‘‘మనువాదం ఈ దేశ విజ్ఞానానికి మరణశాసనం రాసింది.’’

ABN , First Publish Date - 2020-03-09T07:22:45+05:30 IST

భౌతికవాదం అనగానే మనకు పాశ్చాత్య తత్వవేత్తలు మాత్రమే గుర్తుకు వస్తారు. కాని పంచభూతాల పేరుతో ఉపనిషత్తుల్లో ఎప్పుడో పేర్కొన్నారు. మన గురించి మనం తెలుసుకోలేకపోవడానికి కులమే కారణం...

‘‘మనువాదం ఈ దేశ విజ్ఞానానికి మరణశాసనం రాసింది.’’

భౌతికవాదం అనగానే మనకు పాశ్చాత్య తత్వవేత్తలు మాత్రమే గుర్తుకు వస్తారు. కాని పంచభూతాల పేరుతో ఉపనిషత్తుల్లో ఎప్పుడో పేర్కొన్నారు. మన గురించి మనం తెలుసుకోలేకపోవడానికి కులమే కారణం.

బొర్రా గోవర్ధన్‌ పలకరింపు


ఉద్యమకారునిగా, రచయితగా ఏకకాలం సాగిన మీ ప్రయాణం గురించి?

జనసాహితి రవిబాబుగారి పరిచయంతో కళారూపాలపై ఆకర్షణ మొదలైంది. నృత్యరూపకాలకు సారథ్యం వహించే వాడిని. అమెరికా, రష్యా సామ్రాజ్యవాదులపై రూపొందించిన పాములవాడు నృత్య రూపకం కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చాం. ప్రజాసాహితి పత్రికలో ‘‘క్రాంతికిరణ్‌’’ పేరుతో గీతాలు అచ్చయ్యేవి. మత్స్యకార జీవితాలపై రాసిన ‘‘లాహిరి లాహిరిలో లంగరెత్తి కదిలింది’’ అన్న పాట, తరిమెల నాగిరెడ్డి పుస్తకం తాకట్టులో భారతదేశం చదివిన తరువాత రాసిన ‘‘దోపిడి దోపిడి దోపిడీ... సులువుగా చేసే నిలువు దోపిడి’’ పాట ఆ రోజుల్లో పాగా పాడేవాళ్లం. ఆ తరువాత గుంటూరు జనశక్తి కార్యాలయంలో సాంబశివరావు వద్ద ఉన్నా. ఆయన నాకు సాహిత్యగురువు. జిన్నాటవర్‌ సెంటర్‌లో రామచంద్ర విలాస్‌లో సప్లైయర్‌గా పనిచేస్తూ గుంటూరు జిల్లా హోటల్‌ వర్కర్స్‌ యూనియన్‌ని స్థాపించాం. అవసరాల రీత్యా అమరావతి సమీపంలోని మోతడక గ్రామానికి వెళ్లాను. అక్కడ తోపుడు బండిపై సోడాలు అమ్మాను. అక్కడి కష్టం జీవితాన్ని నేర్పింది. గుమ్మడిదల సుబ్బయ్య ఇంటిలో ఉన్నా. హిందూ, ముస్లిం గొడవలపై రాసిన ‘చితాగ్ని’ కొత్త గుర్తింపునిచ్చింది. ‘గుండె మంట’ పేరుతో మొదటి పాటల పుస్తకాన్ని జనసాహితి ప్రచురించింది. అక్కడ నుంచి బాపట్లకు రైల్వే గ్యాంగ్‌మెన్‌గా వెళ్లా. అక్కడే ‘పట్టి బిగించు... నట్టు పట్టి బిగించు’ పాట రాశాను. ఉద్యమమూ, రచనా కలగలిసే సాగాయి. 


కమ్యూనిస్టు పార్టీలు అంబేద్కర్‌ని చదవడానికి పెద్దగా ఇష్టపడని రోజుల్లోనే మీరు అంబేద్కర్‌ రచనలు అధ్యయనం చేశారు, వాటి గురించి రాశారు...

నిజమే. నగరం వచ్చిన కొత్తలో రాహుల్‌సాంకృత్యాయన్‌ చదవడానికి సరోజక్క ఎలా కారణమయ్యారో 1985లో అంబేద్కర్‌ని చదవాల్సిన అవసరం ఉందని చెప్పిన వ్యక్తి ఓపీడీఆర్‌ భాస్కరరావు. అప్పటికి ఇంకా కారంచేడు ఘటన జరగలేదు. నేను రాసిన దానిని జనపథంలో ప్రచురించారు. బొర్రా గోవర్ధన్‌ పేరుతో ప్రచురితమైన తొలి వ్యాసమది. దళితబహుజనులు రాయగలరని ప్రపంచానికి చాడడం ముఖ్యమన్న వాదనతో నా అసలు పేరును పెట్టారు ఆయన. అంబేద్కర్‌ రాసిన బుద్ధుడు-ధర్మము పుస్తకం చదివిన తరువాతే బుద్ధుడిపై మరింత ఆసక్తి పెరిగింది. 


