మానవ గర్వభంగం

ABN , First Publish Date - 2020-04-05T07:28:36+05:30 IST

కరోనా ఉత్పాతం మానవజాతి అహంకారాన్ని కూకటివేళ్ళతో కూల్చివేస్తున్నది. ‘ఈ భూమి అంతానాదే, నేనే సర్వధికారిని, ప్రతిచెట్టూ, ప్రతిపిట్టా నాకు దాసోహం అనవలసిందే’ అని విర్రవీగిన మానవజాతి, నేడు భయవిహ్వలమై మోకాళ్ళమీద ...

మానవ గర్వభంగం

కరోనా అసంకల్పిత, అయాచిత, అనూహ్య ప్రమాదం కాదు. ఇది మనిషి స్వయంకృత అపరాధం పర్యావరణ విధ్వంస ఫలితం. మానవ అహంకృతి మీద ప్రకృతి తీర్చుకుంటున్న ప్రతీకారం.


భౌతికవృద్ధికన్నా, నైతికవృద్ధికోసం మనిషి తపించాలి. ఇప్పుడు మతంకన్నా మానవత్వం గురించి చర్చించాలి. మనిషి విజ్ఞానమే జయిస్తుంది. అది మానవీయ  స్వభావాన్ని కలిగుండాలి. డాక్టర్ అంబేడ్కర్ చెప్పినట్లు అసమానతలను సమర్థించని మతాలను నిర్మించుకోవాలి. అప్పుడు మతం నోరులేనివారినోరుగా, గుండెలేనివారిగుండెగా, ఆత్మలేనివారిఆత్మగా వికసిస్తుంది. ఆ మతమే ప్రకృతిహితంగా పరిణమిస్తుంది.


కరోనా ఉత్పాతం మానవజాతి అహంకారాన్ని కూకటివేళ్ళతో కూల్చివేస్తున్నది. ‘ఈ భూమి అంతానాదే, నేనే సర్వధికారిని, ప్రతిచెట్టూ, ప్రతిపిట్టా నాకు దాసోహం అనవలసిందే’ అని విర్రవీగిన మానవజాతి, నేడు భయవిహ్వలమై మోకాళ్ళమీద కూలబడి రోదిస్తున్నది. స్వార్థం, అహంభావం, విచ్చలవిడిసుఖం, అధికారదర్పం, సామ్రాజ్యకాంక్ష, వెరసి మనిషి చేసిన అఘాయిత్యాలు, క్షమించరాని పాపాలు నేడు తిరగబడి, వెంటాడి వెంటాడి, వేటాడుతున్నాయి. స్థాపించిన సామ్రాజ్యాలు, నిర్మించిన కృత్రిమచట్టాలు, వేల సంవత్సరాల విజ్ఞానం, నవనాగరికజీవనం అంతా ఒక సూక్ష్మక్రిమి ముందు కుంచించుకుపోయి తలదించింది. ఒక నిష్ఫల, నిష్టురవేదన, శవాలు కాలుతున్న కమురువాసన ప్రపంచాన్ని ఆవరించింది. సమస్త మానవ ప్రపంచాన్ని తన చేతులలోకి తీసుకొని, ప్రకృతి ఒక్క చెంపదెబ్బ కొడితే ఏమవుతుందో ఇవ్వాళ మనిషి అనుభవంలోకి వస్తున్నది. వర్తమానం సుడిగుండమై సుళ్ళుతిప్పుతున్నది. భయంకర విపత్తులను గర్భంలో దాచుకున్న భవిష్యత్తును తలుచుకుంటే యముని మహిషపు లోహఘంటలు మనిషిగుండెల్లో ఖణేల్మంటున్నాయి. 


