మానవతా హత్య!

ABN , First Publish Date - 2020-04-03T06:09:07+05:30 IST

సోక్రటీస్ హత్య జరిగినప్పుడు, ఏసుక్రీస్తు హత్య జరిగినప్పుడు సమకాలిక ప్రపంచం సిగ్గుతో ఎంతవరకు తలదించుకున్నదో తెలియదు. కాని, లింకన్ హత్య జరిగినప్పుడు, గాంధీ హత్య జరిగినప్పుడు, కెనడీ హత్య జరిగినప్పుడు...

మానవతా హత్య!

రెండు మూడు వేల సంవత్సరాల నాటి కంటే ఈనాడు మానవతావాదం కొంత ప్రబలిన మాట నిజమే! అయినా రెండు దశాబ్దాల లోపల ఒక గాంధీ, ఒక కెనడీ, ఒక కింగ్ హత్య జరగడం ఆధునిక మానవునికి తలవంపులు కావా? అతడి సభ్యతకు మచ్చకాదా?


సోక్రటీస్ హత్య జరిగినప్పుడు, ఏసుక్రీస్తు హత్య జరిగినప్పుడు సమకాలిక ప్రపంచం సిగ్గుతో ఎంతవరకు తలదించుకున్నదో తెలియదు. కాని, లింకన్ హత్య జరిగినప్పుడు, గాంధీ హత్య జరిగినప్పుడు, కెనడీ హత్య జరిగినప్పుడు ఆ దానవ కృత్యానికి సిగ్గుపడని సభ్య మానవుడు లేడు!


ఐనా, నిన్న మార్టిన్ లూథర్ కింగ్ (జూనియర్) హత్య జరగడాన్ని బట్టి దానవత స్థానంలో మానవత పూర్తిగా నెలకొనడానికి మరెన్ని శతాబ్దాలు పట్ట గలదో అని లజ్జతో, భయంతో, హృదయావేదనతో వితర్కించుకోవలసి వస్తున్నది.


అణు శక్తికి మానవుడు అధినాథుడైన తర్వాత కూడా, అన్య గోళాలలో అతడు పాదం పెట్టబోతున్నప్పుడు కూడా ఆటవిక ప్రవృత్తిని అతడు సడలించుకోలేడా? జాతి మత కుల వర్ణ వర్గాది కృత్రిమ విభేదాల నీచ ప్రేరణకు ఈ ఇరువదవ శతాబ్దిలో కూడా ఒక గాంధీ, ఒక కెనడీ, ఒక కింగ్ బలి కావలసిందేనా?


బ్రిటిష్ వారిలో ఎంత జాత్యహంకారం ఉన్నా కనీసం సూత్ర ప్రాయంగానైనా మన స్వపరిపాలనాధికారాన్ని వారు కాదనేవారు కాదు. ‘మీ దేశాన్ని పరిపాలించుకొనగల స్థితిలో ఈ నాడు మీరు లేరు. ఆ స్థితికి మిమ్ము తీసుకురావడానికే మేము కృషి చేస్తున్నాము. సమయం వచ్చినప్పుడు మీ దేశాన్ని మీకు అప్పగించి, మేము వెళ్లిపోతామని’ వారు చెబుతూ ఉండేవారు. అమెరికాలో, ముఖ్యంగా దాని దక్షిణాది రాష్ట్రాలలో, శ్వేత జాతీయులు తమతో వర్ణజాతుల సమానత్వాన్ని సూత్రప్రాయంగానైనా గుర్తించరు. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా వర్ణజాతివారు ప్రాథమిక పౌరసత్వాలకు సైతం అనర్హులే: శాశ్వతంగా వారు హీనస్థితిలో మిగలవలసినవారే! అట్టి మనః ప్రవృత్తి వ్యక్తమౌతున్న సంఘంలో సమతాసూత్ర సంస్థాపనకై ప్రజోద్యమాన్ని ప్రారంభించడం మృత్యువును వరించడమని తెలిసి కూడా కింగ్ వెనుదీయలేదు. వెన్నుచూపలేదు.


శ్వేతజాతికి చెందినవారి నుంచి మాత్రమే కాక, స్వజాతి వారి నుంచి కూడా తనకు ప్రాణాపాయం తటస్థించవచ్చునని కింగ్‌కు తెలుసు. అహింసాపద్ధతులపై విశ్వాసం లేని కొందరు స్వజాతీయులు -‘బ్లాక్ ముస్లిం’ సంస్థకు చెందినవారు తనను, తన పద్ధతులను విద్వేషిస్తున్నందున, గాంధీజీని ఒక హిందువు చంపినట్టు, తనను ఒక నీగ్రో చంపగల అవకాశం లేకపోలేదని ఆయనకు తెలుసు. అయినా కింగ్ తన కర్తవ్య నిర్వహణలో సందేహించలేదు, సంచలించలేదు.


రెండు మూడు వేల సంవత్సరాల నాటి కంటే ఈనాడు మానవతావాదం కొంత ప్రబలిన మాట నిజమే! గౌతమ బుద్ధుని వలె ఏ మత ప్రవక్త ఈనాడు బానిసతనాన్ని గురించి మౌనం వహించలేదు. అరిస్టాటిల్ వలె దాన్ని సమర్థించలేదు. అయినా రెండు దశాబ్దాల లోపల ఒక గాంధీ, ఒక కెనడీ, ఒక కింగ్ హత్య జరగడం ఆధునిక మానవునికి తలవంపులు కావా? అతడి సభ్యతకు మచ్చకాదా?

1968 ఏప్రిల్ 6 ఆంధ్రజ్యోతి సంపాదకీయం

‘మరొక మహాత్ముని హత్య: మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్’ నుంచి

Updated Date - 2020-04-03T06:09:07+05:30 IST