నాయిని అల్లుడి ఇంట్లో కోటిన్నర

ABN , First Publish Date - 2021-04-11T07:53:29+05:30 IST

వందల కోట్ల విలువ చేసే బీమా వైద్య సేవల విభాగం(ఐఎంఎస్‌) కుంభకోణంలో శనివారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

నాయిని అల్లుడి ఇంట్లో  కోటిన్నర

  • మెడికల్‌ ఏజెన్సీ నిర్వాహకుడు బుర్రా ప్రమోద్‌రెడ్డి ఇంట్లో 1.15 కోట్లు స్వాధీనం
  • నాయిని మాజీ పీఎస్‌ బావమరిది వినయ్‌రెడ్డి ఇంట్లో మరో 45 లక్షలు పట్టివేత
  • ఐఎంఎస్‌ కుంభకోణంలో ఈడీ సోదాలు.. మొత్తం రూ.3.10 కోట్ల నగదు సీజ్‌
  • కోటి విలువైన బంగారు ఆభరణాలు కూడా
  • బ్లాంక్‌ చెక్కులు, లాకర్లు, ఆస్తుల పత్రాలు
  • ఐఎంఎస్‌ మాజీ డైరెక్టర్‌ దేవికారాణి ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు
  • ఈడీ విచారణలో వెలుగులోకి కొత్త పేర్లు
  • మామ నాయిని అధికారాన్ని అడ్డు పెట్టుకొని శ్రీనివాసరెడ్డి దందా
  • ముకుంద్‌తో కుమ్మక్కు.. టెండర్లు ఏకపక్షం

హైదరాబాద్‌, రాంనగర్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): వందల కోట్ల విలువ చేసే బీమా వైద్య సేవల విభాగం(ఐఎంఎస్‌) కుంభకోణంలో శనివారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ముందు నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి అల్లుడు వేపా శ్రీనివా్‌సరెడ్డి సహా.. పలువురి ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. శ్రీనివా్‌సరెడ్డి ఇంట్లో రూ. 1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నాయిని కార్మికశాఖ మంత్రిగా ఉన్న సమయంలో.. ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ముకుంద రెడ్డి బావమరిది ఎం.వినయ్‌రెడ్డి ఇంట్లో రూ. 45 లక్షలు,  టెలీహెల్త్‌ సర్వీసెస్‌ మెడికల్‌ ఏజెన్సీ నిర్వాహకుడు బుర్రా ప్రమోద్‌రెడ్డి నుంచి రూ. 1.15 కోట్లు సీజ్‌ చేశారు. మొత్తం ఏడు చోట్ల జరిగిన తనిఖీల్లో రూ. 3.10 కోట్ల నగదుతోపాటు.. రూ. కోటి విలువ చేసే బంగారు ఆభరణాలు, బ్లాంక్‌ చెక్కులు, బ్యాంకు లాకర్ల పత్రాలు, విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.  


ఐఎంఎస్‌ కుంభకోణం కేసును తొలుత వెలుగులోకి తెచ్చిన తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు.. ఈ స్కామ్‌ విలువ రూ. 200 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేశారు. నకిలీ బిల్లులు, పత్రాలతో మందులు, మెడికల్‌ కిట్ల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి ఐఎంఎస్‌ మాజీ డైరెక్టర్‌ దేవికారాణి, ఆమె భర్త, ఓమ్నిమేడి సంస్థ అధినేత శ్రీహరి బాబు అలియాస్‌ బాబ్జీతోపాటు మరికొందరిపై ఏసీబీ 8 కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ స్కామ్‌లో కొంత నగదు విదేశాలకు మళ్లిందని గుర్తించారు. ఈ సమాచారంపై ఈడీ అధికారులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచి రాత్రి దాకా.. హైదరాబాద్‌లోని ఏడు వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ముకుంద రెడ్డిని గత నవంబరులోనే ఈడీ అధికారులు విచారించారు. దేవికారాణితోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్నవారి విచారణ కూడా పూర్తయింది. విచారణలో వారు వెల్లడించిన అంశాలు, దర్యాప్తులో లభించిన సమాచారం మేరకు.. ఈడీ ప్రత్యేక బృందాలు శనివారం సోదాలు చేపట్టింది. మాజీ డైరెక్టర్‌ దేవికారాణి, బాబ్జీ ఇళ్లు, కార్యాయాల్లో తనిఖీలు నిర్వహించింది. ఇదే క్రమంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ.. నాయిని అల్లుడు శ్రీనివా్‌సరెడ్డి, డీడీ కాలనీలోని ముకుంద రెడ్డి, రామంతాపూర్‌లోని ఆయన బావమరిది వినయ్‌రెడ్డి, బుర్రా ప్రమోద్‌రెడ్డి ఇళ్లలో సోదాలు చేపట్టింది.


మామను అడ్డం పెట్టుకుని..!

కార్మిక శాఖ మంత్రిగా ఉన్న తన మామ నాయిని నర్సింహారెడ్డి హోదాను అడ్డు పెట్టుకుని.. అప్పటికే వివిధ కార్మిక సంఘాలకు నాయకుడిగా ఉన్న శ్రీనివాస్‌ రెడ్డి ఐఎంఎస్‌ మందులు, కిట్ల కొనుగోళ్లలో చక్రం తిప్పినట్లు ఈడీ గుర్తించింది. మంత్రికి పీఎ్‌సగా ఉన్న ముకుంద రెడ్డి సూచనలు, ఆదేశాల మేరకు మొత్తం టెండర్లు, బిల్లు చెల్లింపులు, కంపెనీలకు టెండర్లు అప్పజెప్పడం వంటి పనులు జరిపినట్లు ఈడీ పూర్తి ఆధారాలతో కనుగొంది. ముకుంద్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి డొల్ల కంపెనీలతో ఈ స్కామ్‌లో భాగస్వాములయ్యారని గుర్తించింది. కీలక నిందితుల్లో ఒకరైన ప్రమోద్‌ రెడ్డి తెలంగాణతోపాటు ఏపీ ఐఎంఎ్‌సలోనూ పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడ్డట్లు అక్కడి పోలీసులు గుర్తించి, అరెస్టు చేశారు.

Updated Date - 2021-04-11T07:53:29+05:30 IST