భూమిని కాపాడుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడం. ‘భూమినాదియనిన భూమి ఫక్కుననవ్వు’....వేమన చెప్పిన నగ్నసత్యం. టాల్ స్టాయ్ చెప్పిన ‘ఎంత భూమి కావాలి’ కథ ఇన్ని శతాబ్దాలు గడిచినా మనకు అర్థం కాదు. ‘అతిథివోలె ఉండిఉండి, అవని విడిచి వెళ్ళుతాను’ అని కాళోజి పలికిన జీవనవేదం మనిషికి ఇమడలేదు. ఈ భూమిమీద మనిషిగా నువ్వూ ఒక అతిథివే, అధిపతివి కానేకావు. భూమి మనిషి ఒక్కడికోసం కాదు. సమస్త ప్రాణులతో మనిషి సమష్టిగా భూమిని పంచుకోవాలే. సహజీవన ధర్మాన్ని పాటించాలన్న ఇంగితం ఏనాడో మనిషి కోల్పోయినాడు. ఈ భూమి సకలజీవులకు ఆదిమాత. ప్రతి జంతువును, మొక్కను చరాచరాలన్నిటినీ భూమాత పోషిస్తుంది. పదివేలసంవత్సరాల కింద జంతువుల జనాభాలో మానవులు ఒక శాతం మాత్రమే కాగా, నేడు 32శాతం మేరకు అరణ్యాలలో ఉండే జంతువులను హరిస్తున్నాడు. అరణ్యేతర జంతువులలో 67 శాతం మనిషికి ఆహారం అవుతున్నాయి. మానవుని వినాశకరచర్యలు భూమిగుండెలలో భయంకర విస్ఫోటనాలు రేపుతున్నాయి. సాగరాల్లో చమురు తెట్టుకట్టిన విషపు అలలను లేపుతున్నాయి.మహాటవులను ఘోరఎడారులుగా మారుస్తున్నాయి. ఈ భూమిని ఫలపుష్పభరితంగా, సారవంతంగా, నివాసయోగ్యంగా మలచిన అనేక జీవజాతుల ఉసురు తీస్తున్నాడు మనిషి. వన్యప్రాణుల ఆవాసాలు చెదిరి మనిషికి, వనచరాలకు మధ్య సామాజికదూరం తగ్గింది. ఆపాపమే కరోనా రూపంలో నేడు మనిషికి మనిషికి మధ్య అనివార్యమైన భౌతికదూరాన్ని, ఎడబాటును సృష్టించింది. 


అమెరికా, దాని తైనాతీదేశాలు వాటి బహుళజాతి కంపెనీలు చేస్తున్న భూగర్భదోపిడీ అంతా ఒక చీకటిచరిత్ర. గుత్తపెట్టుబడిదారీ విధానం భూమికి కలిగించిన నష్టం అంతాఇంతా కాదు. శాస్త్రసాంకేతికపరిజ్ఞానాన్ని భూమ్యాకాశాలను, సముద్రాలను జయించే ఆయుధంగా అవి మలుచుకుంటున్నాయి . 


మనిషి చేస్తున్న దారుణాలకు, పెట్టుబడిదారీ దురాశకు వ్యతిరేకంగా నేడు భూమి పోరాడుతున్నది. ఈ ఘర్షణ అనేక వ్యాధి బీజాలను నాటుతున్నది. కరోనా అసంకల్పిత, అయాచిత, అనూహ్య ప్రమాదం ఎంత మాత్రమూ కాదు. ఇది మనిషి స్వయంకృత అపరాధం పర్యావరణ విధ్వంస ఫలితం. మానవ అహంకృతి మీద ప్రకృతి తీర్చుకుంటున్న ప్రతీకారం. అమెరికన్లు ఈ మహమ్మారి విస్తృతిని అంగీకరించలేక పోయారు. దివాంధాలైన గబ్బిలాలనుంచి పుట్టిన ఈ వ్యాధిశక్తిని దివాంధుడైన అంకుల్ శామ్ చూడలేకపోతున్నాడు. భూమి మీదకు ఏ గ్రహాంతరవాసులో దాడికి దిగితే, భూరక్షకులు అమెరికన్లే! అనే అహంకారంతో సినిమాలు తీసిన హాలీవుడ్ నిర్మాతలకు, దర్శకులకు చిత్ర నిర్మాణ నిపుణులకు నేడు మానవుని స్వీయాపరాధం లోంచి పుట్టిన ఒక సూక్ష్మక్రిమిని ఎదుర్కోలేని నిస్సహాయత మింగుడుపడుతుందా? దేశదేశాలలో ఆధిపత్యాన్ని చలాయిస్తూ, ధిక్కారమును సైతునా అని, తనను ప్రతిఘటించిన వారు ఏ బంకర్లలో దాక్కున్నా ఈడ్చిచంపిన సామ్రాజ్యవాదానికి ఇప్పుడు కరోనానుంచి తప్పించుకునే బంకర్లు కావాలి. 


