కరోనా కాటు జీవితంపై వేటు

ABN , First Publish Date - 2021-05-06T06:37:04+05:30 IST

కరోనా విపత్తు అన్ని రంగాలతోపాటు విద్యారంగంపైనా విపరీ త ప్రభావాన్నే చూపుతోంది. ప్రధానంగా ప్రైవేటు పాఠశాలల ఉనికినే ప్రశ్నార్థకం మార్చేసింది.

కరోనా కాటు జీవితంపై వేటు

దుర్భరంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల పరిస్థితి 

భవనాల అద్దెలు, బిల్లుల చెల్లింపులకు అష్టకషాలు

ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు 


కరోనా విపత్తు అన్ని రంగాలతోపాటు విద్యారంగంపైనా విపరీ త ప్రభావాన్నే చూపుతోంది. ప్రధానంగా ప్రైవేటు పాఠశాలల ఉనికినే ప్రశ్నార్థకం మార్చేసింది. పాఠశాలలు కొనసాగక, ఉపాధి కరువై ఉపాధ్యాయులు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ బలవన్మరణం చెందుతున్నారు. కాగా ఆయా ప్రైవేటు పాఠశాలల యజమానుల పరిస్థితి కూడా దాదాపు అదేవిధంగా ఉంది. ఆన్‌లైన్‌ క్లాస్‌లు నిర్వహించినా పాఠశాల నిర్వహణకు సరిపడా ఆర్థిక వనరులు సమకూరక అవస్థలు పడుతున్నారు. 


మోత్కూరు, తుర్కపల్లి, యాదాద్రి రూరల్‌, మే 5: ఏడాదికి పైగా పాఠశాలలు మూతపడటం తో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సంస్థల నిర్వహణకు అష్టకష్టాలు పడుతున్నాయి. పాఠశాల లు నడిస్తే విద్యార్థుల నుంచి వచ్చే ఫీజులతో యాజమాన్యాలు తమ సిబ్బందికి వేతనాలు, భవనాల అద్దెలు, వాహనాల కిస్తీలు, ఆస్తిపన్నులు, కరెంటు బిల్లులు, బ్యాంకు ఈఎంఐలు చెల్లించేవారు. గ్రామీణ ప్రాంతాల పాఠశాలల్లో కార్పొరేట్‌ పాఠశాలల్లాగా విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు ముందుగా చెల్లించరు. మూడు వాయిదాల్లో వసూలు చేస్తారు. ఈ పాఠశాలల్లో చదివేది రైతులు, వ్యవసాయ కూలీల పిల్లలు కాబట్టి తమకు పంటలు చేతికి వచ్చినప్పుడు వచ్చి ఫీజులు చెల్లిస్తుంటారు. ఏటా విద్యాసంవత్సం చివరలోనే  ఫీజులు ఎక్కువగా వసూలవుతాయి. గత సం వత్సరం ఫీజులు ఎక్కువగా వసూలు అయ్యే సమయం మార్చిలో కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించి పాఠశాలలు మూసి వేయడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ఫీజులు వసూలు కాలేదు. ఈసారి కూడా కరోనా కారణంగా పాఠశాలలు తెరవకపోవడంతో ఫీజులు రాకుండా పో యాయి. సెప్టెంబర్‌లో ఆన్‌లైన్‌ క్లాసులకు అనుమతి ఇచ్చినా, ఫిబ్రవరిలో కొద్ది రోజులు పాఠశాలలు తెరిచినా వారికి ఫీజులు మాత్రం వసూలు కాలేదు. ఇటు ఉద్యోగం రాక, అటు ఒకరి కింద ఎంతకాలం పనిచేస్తామ న్న భావనతోనే ఉన్నత చదువులు చదివిన పలువురు ప్రైవేటు పాఠశాల లు నడుపుతున్నారు. కొందరు అద్దె భవనాల్లో పాఠశాలలు నిర్వహిస్తుండగా, మరికొందరు బ్యాంకుల్లో అప్పు తెచ్చి సొంత భవనాలు నిర్మించుకున్నారు.గ్రామాలనుంచి పాఠశాలకు విద్యార్థులను తీసుక రావడానికి ఫైనాన్స్‌ల్లో, బ్యాంకుల్లో రుణాలు తీసుకుని స్కూల్‌ బస్సులు నడుపుతున్నారు. ఏడాదికిపైగా విద్యార్థులనుంచి ఫీజులురాక, సిబ్బందికి వేతనాలు, భవనాల అద్దెలు, బ్యాంకు ఈఎంఐలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు.  


ఉమ్మడి జిల్లాలో 584 ప్రైవేటు పాఠశాలలు

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 584 ప్రైవేటు పాఠశాల లు ఉన్నాయి. వీటిలో 515 ఉన్నత పాఠశాలలు కాగా 69 ప్రాథమిక పాఠశాలలు ఉన్నట్లు సమాచారం. నల్లగొండ జిల్లాలో 245 ఉన్నత, 29 ప్రాథమిక, సూర్యాపేట జిల్లాలో 160 ఉన్నత, 20 ప్రైమరీ, యాదాద్రి భువనగిరి జిల్లాలో 110 ఉన్నత పాఠశాలలు ఉండగా 20 ప్రైమరీ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు, ఇతర బోధనేతర సిబ్బందికి అప్పులు చేసి జీతాలు ఇవ్వాల్సి వస్తోందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కోరుతున్నాయి. 


కరోనాతో పరిస్థితి దయనీయంగా మారింది : బాల్‌నర్సింహ, కరస్పాండెంట్‌, మాతృశ్రీ హైస్కూల్‌, బొమ్మలరామారం

కరోనాతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల పరిస్థితి దయనీయంగా మారింది. 15నెలలుగా పా ఠశాలలు నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు ఎదుర్కోంటున్నాం. పాఠశాల నడిచినా, న డవకపోయినా ప్రతినెలా బిల్డింగ్‌, బస్సుల ఈఎంఐ, కరెంట్‌ బిల్లులు అన్నీకలుపుకొని ప్రతినెలా రూ.లక్షపైనే చెల్లిస్తూ ఆర్థికంగా చితికిపోతున్నాం. 


ప్రభుత్వమే ఆదుకోవాలి : రాంరెడ్డి, విజ్ఞాన్‌ హైస్కూల్‌, యాదగిరిగుట్ట

కరోనా కాలంలో ప్రైవేట్‌ పాఠశాలలను ప్రభుత్వమే ఆదుకోవాలి. బస్సుల ఈఎంఐలకు వాయిదాల గడువు పొడిగించాలి. విద్యుత్‌ బిల్లులకు మినహాయింపు ఇవ్వాలి. 15 నెలలుగా ఫీజులు వసూలు కాక పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడింది. 


Updated Date - 2021-05-06T06:37:04+05:30 IST