చావైనా.. బతుకైనా నీతోనే.. భార్య తాగిన పురుగుల మందునే.. భర్త కూడా..

ABN , First Publish Date - 2020-05-30T16:05:04+05:30 IST

ప్రేమ వివాహం చేసుకుని, అన్యోన్యంగా కాపురం చేస్తున్నారు. కానీ కొడుకు ప్రేమ వివాహం నచ్చని తల్లి సూటిపోటి మాటలతో కోడలి మనస్సును గాయపర్చింది. దీనికి తోడు భర్తను వదిలేసి తల్లిగారింటి వద్దే ఉంటున్న ఆడపడుచూ కూడా వేధించడంతో..

చావైనా.. బతుకైనా నీతోనే.. భార్య తాగిన పురుగుల మందునే.. భర్త కూడా..

ఇంటిల్లిపాదీ వేధింపులు తాళలేకే బలవన్మరణం

ప్రేమించి పెళ్లి చేసుకున్న మూడున్నరేళ్లకే మృత్యు ఒడిలోకి

తల్లిదండ్రుల మృతితో ఆగమైన చిన్నారులు 

అమ్మమ్మ ఒడికి చేరిన ఏడాదిన్నర పాప, మూడేళ్ల బాలుడు

పోలీసు బందోబస్తు నడుమ నిందితుల నిర్బంధం


రామాయంపేట (మెదక్): ప్రేమ వివాహం చేసుకుని, అన్యోన్యంగా కాపురం చేస్తున్నారు. కానీ కొడుకు ప్రేమ వివాహం నచ్చని తల్లి సూటిపోటి మాటలతో కోడలి మనస్సును గాయపర్చింది. దీనికి తోడు భర్తను వదిలేసి తల్లిగారింటి వద్దే ఉంటున్న ఆడపడుచూ కూడా వేధించడంతో.. భర్త ఎదుటే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. భార్య బతుకదేమోనన్న భయంతో భర్త కూడా అదే మందు తాగాడు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గంటల తేడాతో ఇద్దరూ ప్రాణాలొదిలారు. 


వివరాల్లోకి వెళ్తే... మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామానికి చెందిన వీఆర్‌ఏ విజయ్‌కుమార్‌రెడ్డి(29), కామారెడ్డి జిల్లా మల్లుపల్లికి చెందిన రుచిత(25) ప్రేమించుకున్నారు. ఒకే కులం కావడంతో ఇరువర్గాల పెద్దలు పెళ్లికి అడ్డు చెప్పలేదు. 2016 జూన్‌లో వారు పెళ్లి చేసుకున్నారు. వారికి ఏడాదిన్నర పాప సాన్విత, మూడేళ్ల బాబు యువన్‌రెడ్డి ఉన్నారు. రుచిత కుటుంబీకులు మొదట్లో కట్నకానుకలు ఇవ్వకున్నా... పిల్లలు పుట్టాక ఐదారులక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఇతరాత్రా వస్తువులు ముట్టజెప్పారు. అయినా, అత్త ప్రేమలత, మామ నర్సింహారెడ్డి, ఇంట్లో ఉన్న ఆడబిడ్డ రేవతి చీటికి మాటికి రుచితను చీదరించుకునేవారు. కడుపునిండా అన్నం పెట్టకుండా బాధపెట్టేవారు. ఎప్పటికైనా వారితో తనకు హాని కలుగుతుందని రుచిత తరచూ తల్లికి ఫోన్‌చేసి చెప్పేది. ఈ క్రమంలోనే గురువారం రుచితతో ఆడపడుచు గొడవ పడింది. మనస్థాపానికి గురైన రుచిత పురుగు మందు తాగింది. అక్కడే ఉన్న భర్త కూడా అదే మందును తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని కుటుంబీకులు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. రుచిత గురువారం రాత్రి చనిపోగా, శుక్రవారం తెల్లవారుజామున విజయ్‌కుమార్‌రెడ్డి మరణించాడు. దీంతో అభం శుభం ఎరగని చిన్నారులు అమ్మమ్మ ఒడిలోకి చేరారు. డి.ధర్మారం గ్రామంలోని విజయ్‌కుమార్‌రెడ్డి ఇంట్లోనే నిందితులను పోలీసులు నిర్బంధించారు. రుచిత తల్లిదండ్రులు, బంధువులకు కన్పించకుండా పోలీసులు దాచారు. 


చావుకు కారకులను అప్పగించాలని ఆందోళన

తమ కూతురు, అల్లుడి చావుకి కారణమైన వారిని తమకు అప్పగించాలని రుచిత తల్లిదండ్రులు, బంధువులు శుక్రవారం సాయంత్రం ధర్మారం గ్రామంలో ఆందోళన చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిందితులకు శిక్షపడేలా చూస్తామని సీఐ నాగార్జునగౌడ్‌ చెప్పడంతో ఆందోళన విరమించారు. విజయ్‌కుమార్‌రెడ్డి, రుచిత దంపతుల ఆత్మహత్యకు కారణమైన విజయ్‌కుమార్‌రెడ్డి తల్లిదండ్రులు ప్రేమలత, నర్సింహారెడ్డి, సోదరి రేవతిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పోలీసులు నిర్బంధించడంతో కొడుకు విజయ్‌కుమార్‌రెడ్డిని కడసారి చూసే అవకాశం ఆ కసాయితల్లిదండ్రులకు లేకుండా పోయింది. 

Updated Date - 2020-05-30T16:05:04+05:30 IST