Abn logo
Jan 14 2021 @ 03:32AM

పండక్కి ఊరెళుతూ..రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం

  • మృత్యువుతో పోరాడుతున్న కుమార్తె
  • ఇటీవలే సింగపూర్‌ నుంచి వచ్చిన కుటుంబం


ప్రత్తిపాడు, జనవరి 13: ఉద్యోగరీత్యా సింగపూర్‌లో స్థిరపడిన ఆ కుటుంబం ఎన్నో ఏళ్ల తర్వాత స్వదేశానికి వచ్చింది. బంధువులు, స్నేహితుల మధ్య సంక్రాంతి పండుగ చేసుకోవాలని కారులో ఉత్సాహంగా సొంతూరుకి బయల్దేరింది. కానీ.. రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ చనిపోగా.. కుమార్తె మృత్యువుతో పోరాడుతోంది. పోలీసుల కథనం మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన జొన్నలగడ్డ రమేశ్‌ (45) సింగపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. 15 రోజుల క్రితమే భార్య నీలిమ (40), కుమార్తె అశ్రితతో కలిసి చెన్నైకి వచ్చారు. అక్కడి నుంచి సంక్రాంతి కోసం బుధవారం చెన్నై నుంచి స్వగ్రామం బయల్దేరారు. ప్రత్తిపాడు మండలం కోండ్రుపాడు సమీపంలోని విశ్వనగర్‌ వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై మంటలు చెలరేగాయి. కారు టైరు పేలి కారు అదపు తప్పిందా.. అతివేగంగా వస్తూ ముందున్న వాహనాన్ని ఢీ కొట్టడం వలన ప్రమాదం జరిగిందా అనేది తెలియలేదు. రోడ్డుపై వెళుతున్న వాహనదారులు, స్థానికులు మంటలను ఆర్పి ముగ్గురిని కారు నుంచి బయటకు తీశారు. పోలీసులు వారిని స్థానిక కేఎంసీ వైద్యశాలకు తరలించగా.. రమేశ్‌, నీలిమ చికిత్స పొందుతూ మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన కుమార్తె అశ్రిత పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement
Advertisement
Advertisement