మరలా వేదాలు, ఉపనిషత్తుల వైపు ఎలా మళ్ళారు?

90ల్లో తాత్విక పండితులు నూతలపాటి రామ్మోహన్‌ గారితో పరిచయమైంది. ఆయన ప్రోద్భలంతో వేదాలు, ఉపనిషత్తులు, షడ్‌దర్శనాలు, పురాణాలు... ఆరు సంవత్సరాలు బాహ్య ప్రపంచంతో దాదాపు సంబంధం లేకుండా అధ్యయనంలో గడిచిపోయాయి. రుగ్వేదం, ఉపనిషత్తులు, దర్శనాలు ఆకర్షిం చాయి. ఆత్మ, పరమాత్మ, దేవుడు వంటి విభేదించే అంశా లున్నప్పటికీ భారతీయ తాత్వికతపట్ల అచంచలమైన ప్రేమను పెంచాయి. భౌతికవాదం అనగానే మనకు పాశ్చాత్య తత్వ వేత్తలు మాత్రమే గుర్తుకు వస్తారు. కాని పంచభూతాల పేరుతో ఉపనిషత్తుల్లో ఎప్పుడో పేర్కొన్నారు. మన గురించి మనం తెలుసుకోలేకపోవడానికి కులమే కారణం. మనువాదం ఈ దేశ విజ్ఞానానికి మరణశాసనం రాసింది. మార్క్సిజం, అంబేద్కరిజం చదవడం వలన బౌద్ధం మరింత తేలికగా బోధపడింది. కణాదుని వైశేషికం, కపిలుడి సాంఖ్యం, గౌత ముని న్యాయదర్శనం, పతంజలి యోగదర్శనం... బౌద్ధంలో వాటికన్నా మెరుగ్గా కనిపించాయి. 


బౌద్ధం, మార్క్సిజం, అంబేద్కరిజం... మూడూ వేర్వేరా? లేక ఏకరూపత కలిగిన మూడు వేర్వేరు మార్గాలా?

వేర్వేరని చాలామంది భావన. కాని కాదు. ఒకే విషయాన్ని కేంద్రంగా చేసుకొని వేరువేరు దారుల్లో నడిచిన తాత్వికులు వీరు. ప్రపంచాన్ని తల్లిగా ప్రేమించినవారు వీరు ముగ్గురూ. మార్క్స్‌ ప్రపంచాన్ని శ్రామిక, ఆర్థిక దోపిడీ, కార్మికవర్గం కోణంలో చూశారు. అంబేద్కర్‌ అంటరానితనం కోణంలో దేశాన్ని చూశాడు. ఈ రెండు సమస్యలతో పాటు మానవ సహజ స్వభావమైన ధార్మికకోణంలో నుంచి బుద్ధుడు ప్రపంచాన్ని విశ్లేషించారు.  


మీ 100వ పుస్తకం గురించి...

ఆంజనేయరెడ్డి, వీరనారాయణ రెడ్డి. ఇద్దరూ ఐపీఎస్‌లే. వీరనారాయణరెడ్డి బౌద్ధ పండితుడు. తరిమెల నాగిరెడ్డిగారి తాకట్టులో భారతదేశం తొలిపాఠకుడు. ‘నక్సలిజం వ్యక్తిగత హింసావాదం కాదు. సామాజిక సమస్య’ అని చెప్పిన పోలీస్‌ ఉన్నతాధికారి ఆయన. బౌద్ధంలో నాకు గురువు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ ‘బౌద్ధ దర్శనం’ను హిందీ నుంచి అనువాదం చేసినపుడు 8 సార్లు తిరగరాయించారు. ఆ తరువాత తిరిగి చూడలేదు. 35వ బౌద్ధ పుస్తకం... ‘బౌద్ధము - వైజ్ఞానిక మార్గం’ నా 100వ పుస్తకం. 


(మార్చి 15న బొర్రా గోవర్ధన్‌ 100వ పుస్తకం విడుదల)

ఇంటర్వ్యూ: చిగురుపాటి సతీష్‌ బాబు


Updated Date - 2020-03-09T07:22:45+05:30 IST