విద్యుత్‌ చార్జీల శ్లాబులు మారిస్తే జిల్లాపై వందకోట్ల భారం: సీపీఎం

ABN , First Publish Date - 2022-01-26T07:30:11+05:30 IST

విద్యుత్‌ చార్జీల శ్లాబులను మార్పు చేస్తే.. జిల్లా ప్రజలపై రూ.100 కోట్ల భారం పడే అవకాశం ఉందని సీపీఎం నాయకుడు కందారపు మురళి ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యుత్‌ చార్జీల శ్లాబులు మారిస్తే జిల్లాపై వందకోట్ల భారం: సీపీఎం
వినియోగదారుల ఇబ్బందులను తెలియజేస్తున్న కందారపు మురళి

తిరుపతి(ఆటోనగర్‌), జనవరి 25: విద్యుత్‌ చార్జీల శ్లాబులను మార్పు చేస్తే.. జిల్లా ప్రజలపై రూ.100 కోట్ల భారం పడే అవకాశం ఉందని సీపీఎం నాయకుడు కందారపు మురళి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌ సంస్థలను అదాని కంపెనీకి తాకట్టు పెడతారా? రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోరా? వినియోగదారుల సంక్షేమాన్ని కాపాడేలా ఏపీఈఆర్‌సీ నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి ఆన్‌లైన్‌ విధానంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు మంగళవారం తిరుపతి సర్కిల్‌ కార్యాలయం నుంచి మురళి పాల్గొన్నారు. ఆయన మాటల్లోనే.. ‘డిస్కం కంపెనీలు రూపొందించి ప్రతిపాదనలో చూపిన ట్రూ అప్‌ చార్జీలకు అనుమతిస్తే వినియోగదారులపై మరో వెయ్యి కోట్ల భారం పడుతుంది. అలాగే డెవల్‌పమెంట్‌ చార్జీల పేరుతో  విద్యుత్‌ సంస్థలు నూతన విధానాన్ని తీసుకురానున్నాయని, ఇదికూడా అనుమతిస్తే కోట్ల రూపాయల భారం పడుతుంది. పైగా కరోనా సమయంలో పేద, మధ్య తరగతి ప్రజలపైనే ఈభారం పడే అవకాశం ఉంది. ఇక వైసీపీ ప్రభుత్వం కేంద్రం షరతులకు తలొగ్గి విద్యుత్‌ రంగాన్ని మరింతగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తోంది. వీటిని ఏపీఈఆర్‌సీ తిరస్కరించాలి. విద్యుత్‌ సంస్థలో సబ్సిడీ విధానాన్ని కొనసాగించాలి. ఒక ఇంటికి ఒక మీటర్‌ పథకాన్ని రద్దు చేయాలి. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయడం అర్థరహితం.  సోలార్‌ కార్పొరేషన్‌ ఇండియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలు చేసేలా కుదుర్చుకున్న ఒప్పందాలను కూడారద్దు చేయాలి. రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా విద్యుత్‌ వినియోగదారులు ఉండగా కేవలం 65 మందితో బహిరంగ ప్రజాసేకరణ నిర్వహించడం సమంజసం కాదు. విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు నిబంధనల మేరకు జీతాలను చెల్లించాలి’ అని మండలి చైర్మన్‌ను మురళి కోరారు. 

Updated Date - 2022-01-26T07:30:11+05:30 IST