ఆదుకుని.. ఆకలి తీర్చి..!

ABN , First Publish Date - 2020-06-01T10:47:20+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే వలస కూలీలకు ఎస్పీ రాజకుమారి ఆదేశాల మేరకు పోలీసు శాఖ ఆదివారం భోజనాలు సమకూర్చింది.

ఆదుకుని.. ఆకలి తీర్చి..!

విజయనగరం క్రైం, మే 31:  లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే వలస కూలీలకు ఎస్పీ రాజకుమారి ఆదేశాల మేరకు పోలీసు శాఖ ఆదివారం భోజనాలు సమకూర్చింది. చిన్నారులకు బిస్కెట్‌ ప్యాకెట్లు పంపిణీ చేశా రు. వలస కూలీలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. క్వారం టైన్‌లో 14 రోజులు పూర్తయిన తరువాత వారి, వారి స్వస్థలాలకు పంపనున్నారు.  


అడ్డొచ్చిన నిబంధనలు 

 బొబ్బిలి:  హైదరాబాద్‌ నుంచి అర్ధరాత్రి పిల్లాపాపలు, లగేజీలతో  బొబ్బిలిలో దిగిన వలస కార్మికులకి తమ  స్వగ్రామం కోమటిపల్లికి చేరుకోవడానికి నిబంధన లు అడ్డొచ్చాయి. రాత్రంతా బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోనే గడిపారు. రెడ్‌జోన్‌ ఏరియా నుంచి వచ్చినందున వైద్యపరీక్షలు  చేయించుకుని గ్రామంలోకి రావాలని వలంటీర్లు చెప్పడంతో  వైద్యులను సంప్రదిం చారు. సంచార పరీక్షా వాహనం లేదని,  పార్వతీపురం లేదా సాలూరు సీహెచ్‌సీలకు వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోవాలని సీహెచ్‌సీ వైద్యులు జి.శశిభూషణ్‌, వై.విజయమోహన్‌ సూచిం చారు.  అయితే ఆకలితో అలమటిస్తున్న వారికి అభిమాని ఫౌండేషన్‌ చైర్మన్‌ రెడ్డి రాజగోపాలనాయుడు అల్పాహారాన్ని ఏర్పాటు  చేశారు.  


క్వారంటైన్‌కు 51 మంది

బాడంగి: స్థానిక జీఎంసీ బాలయోగి గురుకుల కళాశాలలో క్వారంటైన్‌కు ఆదివారం 51 మంది వచ్చినట్టు తహసీల్దార్‌ ఆదిలక్ష్మి తెలిపారు. మొదటి విడతగా 67 మంది, రెండో విడతగా 97 మందికి పరీక్షలు నిర్వహించగా అందరికి నెగిటివ్‌ రావడంతో స్వస్థలాలకు పంపించినట్టు ఆమె చెప్పారు. 3వ విడతగా చేరిన 51 మందికి పరీక్షలు చేయించనున్నామన్నారు. ఆమె వెంట రెవెన్యూ సిబ్బంది  ఉన్నారు. ఈ క్వారంటైన్‌ కేంద్రాన్ని బొబ్బిలి రూరల్‌ సీఐ డీఎండీ.ప్రసాద్‌ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా వలస కార్మికులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ క్వారంటైన్‌ సెంటర్‌లో భౌతికదూరం పాటించాలన్నారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఎస్‌ఐ సురేంద్రనాయుడు, ఆర్‌ఐ నారాయణరావు, వీఆర్వోలు,  ఏఎన్‌ఎంలు ఉన్నారు. 

Updated Date - 2020-06-01T10:47:20+05:30 IST