శేషశయనారెడ్డి కమిటీ తన నివేదికను ధర్మాసనానికి సమర్పించింది. ఈ నివేదికపై అభ్యంతరాలు తెలియజేయాలని ఎల్జీ పాలిమర్స్‌ను ట్రైబ్యునల్‌ ఆదేశించింది. కమిటీ నివేదిక, ఆ సంస్థ అభ్యంతరాల పరిశీలించిన తర్వాత త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.  కాగా, దుర్ఘటనకు సంబంధించిన వివరాలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలతో కూడిన అఫిడవిట్‌ను కేంద్ర పర్యావరణ శాఖ దాఖలు చేసింది. అలాగే, గతంలో రూ.50 కోట్లు డిపాజిట్‌ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఆ మొత్తం చెల్లించామని ఎల్జీ పాలిమర్స్‌ కూడా అఫిడవిట్‌ దాఖలు చేసింది. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి 24 నుంచి ప్లాంట్‌ను మూసివేశారని, లాక్‌డౌన్‌ ప్రారంభమయ్యే నాటికి నాలుగు ట్యాంకుల్లో స్టైరిన్‌ గ్యాస్‌ ఉందని కమిటీ నివేదిక స్పష్టం చేసింది.


గ్యాస్‌ లీకైన ఎం ట్యాంకు పాతదని, దానికి కింద తప్ప మధ్య, పైస్థాయిల్లో ట్యాంకుకు ఉష్ణోగ్రతల సెన్సార్లు లేవని తేల్చింది. కొంతకాలం పాటు ప్లాంట్‌ పనిచేయకపోవడం వల్ల ఉష్ణోగ్రతలు పెరగడం ద్వారా ఒత్తిడి పెరిగిందని, దాంతో స్టేఫ్టీ వాల్వ్‌లు తెరుచుకొని గ్యాస్‌ లీకైందని వివరించింది. అయితే, అది తెరుచుకున్నప్పుడు అలారం మోగలేదని, ఉష్టోగ్రత, రిఫ్రిజిరేషన్‌ మధ్య ఇంటర్‌లాక్‌ వ్యవస్థ లేదని స్పష్టం చేసింది. కాగా, గ్యాస్‌ లీకేజీ సమస్య ఏప్రిల్‌ 20న మొదలైనట్లు తమ అధ్యయనంలో తేలిందని వివరించింది. శిక్షణ కలిగిన సిబ్బంది లేని కారణంగా ఆ సంస్థ పరిస్థితిని అంచనా వేయలేకపోయిందని పేర్కొంది. ట్యాంకుల నిర్వహణ, పర్యవేక్షణంపై ఎల్జీ పాలిమర్స్‌ సంస్థకు అనుభవం లేకపోవడమే ఈ దుర్ఘటనకు ప్రాథమిక కారణమని భావిస్తున్నామని స్పష్టం చేసింది. 


లోపాలు ఇవే..

  1. ప్లాంట్‌లోని స్టైరిన్‌ ట్యాంక్‌లో కాన్‌సెంట్రేషన్‌ చేయడానికి సరిపడా టెరిటరీ బ్యూటైల్‌ కాటెకాల్‌ (టీబీసీ) లేదు. 
  2. ఆక్సిజన్‌ను ఆవిరిగా మార్చే క్రమంలో పర్యవేక్షణ వ్యవస్థ లేదు.
  3. నిల్వ ట్యాంకుపై లేయర్లలో ఉష్ణోగ్రతల పర్యవేక్షణ చేపట్టడం లేదు
  4. రిఫ్రిజిరేషన్‌ సిస్టమ్‌ 24 గంటల పాటు నిర్వహించడం లేదు
  5. పెద్ద ఎత్తున మానవ తప్పిదం ఉంది. నిల్వ ట్యాంకుల నిర్వహణ చూసే సిబ్బంది, ప్లాంట్‌ ఇన్‌చార్జి నిర్లక్ష్యం.

Updated Date - 2020-06-02T07:50:27+05:30 IST