భార్య కనిపించడం లేదంటూ భర్త ఫిర్యాదు.. రెండు నెలల తర్వాత వీడిన మిస్టరీ..

ABN , First Publish Date - 2020-07-13T20:04:18+05:30 IST

వర్ని మండలం జలాల్‌పూర్‌ గ్రామంలో ఆదివారం దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను తండ్రి

భార్య కనిపించడం లేదంటూ భర్త ఫిర్యాదు.. రెండు నెలల తర్వాత వీడిన మిస్టరీ..

అనుమానం పెనుభూతమై!

అనుమానంతో భార్యను హత్యచేసిన భర్త

రెండు నెలల తర్వాత వెలుగులోకి ఘటన


వర్ని (నిజామాబాద్): వర్ని మండలం జలాల్‌పూర్‌ గ్రామంలో ఆదివారం దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను తండ్రి  సహకారంతో భర్త కడతేర్చిన ఘటన రెండు నెలల అనంతరం బహిర్గతమైంది. వర్ని ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జలాల్‌పూర్‌కు చెందిన తాడెం బాలరాజు రుద్రూరు మండలం అంబం(ఆర్‌) గ్రామానికి చెందిన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. అనంతరం బాన్సువాడ మండలం హన్మాజీపేటకు చెందిన సావిత్రి(27)ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి సతీష్‌(6), వసుంధర(4) సంతానం ఉన్నారు. కొన్నాళ్లుగా బాలరాజు తన భార్య మరో వ్యక్తితో అక్రమసంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏప్రిల్‌ 27 న పథకం ప్రకారం బాలరాజు మోతుకాకు, మొర్రిపళ్లు, విస్తారాకులు తీసుకొద్దామంటూ నమ్మబలికి తన తండ్రి సాయిలుతో కలిసి భార్యను వెంటబెట్టుకొని బడాపహాడ్‌ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. 


అనంతరం అక్కడ సావిత్రి గొంతునులిమి హత్య చేసి మృతదేహాన్ని అక్కడి వదిలేసి వచ్చారు. హత్య జరిగిన ఎనిమిది రోజులకు తన భార్య కనిపించడం లేదంటూ నిందితుడు బాలరాజు వర్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేసిన అనంతరం నిందితుడిని అనుమానించి వారి పద్ధతిలో విచారించగా బాలరాజు నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో రుద్రూరు సీఐ అశోక్‌రెడ్డి, వర్ని ఎస్సై అనిల్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని అటవీ ప్రాంతంలో ఎముకలుగా మిగిలిన మృతదేహానికి పంచనామా నిర్వహించారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-07-13T20:04:18+05:30 IST