అభివృద్ధికి నిధుల గండం

ABN , First Publish Date - 2021-02-27T06:06:48+05:30 IST

రాజకీయ కేంద్రమైన జిల్లాలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులను కేటాయిస్తూ మంజూరులకు సంబంధించిన ఉత్తర్వులను సైతం వెలువరిస్తున్నప్పటికీ ఆ నిధుల విడుదల విషయంలో సర్కారు దోబూచులాడుతుండడం విమర్శలకు తావిస్తోంది.

అభివృద్ధికి నిధుల గండం

భారీగా మంజూరులు, కేటాయింపులు 

ఆర్భాటంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు 

పరిహారం డబ్బుల విషయంలో జిల్లాలోని రైతులకు  తప్పని పడిగాపులు 

చేసిన పనుల బిల్లుల కోసం కాంట్రాక్టర్‌లకు తప్పని చక్కర్లు 

నిర్మల్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి)  : రాజకీయ కేంద్రమైన జిల్లాలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులను కేటాయిస్తూ మంజూరులకు సంబంధించిన ఉత్తర్వులను సైతం వెలువరిస్తున్నప్పటికీ ఆ నిధుల విడుదల విషయంలో సర్కారు దోబూచులాడుతుండడం విమర్శలకు తావిస్తోంది. నిధుల కేటాయింపులు మంజూరులు జరిగిపోయిందన్న ధీమాతో ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపడుతున్నారు దీంతో పాటు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తవుతున్న కారణంగా సంబంధిత కాంట్రాక్టర్‌లు పనులను మొదలుపెడుతుండడంతో ఆ అభివృద్ది పనులకు సంబంధించిన లబ్ధిదారులు సంబురపడిపోతుండడం పరిపాటిగా మారింది. కేటాయించిన అభివృద్ధి పనులు జిల్లా పురోగాభివృద్ధికి తోడ్పడతాయన్న భావన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఈ ఆర్భాటమంతా కొద్దిరోజులకే పరిమితమవుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో నిన్నటి వరకు ప్రతిపక్ష పార్టీలు బహిరంగంగా విమర్శలు చేసినప్పటికీ ప్రస్తుత అధికారపార్టీ నాయకులే స్వయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. జిల్లాలో ఇలా కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన పనులు నిధుల కొరత కారణంగా ప్రస్తుతం నిలిచిపోవడం చర్చకు తావిస్తోంది. పరిపాలనకు దిశానిర్దేశం సూచించే కలెక్టరేట్‌ భవనం సైతం నిధులకొరత కారణంగా అర్థాంతరంగా నిలిచిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. కలెక్టరేట్‌ భవనం కోసం రూ.40 కోట్లను మంజూ రు చేసినప్పటికీ ఇప్పటి వరకు చేసిన పనులకు గాను కేవలం రూ.7 కోట్ల రూపాయల నిధులను మాత్రమే బిల్లుల రూపంలో కలెక్టర్‌కు చెల్లించారు. మిగతాచేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడం సదరు కాంట్రాక్టర్‌ మిగతా పనులను చేయలేక  చేతులేత్తేయడం చర్చకు తావిస్తోంది. అలాగే జిల్లా కేంద్రంలో రూ.కోటి రూపాయలతో నిర్మించిన అంబేడ్కర్‌ భవన నిర్మాణ పనులు సైతం నిలిచిపోయాయి. పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయకపోవడంతో ప్రస్తుతం ఆ పనులన్ని ఆగిపోయాయి. దీంతో నిర్మించిన భవనం సైతం శిథిలావస్థకు చేరుకునే ప్రమాదంలో ఉందంటున్నారు. వీటికి తోడుగా నిర్మల్‌ జిల్లాలోని ముథోల్‌ నియోజకవర్గానికి 50 ఎకరాలు, నిర్మల్‌ నియోజకవర్గానికి మరో 50 ఎకరాలు కలిపి మొత్తం లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం హైలెవల్‌ కాలువల నిర్మాణ పనులు సైతం నిధుల కొరతతో నిలిచిపోయాయి. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో చేపట్టిన ఈ 27వ, 28వనంబర్‌ ప్యాకేజీ హైలెవల్‌ కాలువల నిర్మాణం అప్పటి కాంగ్రెస్‌ హయాంలో రూపుదిద్దుకుంది. ఆ తరువాత  ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం పనులను చేపట్టేందుకు అవసరమైన మేరకు నిధులను అందిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా ఈ కాలువల పనులను ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్‌ నుంచి తప్పించి కాలేశ్వరం ప్రాజెక్ట్‌ పరిధిలోకి చేర్చింది. అయితే కాలువల కింద భూములను కోల్పోయిన వారికి ఆలస్యంగా పరిహారం అందించిన ప్రభు త్వం నిర్మాణ పనులకు సంబంధించి బిల్లులు మాత్రం సక్రమంగా చెల్లించలేదన్న ఆరోపణలున్నాయి. నిధుల కొరత కారణంగానే బిల్లులు చెల్లించకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్‌ మిగతా పనులను చేయలేక చేతులేత్తేశారు. తద్వారా సర్కారు పేర్కొనే అభివృద్ది ఎజెండాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికార పార్టీ నేతలే స్వయంగా అభిప్రాయపడుతుండడం ప్రాధాన్యత అంశంగా మారిందంటున్నారు. 