అంటువ్యాధులలో 75 శాతం వన్యప్రాణుల నుంచి వచ్చేవే. వ్యాధికారకాలు జంతువులనుండి మనుషులకు చేరే అవకాశాలు గతంలో ఇంతగా లేవు. ‘ఈ భూమి మీద ఇక మేమే చివరితరం’ అన్నట్లు విచక్షణారహితంగా చేస్తున్న అడవులనరికివేత, భూమి ఉపరితలం పైనా, భూగర్భంలో సాగిస్తున్న విధ్వంసం, నదులు, సముద్రాలు, సరస్సులను విషపూరితం చేయడం, పెరుగుతున్న ప్రపంచతాపం (గ్లోబల్ వార్మింగ్) అడవి జంతువుల అక్రమ రవాణా, కబేళాలలో సామూహికవధ వంటి దురాగతాలు జంతువులతోపాటూ వాటివెంట విషపూరిత వైరస్ విష క్రిములు మన జీవితంలోకి లంఘించేలా చేస్తున్నాయి. జంతువులను పెద్ద దూరాలకు రవాణా చేస్తున్నప్పుడు అవి విపరీతమైన భయానికి, ఒత్తిడికి లోనై చేసే మలమూత్ర విసర్జనలోంచి ప్రాణాంతకమైన వ్యాధికారకాలు పుడతాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంగర్ అండర్సన్ చెప్పిన దాని ప్రకారం జంతువుల శరీరంనుండి వెలువడే ద్రవాలు జనసమ్మర్దం గల 


మార్కెట్లు ఒక సులభసమ్మేళనానికి మిక్సింగ్ బౌల్ లాగా ఉపయోగపడుతున్నాయి. ఊహాన్ మార్కెట్ అనుభవం అదే. గుర్రపుడెక్కజాతి గబ్బిలాలలో సార్స్, కోవిడ్ లాంటి వైరస్‌ల రిజర్వాయర్లు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ఎబోలా, బర్డ్ ప్లూ, జికా వైరస్ వంటివన్నీ వన్యప్రాణుల నుండి మనుషులకు సోకినవే. ఆ అనుభవాల నుంచి మానవాళి గుణపాఠం నేర్చుకున్నదా? ‘కరోనా ఉత్పాతం పెద్దగా ఆశ్చర్య పరిచేది కాదు. మనమింకా ప్రమాదపు మొదటి మెట్టు మీదనే ఉన్నామ’ని ఎమోరీ విశ్వవిద్యాలయంలో పర్యావరణ శాస్త్రవేత్త థామస్ గిలెప్సీ హెచ్చరిస్తున్నారు. 


