మానవీయ విలువల సుకవి ‘శీలావి’

ABN , First Publish Date - 2020-10-30T06:26:26+05:30 IST

జీవితంలోనూ, కవిత్వంలోనూ నిరాడంబరత్వాన్ని ప్రేమిస్తూ, వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తూ, శైలీ శిల్పాలకు సమప్రాధాన్యతనిస్తూ మానవత్వమే తన కవిత్వతత్వంగా నిలిచిన కవి శీలావీర్రాజు...

మానవీయ విలువల సుకవి ‘శీలావి’

జీవితంలోనూ, కవిత్వంలోనూ నిరాడంబరత్వాన్ని ప్రేమిస్తూ, వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తూ, శైలీ శిల్పాలకు సమప్రాధాన్యతనిస్తూ మానవత్వమే తన కవిత్వతత్వంగా నిలిచిన కవి శీలావీర్రాజు


ఆయన్ని చిత్రకారుడు అన్నా–

నవలా, కథారచయిత అన్నా – 

ప్రముఖంగా ఆయన కీర్తిప్రతిష్ఠలకు ఆ ప్రక్రియలే అనుసంధానించినా – 

ఆయన మౌలికంగా కవి.

ఒక కవికి ఉండవలసిన సున్నిత హృదయం, కాంతాసమ్మిత లాలిత్యం, 

మానవీయానుభూతుల సంవేదనం – ఆయన సహజగుణాలు. అదే 

సమయంలో ఒక నిజాయితీకి కట్టుబడ్డ వ్యక్తి. ఏ ఉద్యమమో వచ్చిందని 

గాలివాటుగా అటు మొగ్గిపోవడం ఆయన స్వభావం లోనే లేదు. 


ఆయన కవిత్వం కవిత్వంలోనే కాదు, ఆయన చిత్రాల్లో ‘మాటలు లేని పద్యమే బొమ్మ’ అన్నట్లుంటుంది. ఆయన కథల్లో అంతర్లీన జీవధారగా ప్రవహిస్తుంది. ఆయన మానవత్వం విలువల భద్ర ‘శీలా(సుక)వి.’


శీలావీర్రాజు – తెలుగు సాహిత్యంలో బహుముఖీన ప్రతిభామూర్తుల అరుదైన పరంపరలో అగ్రగామిగా ఉదాహృతం కాగల పేరు. అత్యంత సమాదరణమొందిన చిత్రకారునిగా, కథకునిగా, నవలారచయితగా, కవిగా తెలుగు సాహిత్యపు అనేక ప్రక్రియల్లో అడవిబాపిరాజు వంటి మహనీయుల క్రమంలో కమ్రభావనగా విలసితంగా సుప్రతిష్ఠితమైన పేరు సాహితీవేత్త శీలావీర్రాజు గారిది. 


విద్యార్థి దశలో ఆయన తొలి సృజనాత్మక రచనా ప్రక్రియ వచన కవిత్వమే. ఆయన తొలి ముద్రిత రచన కొందరు భావించేటట్లు కథో, నవలో కాదు. నిజానికి ఆయన మౌలికంగా కవే అనడానికి ‘ఏటిపాలైన యవ్వనం’ వంటి కథలే ప్రబల నిదర్శనం. అదీకాక వచన కవితాపితామహుడనిపించుకున్న కుందుర్తిగారికి అసలు సిసలైన వారసునిగా వచన కవితలో కథాకావ్య విస్తృతిని చేసినదీ కవిత్వంలోనే. ‘పడుగుపేకల మధ్య జీవితం’ అనే ఆత్మకథనాత్మక స్వీయచరిత్రను లిఖించిందీ ఆయనే! ఆయనకు ప్రయోగాలు చాలా ఇష్టం. అయితే ఆయన ప్రయోగాలు అన్నీ ప్రధానంగా, ఇలా వచనకవితా ప్రక్రియలో సాగి ఒక ఒరవడిని చూపెట్టినవే. ‘కొడిగట్టిన సూర్యుడు’, ‘హృదయం దొరికింది’ వచన కవితా కథానికల సంపుటాలు కాగా ‘మళ్ళీ వెలుగు’ ఆయన వెలువరించిన మహనీయ కావ్యం. విప్లవ సాహిత్యోద్యమం బలంగా వేళ్లూనుకుంటున్న కాలంలో వెలువడిన శీలావి ‘మళ్ళీవెలుగు’ తెలుగు కవితారంగంలో ఒక సరికొత్త ప్రయోగంగా వెలువడిన ప్రగతిశీలక వచనకవితాకావ్యం. నగర జీవితాన్ని, సామాజిక వ్యవస్థనూ వివరంగా చర్చిస్తూ ఒక ఆధునిక ద్వర్థికావ్యంగా అభివర్ణించదగిన ఈ కావ్యం ఉషస్సు, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, సంధ్య, రాత్రి, అర్థరాత్రి అనే అయిదు అధ్యాయాలలో ఆయా సమయాల్లో నగరజీవితాన్ని సమగ్రంగా ఆవిష్కరిస్తుంది. ఒక్కొక్క అధ్యాయాన్నీ ఒక్కొక్క సామాజిక స్థితికి సంకేతంగా స్వీకరించి చైతన్యరహితమైన, జడమయమైన అర్థరాత్రి చీకటి చిరకాలం నిలవదని, త్వరలోనే ఈ చీకటి తొలగిపోయి ‘మళ్లీ వెలుగు’ వస్తుందనే ఆశావాదాన్ని ప్రకటిస్తూ మానవాభ్యుదయ భావవాహికగా భారతీయ సాహిత్యంలోనే చెప్పుకోదగిన విశిష్టకృతి ఇది. ప్రచారార్భాటాలకు, కీర్తి వెంపర్లాటలకు దూరంగా ఉండే కవి కావడం వల్ల, సాహితీసంస్థ యువభారతి ప్రచురణగా వెలువడిన ఈ కావ్యం పెద్దగా గుర్తింపునకు నోచుకోకపోయినా, నిజానికి మానవాళి నివాళులెత్తదగిన మహనీయ రచన. 


