మానవ ధర్మం మరువరాదు

ABN , First Publish Date - 2020-05-24T08:36:17+05:30 IST

మానవునికి ధర్మాచరణ ముఖ్యం, తాను జీవిస్తున్న సమాజ భద్రతకు, తన జీవన క్రమశిక్షణకు మానవుడు విధిగా ఆచరించవలసిన కొన్ని విశేష ధర్మాలను భాగవతం చెప్పింది. సత్యనిష్ఠ, దయాగుణం, తపస్సు...

మానవ ధర్మం మరువరాదు

సత్యం దయా తపః శౌచం తితిక్షేక్షా శమో దమః!

అహింసా బ్రహ్మచర్యం చ త్యాగః స్వాధ్యాయ ఆర్జవమ్‌!!

మానవునికి ధర్మాచరణ ముఖ్యం, తాను జీవిస్తున్న సమాజ భద్రతకు, తన జీవన క్రమశిక్షణకు మానవుడు విధిగా ఆచరించవలసిన కొన్ని విశేష ధర్మాలను భాగవతం చెప్పింది. సత్యనిష్ఠ, దయాగుణం, తపస్సు, శమము (మనోనిగ్రహం), దమము (ఇంద్రియనిగ్రహం) త్యాగము, స్వాధ్యాయము, నిజాయితీ, నిష్కపటము, ఓర్పు, వినయము మొదలైనవి ప్రతి వ్యక్తి పాటించవలసిన ఉత్తమ ధర్మాలు. ఇవి వ్యక్తిగతంగా తనకే గాక తాను జీవిస్తున్న సమాజానికి, సర్వ మానవాళికి కూడా శ్రేయస్సును కలిగిస్తాయి. సత్యనిష్ఠ వ్యక్తిత్వాన్ని ఉన్నతం చేస్తే దయాగుణం తోటివారిపై అనురాగాన్ని అధికం చేస్తుంది. తపస్సు ఏకాగ్రతను కలిగిస్తే శమ దమాదులు అనవసర వాంఛలను నిగ్రహిస్తాయి. నిష్కపటము మనస్సును శుభ్రం చేస్తే.. ఓర్పు, వినయం వంటివి ఉత్తమ మానవునిగా తీర్చిదిద్దుతాయి. భాగవతపురాణం మనిషిని దైవంగా మార్చే తత్త్వాన్ని బోధిస్తూ, భగవద్భక్తుల కథలను చెప్పి మనకు ఉత్తమ వ్యక్తిత్వాన్ని నిర్మించుకునే మహదవకాశాన్ని కలిగిస్తుంది. భగవంతుని మార్గానుయాయియైున భక్తుడు సర్వ మానవాళికి ఆదర్శప్రాయుడు కావడానికి కావలసిన గొప్ప జ్ఞానాన్ని భాగవతం అందిస్తున్నది. సంపూర్ణ మానవుని సర్వతోముఖమైన ధర్మనిర్వహణ బాధ్యతలను గుర్తు చేసే అనేక సన్నివేశాలు, సందర్భాలు కథారూపంగా ఈ మహా పురాణం మనకు తెలియజేస్తున్నది. 


గురుముఖతః విద్య నేర్చి, ఇంద్రియనిగ్రహుడై, అగ్ని-సూర్య-నారాయణార్చనలను విధిగా నిర్వహించాల్సిన బ్రహ్మచర్యాశ్రమ ధర్మాలు, ఇంద్రియ వాంఛలను త్యజించి మనోనిగ్రహం పాటించాల్సిన గృహస్థాశ్రమ ధర్మాలు, నిత్యాగ్నిహోత్రధర్మాదులను నిర్వహించే వానప్రస్థాశ్రమ ధర్మాలు, అగ్నిహోత్రాన్ని వదిలి తనలోనే అగ్నిని ఆవాహన చేసుకుని, శరీరంలో ఏఏ దేవతా స్థానాలేవో గుర్తించి ధ్యానించాల్సిన సన్యాసాశ్రమ ధర్మాల గురించి భాగవత పురాణం విపులంగా చెప్పింది. మానవునికి అవసరమైన నాలుగు ఆశ్రమధర్మాలు, విధులు ఉత్తమ సంస్కారాన్ని సమకూర్చే సంపదలు. ఇన్ని ఉత్తమ ధర్మాలను చెప్పిన భాగవతమే ధర్మం వలెనే కనిపించే అధర్మాలను గురించి కూడా చెప్పింది. 


విధర్మః పరధర్మశ్చ ఆభాస ఉపమా ఛలః!

అధర్మశాఖాః పంచేమా ధర్మజ్ఞో ధర్మవత్త్యజేత్‌!!

విధర్మము, పరధర్మము, ఆభాసము, ఉపమా, ఛలము అనే ఈ అయిదు అధర్మాలు మానవుడు త్యజించవలసినవిగా పేర్కొన్నాడు వేదవ్యాసుడు. స్వధర్మమునకు బాధ కలిగించేది విధర్మము, ఇతరుల ప్రేరణచే ఇతరుల ధర్మమునాచరించేది పరధర్మము, భగవద్విశ్వాసరహితులైనవారు చేసేది, చెప్పేది ఉపధర్మము, తన ధర్మమును మొండి వైఖరితో నిర్లక్ష్యం చేయడం ఆభాసము. చెప్పబడిన ధర్మమునకు విపరీతార్థాలను తీసి వివరించడం ఛలము - ఈ అయిదు అధర్మాలను మానవుడు విడిచిపెట్టవలసినవిగా చెప్పి, కరుణ, ఆదర్శ గృహస్థ జీవనం, నిత్యకర్మాచరణ శీలత వంటి పలు విశేషాలను అందించిన మానవ ధర్మాచరణ పద్ధతులే లోక కల్యాణకారకములు, భగవద్భక్తి మార్గ నిర్దేశాలు. వీటిని మరవడం మన ధర్మాన్ని మనం మరచిపోవడమేనన్నది సత్యం. 

- గన్నమరాజు గిరిజామనోహరబాబు

Updated Date - 2020-05-24T08:36:17+05:30 IST