Abn logo
Jun 4 2020 @ 00:00AM

మానవ హక్కులు మాటలకే...

  • విపత్తు, యుద్ధ సమయాలలో మానవ హక్కులకు భంగం బహిరంగంగానే జరిగిపోతుంటుంది. ఎందరో ప్రజలు ముఖ్యంగా పేదలు జీవించే హక్కును సైతం కోల్పోతుంటారు. కరోనా లాక్‌డౌన్‌లోనూ ఇదే దృశ్యం మనకు కనిపిస్తోంది అంటున్నారు మానవ హక్కుల కార్యకర్త డా. లుబ్నా సార్వత్‌. 


‘‘మానవ సంక్షోభం ముదురుతుంటే అది అతి వేగంగా మానవ హక్కులకు చేటు చేస్తుంది’ అనే మాట ఉంది. దీనిని కరోనా లాక్‌డౌన్‌ సమయంలో అందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం. రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాఽథఽమిక హక్కులతో పాటు మానవ హక్కులను పేదలు, మధ్యతరగతి వాళ్లు  కోల్పోయారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన మధ్యతరగతి జీవులు ఎందరో. పేద ప్రజలకు తిండి, నిలువనీడ, భద్రత, ఆరోగ్యాలు కరువయ్యాయి. తమను బిచ్చగాళ్లలా చూస్తుంటే వలసజీవుల గుండె కన్నీటి సంద్రమైంది. ఒక వలసకూలీని ‘ఎందుకు ఏడుస్తున్నావ’ని అడిగితే ‘ఇంతకాలం కష్టం చేసుకుని తిని బతికినాం. ఈ రోజు క్యూలో నిలబడి అన్నం అడుక్కుని తినాల్సి వస్తోంది. మమ్మల్ని బిచ్చగాళ్లకు మల్లే చూస్తున్నారు. ఇది ఎంత చెడ్డ బతుకు’ అంటూ  కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఘటన ఒక ఉదాహరణ మాత్రమే. 


జీవితం ముఖ్యం...

లాక్‌డౌన్‌ సమయంలో ప్రజల జీవితాలను పరిరక్షించాలి.  వారి జీవనోపాఽధిని రక్షించడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. వైరస్‌ను నియంత్రించాల్సిన బాధ్యతా ప్రభుత్వానిదే. కరోనా సోకకుండా అరగంట కొకసారి చేతులను సబ్బు, నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలన్నారు. కానీ నీటి ఎద్దడిని అనుభవిస్తున్న ప్రాంతాల వారి పరిస్థితి ఏమిటి? వీరంతా నీరు లేక ఈ వైరస్‌ బారిన పడి ప్రాణం కోల్పోవలసిందేనా? వారి జీవించే హక్కుకు ప్రభుత్వాలు జవాబుదారీ కాదా? ఎంతోమంది బస్తీలు, మురికివాడల్లో జీవితాలను వెళ్లదీస్తున్నారు. వీళ్లు భౌతికదూరం ఎలా పాటించగలరు? వీరికి వైరస్‌ సోకకుండా ప్రభుత్వం ఏం సదుపాయాలు కల్పించింది? మంచి జీవితం అందిస్తాం, ఇళ్లు కట్టిస్తాం, స్థిరమైన ఉద్యోగమిస్తాం వంటి వాగ్దానాలు చేసిన ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాలైనా వీరిని పట్టించుకోలేదే! ఇప్పుడు మాత్రం కరోనా సోకుతుందని దూరదూరంగా ఉండమంటూ నియమాలు చెబుతున్నారు. మురికివాడల్లో, రోడ్ల మీద జీవిస్తున్న వారికి నివాస హక్కును కల్పించకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కాదా?  దీర్ఘకాలంగా బడులు మూసేయడం వల్ల విద్యార్థుల చదువుకునే హక్కు ప్రమాదంలో పడింది. 50 రోజులు పైగా లాక్‌డౌన్‌ పెట్టి ఇప్పుడు ‘వైరస్‌తో జీవిస్తూ ముందుకు సాగాలి’ అని గంభీర వ్యాఖ్యలు చేస్తున్నారు! లాక్‌డౌన్‌ సమయంలో రోడ్డున పడిన వలసజీవులు, పేదలకు ప్రభుత్వం చేసిందేమీ లేదు. రేషన్‌, 1500 రూపాయలు ఇచ్చామంటుంది. కానీ వైన్‌ షాపులను తెరిచి కుడి చేత్తో అందచేసిన సహాయాన్ని ఎడం చేత్తో తీసేసుకుంది! మధ్యతరగతికి చెందిన ఉన్నత చదువులు చదువుకున్న యువత ఉద్యోగాలు లేక ఉపాధి పనుల్లో  కూలిపనులు చేస్తున్నారు. వైరస్‌ తలెత్తడానికి ముందు నుంచే యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వ జాప్యం చేస్తూ వచ్చింది.  ఫలితంగా యువత ఉపాధి హక్కు (రైట్‌ టు వర్క్‌)ను కోల్పోయి తీవ్ర మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు.