ఆయన వచన కవితాకథానికలు ప్రణయభావనలకు, ప్రకృతి, మానవప్రకృతి వర్ణనలకూ, మరీ ముఖ్యంగా స్త్రీ పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ సాగిన రచనలు. ఒక తాత్త్విక భూమికను గొప్ప భావుకతతో, మనోవర్ణనలతో పఠితకు అందించే రచనలవి. శీలావి ప్రయోగాలకు కవిత్వమే ఆధార భూమిక అయిందనే విషయం గ్రహిస్తే శీలావి వస్తు, శిల్పాల మీద సమాన సాధికారతగల విశిష్టకవి అని గ్రహించగలం. అలాగే ఆయన ఆత్మకథ కూడా కవిత్వంలోనే వెలువరించడం చూసినప్పుడు శీలావి మౌలికంగా, సర్వాత్మనా కవి అని స్పష్టమవుతుంది. 


‘కిటికీకన్ను’, ‘ఎర్రడబ్బారైలు’ ఆయన వచన కవితా సంపుటాలు. కిటికీ కన్నులో ఇరవై అయిదు, ఎర్రడబ్బారైలులో ముప్ఫయ్‌ కవితలున్నాయి. ఇవి కాక తొమ్మిది విడికవితలు ఉన్నాయి. శీలావీర్రాజు కవిత్వం అంతా ఒక సమగ్ర బృహత్సంపుటిగాసుమారు 610 పేజీలతో 2004లో వెలువడింది. జీవితంలోనూ, కవిత్వంలోనూ నిరాడంబరత్వాన్ని ప్రేమిస్తూ, వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తూ, పాఠకుని ఆకర్షించడానికని ఏ జిమ్మిక్కులూ చేయకుండా శైలీ, శిల్పాలకు సమప్రాధాన్యతనిస్తూ మానవత్వమే తన కవిత్వ తత్వంగా నిలిచిన కవి శీలా వీర్రాజు. అందమైన స్వదస్తూరీతో ఆయన తన ‘కిటికీకన్ను’ కవిత్వ సంపుటిని, సమగ్ర సంపుటిలో ‘నేను–నా కవిత్వం’ అంటూ తమ భావధారను ప్రకటించడం కూడా విశిష్టతే! 


ఇవాళ వ్యవస్థ మీద అసంతృప్తి ప్రకటించేవారు ఎందరో ఉన్నారు. కానీ వారి వ్యవహార సరళిని గురించి – 

ఈ వ్యవస్థ మీది కోపం

నీ కుటుంబ శ్రేయస్సుకే పరిమితం చేయకు 

నువ్వు చేసే త్యాగం

నీ యింటి ఆవరణ దగ్గరే ఆగిపోనివ్వకు 

అంటూ వ్యక్తిని శక్తిగా, వ్యక్తి నుంచి సమష్టిగా ‘విస్తరించు’ అంటారు శీలావి.


సంధ్య వాలేవేళ – తూర్పు నుంచి వచ్చే ఆ ఎర్రడబ్బా రైలు కోసం జీవనసంధ్యలోంచి ప్రతిరోజూ ఆశతో ఎదురుచూసే తల్లిని వ్యవస్థకు ప్రతీకగా సంభావింపగల ‘ఎర్రడబ్బారైలు’ వంటి శీలావి కవితలు ప్రగతిశీల భావాలకు, జనమమేకమైన సమాజహిత చింతనా భావనలకు అక్షరదీపాలు.