ఆరోగ్యం, పర్యావరణ విధానం వేరువేరుకావు. వాతావరణమైనా మన ఆరోగ్యమైనా, మనం భూమిని పంచుకుంటున్న ఇతరజీవుల మీద ఆధారపడి ఉంటాయనేది ప్రాథమికసూత్రం. రోగాలు వచ్చినప్పుడు పరిష్కారాలు వెతుక్కోవడం దప్పైనప్పుడు బావి తోడిన చందంగా కాకూడదు. భయంతో తీసుకునే తత్తరపాటు చర్యలు ఘోర విపత్తులకు సమాధానం కాజాలవు. నిజమైన పశ్చాతాపంతో, వివేకంతో కూడిన విధానం, ధైర్యంతో కూడిన కార్యాచరణ ఇప్పుడు అవసరం. ఇది మానవజాతి మేల్కొనవలసిన సందర్భం. ‘పారాహుషార్’ అనే ప్రకృతి హెచ్చరికను గంభీరంగా యోచించవలసిన క్షణం. మొక్కుబడిగా కాకుండా, అంతకరణ శుద్ధితో ప్రాయశ్చిత్తం చేసుకొని, ప్రకృతితో సవ్యమైన సకారాత్మకమైన అవిభాజ్యమైన సంబంధాన్ని భాగస్వామ్యాన్ని నెలకొల్పుకోవాలి. సహజస్థలాల వినాశనాన్ని ఆపాలి. చెట్టూ, చేమ, గుట్ట, పిట్ట అన్నిటినీ వాటిమానాన వాటిని బతకనివ్వాలి. అడవుల్లో పర్వత గుహలలో జంతువులు, చెట్టు మీద గూళ్ళలో పిట్టలు క్షేమంగా ఉంటేనే మనిషి క్షేమంగా ఉంటాడనే సార్వత్రిక దృక్పథం మానవ జీవన గమనాన్ని నిర్దేశించాలి. జీవవైవిధ్యానికి ఎక్కడా నష్టం వాటిల్లకుండా బాధ్యతాయుతంగా, ప్రకృతి పట్ల జవాబుదారీతనంతో మనిషి మెదులుకోవాలి. దుర్మార్గమైన వృకోదర లాభాపేక్షను విడిచిపెట్టాలి. మనుషులమధ్య రకరకాల అంతరాలు, వివక్షలు, అధిక ఐశ్వర్యం పక్కనే నిత్యదరిద్రం ఉండే ఈ క్రూర ప్రపంచాన్ని పరిహరించాలి. కరోనాకు వ్యాక్సిన్ కనుగొంటామా? అన్న ప్రశ్న కన్నా, కరోనా ఇస్తున్న సందేశం మానవాళికి కనువిప్పుకలిగిస్తుందా? అన్నదే అసలైన ప్రశ్న. అమెరికాలో ‘అంతర్జాతీయ పరిణామాలు, శ్రీఘ్ర అంటువ్యాధులు, ఉద్భవిస్తున్న ప్రమాదాల పరిశోధన సంస్థ’ డైరెక్టర్‌గా ఉన్న డెన్నిస్ కారోల్  పరిశోధనల సారాంశం ప్రకారం ‘జంతువుల ద్వారా వచ్చే వైరస్‌ల వల్ల మనిషి ప్రతి మూడు సంవత్సరాల కొకసారి అంటు రోగాల బారిన పడే వ్యాధి చట్రంలో ఇరుక్కున్నాడు’. ఒంటిస్తంభం మేడలో దాక్కున్నా, పరీక్షిత్ మహారాజును పాము కాటేసింది. మనిషి అవివేకంతో, ఎన్నటికీ తీరని తోడేలు ఆకలితో సర్వభక్షకుడై స్వైరవిహారం సాగిస్తే, సుషుప్తిలో ఉన్న, మరేదో వైరస్ ఒళ్ళువిరిచి, విజృంభించకపోదు. అప్పుడు మనం గడపలో పల గొళ్ళెం బిగించుకు కూర్చున్నా, అది కబళించకపోదు. భౌతికవృద్ధికన్నా, నైతికవృద్ధికోసం మనిషి తపించాలి. ఇప్పుడు మతంకన్నా మానవత్వం గురించి చర్చించాలి. మనిషి విజ్ఞానమే జయిస్తుంది. అయితే అది మానవీయ స్వభావాన్ని కలిగుండాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పినట్లు అసమానతలను సమర్థించని మతాలను నిర్మించుకోవాలి. అప్పుడు మతం మత్తుమందు కాకుండా, కార్ల్ మార్క్స్ నిర్వచనం మొదటి పంక్తులలో చెప్పినట్లు మతం నోరులేనివారి నోరుగా, గుండెలేనివారిగుండెగా, ఆత్మలేనివారిఆత్మగా వికసిస్తుంది. ఆ మతమే ప్రకృతిహితంగా పరిణమిస్తుంది.

దేశపతి శ్రీనివాస్

Updated Date - 2020-04-05T07:28:36+05:30 IST