ఎమ్మెల్సీ ఎన్నికల్లో దండేకు అసమ్మతి గండం

ABN , First Publish Date - 2021-11-30T04:06:56+05:30 IST

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి దండే విఠల్‌కు స్వపక్షం నుంచే అసమ్మతి ముప్పు పొంచి ఉందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో దండేకు అసమ్మతి గండం

-రెబెల్స్‌ ఉపసంహరించుకున్నా క్రాస్‌ ఓటింగ్‌ ముప్పు?

-ఎంపీటీసీలను క్యాంపులకు తరలించిన ఎమ్మెల్యేలు 

-ఈటల ప్రకటనతో టీఆర్‌ఎస్‌ శిబిరంలో టెన్షన్‌

ఆసిఫాబాద్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి దండే విఠల్‌కు స్వపక్షం నుంచే అసమ్మతి ముప్పు పొంచి ఉందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శుక్రవారం జరిగిన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం తర్వాత జిల్లా నుంచి తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన వారంతా తమ నామినేషన్లను ఉపసంహరించు కున్నప్పటికీ అంతర్లీనంగా పార్టీ నాయకత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. వాస్తవానికి ఈ అభ్యర్థులంతా నియోజకవర్గస్థాయి నేతల ఆశీస్సులతోనే విఠల్‌కు పోటీగా నామినేషన్లు వేశారన్న అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ఆశావహులు మొదలుకొని కొంతమంది ఎమ్మెల్యేలు కూడా దండేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాయకత్వం ఎంపిక చేయడంపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ అభ్యర్థికి పార్టీ అధిష్టానంతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా సదరు ఎమ్మెల్యేలు, నియోజక వర్గస్థాయి నేతలు, ఆశావహులు తమ అసంతృప్తిని వెలిబుచ్చే పరిస్థితి లేదు. దీంతో తిరుగుబాటు అభ్యర్థుల రూపంలో భారీ సంఖ్యలో నామినేషన్లు వేయించడం ద్వారా అధిష్టానానికి సంకేతాలిచ్చినట్టు భావిస్తున్నారు. అయితే పార్టీ నాయకత్వం అభ్యర్థి గెలుపు బాధ్యతలను ఆయా ఎమ్మెల్యేలకు అప్పజె ప్పడంతో రెబెల్స్‌గా బరిలోకి దిగిన అభ్యర్థులను నయానో, బయానో బుజ్జగించి తమ నామినేషన్లను ఉపసంహరింపజేయడంలో సఫలమయ్యారు. అదే సమయంలో ఆయా అభ్యర్థులకు ప్రతిపాదకులుగా మద్దతునిచ్చిన 230మంది ఎంపీటీసీలతోనూ చర్చించి నచ్చజెప్పారు. అయినప్పటికీ ఇందులో చాలామంది ఎంపీటీసీలు అధిష్ఠానం వ్యవహారశైలిపట్ల బాహాటంగానే తమ నిరసన వ్యక్తం చేసినట్టు సమాచారం. అయినా అందరితో కలిసి క్యాంపులకు తరలివెళ్లినప్పటికీ ఓటింగ్‌ సమయానికి వీరి వ్యవహారశైలి ఎలా ఉంటుందోనన్న బెంగ అటు ఎమ్మెల్యేలను, ఇటు పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని తీవ్రంగా వేధించే విషయమే. ఈ నేపథ్యంలోనే క్రాస్‌ఓటింగ్‌ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని సొంత పార్టీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో పాటు ప్రతిపక్షాలకు చెందిన సభ్యులను కూడా ఆకర్షించే పనిలో పడినట్టు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ కూడా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పార్టీ తరుపున మద్దతు ఇస్తున్న అభ్యర్థికి వీలైనన్నీ ఓట్లు నమోదయ్యేలా అధికార పార్టీ సభ్యులకు గాలం వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఈ మేరకు జిల్లాలోని తన సన్నిహితులతో మంతనాలు సాగిస్తూ అవసరం అయితే అధికార పార్టీకి దీటుగా ఖర్చు పెట్టేందుకు కూడా వెనకాడబోమని చెబుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం బరిలో నిలిచింది విఠల్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థి మాత్రమే. పైకి విఠల్‌ ఎన్నిక లాంఛనమే అని భావిస్తున్నా క్రాస్‌ఓటింగ్‌ జరిగితే అధికార పార్టీకి డ్యామెజీ తప్పకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు పోటాపోటీగా క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీకి మొత్తం 549 ఓటర్లు ఉండగా, మరో 80మంది వరకు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఉన్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీకి 199మంది సభ్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 88మంది మాత్రమే ఉన్నారు. బీజేపీకి 72మంది, 84మంది స్వతంత్రలు, ఆరుగురు సీపీఐ, 22మంది ఎంఐఎం నుంచి ఎన్నికైన ఓట్లతో కలుపుకుంటే 932మంది ఉన్నారు. ఇందులో స్వతంత్రులు, కాంగ్రెస్‌ నుంచి ఎన్నికైన సభ్యులతోపాటు టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి రెబెల్స్‌కు మద్దతు నిచ్చిన ఓటర్లు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడితే మాత్రం అనూహ్య ఫలితం వచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

లక్షల్లో నజరానాలు?

స్థానిక సంస్థల ఎన్నికలు ఖాయమని తేలడంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఎంపీటీసీలు, కౌన్సిలర్ల ఓట్లకు డిమాండు పెరుగుతోంది. ఇప్పటివరకు అధికార పార్టీ తన ఓటర్లకు సంప్రదాయంగా నజరానాలు ప్రకటించిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉన్న ఆదివాసి మహిళ పెందోర్‌ పుష్పరాణికి మద్దతుగా బీజేపీ నాయకత్వం తెరవెనుక పావులు కదుపుతూ అధికారపార్టీకి చెందిన ఎంపీ టీసీలు, కౌన్సిలర్లకు నగదు తాయిలాలను ఎరగా వేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సగటున ఒక్కో ఎంపీటీసీకి మూడు లక్షల నుంచి రూ.ఐదులక్షల వరకు ముట్టుచెపుతామని సన్నిహితుల ద్వారా ప్రతిపాదిస్తు న్నట్టు సమాచారం. దీంతో అధికార పార్టీ నేతలు ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్ల సభ్యులను క్యాంపులకు తరలిస్తున్నారు. వారితోపాటు వారి కుటుంబ సభ్యుల కదలికలపైన కన్నేసి ఉంచుతున్నట్టు సమాచారం. అంతేకాదు క్యాంపుల్లో ఉండే ఓటర్లు ఎవరితో మాట్లాడుతున్నరనే విషయాన్ని క్షుణ్ణంగా గమనించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని చెబుతున్నారు. మొత్తం మీద పోలింగ్‌ సమయం నాటికి ఈ నజరానాల వ్యవహారం మరింత రంజుగా మారే అవకాశం ఉందంటున్నారు.

Updated Date - 2021-11-30T04:06:56+05:30 IST