శీలా వీర్రాజు అనగానే వేలాదిగా కవుల, రచయితల పుస్తకాలకు ముఖచిత్రాలు సంతరించిన గొప్ప చిత్రకారుడిగానే చాలామందికి గుర్తుకొస్తారు. యువభారతి సాహిత్యప్రచురణలకు ఆయన కుంచెయే మూలవిరాట్టు. ఆ చిక్కని అనుబంధం వల్లనే కాబోలు/సంప్రదాయ సాహితీవేత్తలకు/నేనొక చిత్రకారుడిగానే గాని/సాహితీవేత్తగా గుర్తుకురాను/గుర్తుకొచ్చే ఆధునిక సాహితీవేత్తలకు సైతం/నేనొక చిత్రకారుడ్నేగాని సాహితీవేత్తను కాను/సాహితీవేత్తగా ఒప్పుకున్న/కవులకు కథకుడ్ని!!/కథకులకు కవిని!!!/ఎవరికి వారికి నేనొక చొరబాటు దారుడ్ని!/అదే నాబాధ/అందుకే నా కోపం.’’ అని తన ‘పడుగుపేకలమధ్య జీవితం’ – కవిత్మాక ఆత్మకథలో ఆయనే స్వయంగా ఆర్తి చెందారు. 


శీలావి ఎంత చిత్రకారుడో అంతకు మించిన కథకుడు. అంతకు రెట్టింపు–మౌలికంగా కవి. ఆ మాటకొస్తే అన్నింటా శిఖరాలంటిన స్వయం విజేత. 1939 ఏప్రిల్‌ 22న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించిన ఈ 82 ఏళ్ల సాహితీమూర్తి చదువుసంధ్యలూ, సాహిత్యరంగ ప్రవేశం అక్కడే. కృష్ణాపత్రికలో కొలువు కోసం 1961లో హైదరాబాద్‌ చేరారు. ఆపై 1963లో సమాచార పౌరసంబంధాల శాఖలో సహాయ అనువాదకునిగా చేరి 1989లో స్వచ్ఛందంగా ఉద్యోగం విరమించుకున్నారు. 1966లో ‘కొడిగట్టిన సూర్యుడు’ కవితాసంపుటికి ఫ్రీవర్స్‌ఫ్రంట్‌ అవార్డు, 1969లో తెలుగు నవలా చరిత్రలో ఒక మైలురాయి అనదగిన ‘మైనా’కు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ‘వెలుగురేఖలు’, ‘కాంతిపూలు’, ‘కరుణించిన దేవత’ వంటి ఇతర నవలలు, సమాధి, మబ్బుతెరలు, హ్లాచిని, వీర్రాజుకథలు, రంగుటద్దాలు, పగ మైనస్‌ ద్వేషం, మనసులోని కుంచె, వాళ్లమధ్య వంతెన, ఊరు వీడ్కోలు చెప్పింది వంటి కథల సంపుటాలు, ‘కలానికి అటూయిటూ’ వ్యాససంపుటి, శిల్పరేఖ (లేపాక్షి శిల్పాల చిత్రరేఖలు), ఒక వర్ణచిత్ర సంపుటి వెలువరించారు. 1957లో కలం పట్టినది లగాయితు నిరంతర సాహితీవ్యాసంగం సాగిస్తూ పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం ప్రతిభాపురస్కారం, న్యూఢిల్లీ తెలుగు సాహితీ సమితి జీవన సాఫల్య పురస్కారం, కొండేపూడి శ్రీనివాసరావు, పులికంటి కృష్ణారెడ్డి స్మారక పురస్కారాలు, బోయిభీమన్న, అవంత్స సోమసుందర్‌ ట్రస్టు పురస్కారాలు, చలసాని వసుపతి పురస్కారం వంటివెన్నో అందుకున్నారు. 1953లోనే చిత్రకారునిగా స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఉత్సవాల్లో ప్రథమ బహుమతి పొందిన ఆయన అనేక ‘వన్‌మేన్‌షో’లను హైదరాబాద్‌, కావలి, బెంగుళూరు, యానాం, విజయవాడ, రాజమండ్రి, విశాఖలో నిర్వహించారు. 1970లో పశ్చిమ జర్మనీలోని గోటెన్‌జన్‌ నగరంలో లేపాక్షి చిత్రాల ప్రదర్శనలు నిర్వహించారు. శిల్పరేఖ, శీలా వీర్రాజు చిత్రకావ్యం, కుంచెముద్రలు అనే గ్రంథాలుగా వారి చిత్రాలు లభిస్తున్నాయి. 


తెలుగు సాహితీ ప్రముఖులలో వెలుగుదీధితుల సమున్నతుడు శీలా వీర్రాజు.

సుధామ

(నేడు శీలా వీర్రాజుకు శిఖామణి సాహితీ పురస్కారం ప్రదానం)

Updated Date - 2020-10-30T06:26:26+05:30 IST