మోదీ ప్రభుత్వ విధానాలతో మానవ హక్కుల పరిరక్షణ : అమిత్ షా

ABN , First Publish Date - 2021-10-12T23:36:46+05:30 IST

పేదలు, వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాల సంక్షేమం

మోదీ ప్రభుత్వ విధానాలతో మానవ హక్కుల పరిరక్షణ : అమిత్ షా

న్యూఢిల్లీ : పేదలు, వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, తద్వారా వారి మానవ హక్కులను పరిరక్షిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం చెప్పారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడారు. 


మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993 ప్రకారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్ఆర్‌సీ)ని 1993 అక్టోబరు 12న ఏర్పాటు చేశారు. మానవ హక్కుల పరిరక్షణ, అభివృద్ధి దీని లక్ష్యాలు. ఎన్‌హెచ్ఆర్‌సీ మానవ హక్కుల ఉల్లంఘన కేసులను విచారణకు స్వీకరించి, బాధితులకు నష్టపరిహారం సిఫారసు చేస్తుంది. 


జాతీయ మానవ హక్కుల కమిషన్ దేశ ప్రజలకు మానవ హక్కుల పట్ల అవగాహన కల్పిస్తోందని అమిత్ షా చెప్పారు.  ఎన్‌హెచ్ఆర్‌సీ ఏర్పాటైనప్పటి నుంచి దేశ ప్రజలు తమ మానవ హక్కుల గురించి తెలుసుకునే విధంగా విశేషంగా కృషి చేస్తోందని ప్రశంసించారు. ఈ కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి 20 లక్షల కేసులను పరిష్కరించిందన్నారు. మానవ హక్కుల ఉల్లంఘనలకు గురైన బాధితులకు రూ.205 కోట్లు నష్టపరిహారంగా ప్రకటించిందని తెలిపారు.  


చాలా కాలం తర్వాత మొదటిసారి 2014లో కేంద్రంలో సంపూర్ణ ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. అప్పటి నుంచి పేదలు, అణగారిన వర్గాల వారి సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు. మోదీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 10 కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్ల సదుపాయం కల్పించినట్లు, తద్వారా మహిళలు, బాలికలు, ఇతరుల మానవ హక్కులను పరిరక్షిస్తున్నట్లు తెలిపారు. నాలుగు కోట్ల కుటుంబాలకు విద్యుత్తు కనెక్షన్లను ఇవ్వడం వల్ల బాలలు, వృద్ధులకు మేలు జరిగిందన్నారు. 13 కోట్ల మందికి వంట గ్యాస్ కనెక్షన్లను ఇచ్చినట్లు చెప్పారు. వివిధ వ్యాధుల నుంచి మహిళలు, ఇతరులకు రక్షణ కల్పించడానికి వంటగ్యాస్ కనెక్షన్లు దోహదపడినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రెండు కోట్ల మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చిందని, త్వరలోనే మరో ఐదు కోట్ల ఇళ్లను నిర్మిస్తుందని చెప్పారు. 


కేంద్ర ప్రభుత్వం ఏడు కోట్ల మందికి నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు ఆర్థిక సాయం జమ చేసిందన్నారు. దేశంలోని ప్రతి కుటుంబానికి తాగు నీరు అందజేసే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. త్వరలోనే గొట్టాల ద్వారా రెండు కోట్ల కుటుంబాలకు తాగునీరు అందజేస్తామన్నారు. ఈ పథకం వల్ల ఈ కుటుంబాల మౌలిక మానవ హక్కులకు రక్షణ లభిస్తుందని చెప్పారు. 


Updated Date - 2021-10-12T23:36:46+05:30 IST