అసమానతల అంతరం పెరిగింది...

లాక్‌డౌన్‌లో ప్రజల హక్కులకు నష్టం వాటిల్లకుండా రిస్క్‌ ప్రివెన్షన్‌ వ్యూహాలను చేపట్టాలి. కానీ అవి ఏవీ? దీంతో మనుషుల మధ్య అసమానతలు బాగా పెరిగాయి. రాజ్యాంగంలో పేర్కొన్న అందరికీ సమాన అవకాశాల స్ఫూర్తికి ఇది విఘాతం. వైరస్‌ తీవ్రత వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటోంది. ప్రజారోగ్యంపై ప్రభుత్వం పటిష్ఠ వ్యూహంతో లేదు. కోవిడ్‌కు గురైన వారిని ప్రజలు వివక్షాపూరితంగా చూడడం సైతం మానవహక్కులకు వ్యతిరేకమే. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక వ్యవస్థ సంక్లిష్టంగా మారింది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచి వారి కనీస అవసరాలు తీర్చాలి.  


కోల్పోయిన హక్కులెన్నో...

వలసకార్మికులు ఈ లాక్‌డౌన్‌లో జీవించేహక్కు, తమ ఊళ్లకు తాము పోయే హక్కు, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, జీవనోపాధి హక్కులు ఇలా ఎన్నో కోల్పోయారు. తిండి లేక మల మల మాడారు. యూపీ, జార్ఖండ్‌, ఒడిశా, రాజస్థాన్‌ వంటి దూర ప్రాంతాలకు చిన్నాపెద్దా నడుచుకుంటూ పోయారు. మార్గమధ్యంలో వేలల్లో చనిపోయారు. కొందరు  ఆత్మహత్య చేసుకున్నారు. వారి జీవించే హక్కును వైరస్‌ కాదు బలితీసుకుంది...మన ప్రభుత్వాలే! బాధితుల కనీస అవసరాలను ప్రభుత్వం తీర్చాలి. కానీ అలా చేయలేదు. ఈ 50 రోజులూ పోలీసులు, వ్యక్తులు, యాక్టివిస్టులు, ఆరోగ్యవర్కర్లు పేదలు, వలసజీవులకు రవాణా నుంచి తిండి వరకూ చూశారు. క్వారంటైన్‌ సెంటర్లను, అధిక సంఖ్యలో ఆస్పత్రులను ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం సరిగా స్పందించ లేదు. దీంతో సామాన్య ప్రజల ఆరోగ్య హక్కు మన్నులో కలిసింది. అసలు వైరస్‌ ప్రారంభంలోనే వలసకూలీలకు బస్సులు ఏర్పాటుచేసి వారి ఊళ్లకు పంపి ఉంటే పరిస్థితులు ఇంతగా దిగజారేవి కావు. అప్పుడే బోర్డర్లను కూడా మూసేయాల్సింది. కానీ ప్రభుత్వం తాత్సారం చేసింది. వైరస్‌ను పకడ్బందీగా ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి నిర్దిష్ట స్ట్రాటజీ లేదు. లాక్‌డౌన్‌ సమయంలో పేద ప్రజల పట్ల బాధ్యతాయుతంగా, గౌరవంగా వ్యవహరించకపోవడం బాధాకరం. ఇలా చేయడమంటే వారి ప్రాథమిక, మానవహక్కులను గౌరవించకపోవడమే’’. 


Advertisement
Advertisement
Advertisement