పరిపాలన కేంద్రాన్ని వెక్కిరిస్తున్న నిధుల కొరత

జిల్లా పరిపాలన రంగానికి దిశానిర్దేశం చూపించే కలెక్టరేట్‌కే ఇప్పటి వరకు సొంత భవనం లేకపోవడం చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం ఆర్డీఓ కార్యాలయం కోసం నిర్మించిన భవనంలో కలెక్టరేట్‌ను కొనసాగిస్తున్నారు. అయితే ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ఎల్లపెల్లి సమీపంలో కొచ్చెరువు వద్ద నిర్మిస్తున్న కొత్త కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి అడుగడుగునా నిధుల సమస్య వెంటాడుతోందంటున్నారు. గత మూడు సంవత్సరాల నుంచి కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులు నిధుల కొరతతో నత్తనడకను తలపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు నిధులు విడుదలకాకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్‌కు నిర్మాణాన్ని చేపట్టిన శాఖ బిల్లులు చెల్లించకలేకపోతోంది. ఇప్పటికే పలుసార్లు నిర్మాణ గడువును పొడగించినప్పటికీ సక్ర మంగా నిధులు విడుదల కాకపోవడం అనుకున్న సమయంలో పనుల పూర్తికి ఆటంకమవుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం రూ.10 కోట్లలోపు రూపాయలను మాత్రమే కాంట్రాక్టర్‌కు చెల్లించగా మరో రూ.10 కోట్ల వరకు సంబంధిత కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సి ఉందంటున్నారు. ప్రస్తుతం కాంట్రాక్టర్‌ బిల్లులు సక్రమంగా రాకపోవడంతో పనులు చేయలేమంటున్నారు. ఓ జిల్లా కలెక్టర్‌ స్థాయి అధికారి కార్యాలయం భవన నిర్మాణ పనుల పరిస్థితే ఇలా ఉంటే మి గతా అభివృద్ది పనుల పరిస్థితి ఇంకా ఏ విధం గా ఉంటుందోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

హైలెవల్‌ కాలువల పరిస్థితి ఆధ్వాన్నమే 

జిల్లాలో లక్ష ఎకరాలకు అదనంగా సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన కాలేశ్వరం 27వ,28వ నంబర్‌ ప్యాకేజీ హైలేవల్‌ కాలువల పరిస్థితి ఇప్పటికి ఆధ్వాన్నంగానే ఉందంటున్నారు. ఇరిగేషన్‌ శాఖ నుంచి చేసిన పనులకు గాను ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరుకాకపోవడంతో సదరు కాంట్రాక్టర్‌ పనులను నిలిపివేశారు. ఇరిగేషన్‌శాఖకు సంబంధించిన రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సైతం సంబంధిత కాంట్రాక్టర్‌తో చర్చలు జరిపి బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల చేయిస్తామంటూ హామీలిచ్చారు. ఆ హామీలు కూడా నెరవేరకపోవడంతో సదరు కాంట్రాక్టర్‌ పనులను పూర్తిగా నిలిపివేసి తన కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని సర్కారును కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కాలువకు సంబందించిన చిన్నా చితక పనులను సబ్‌ కాంట్రాక్టర్‌లు చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయి పనులు మాత్రం ఇంకా ముందుకు సాగడం లేదు. ప్రభు త్వం ఈ రెండు హైలెవల్‌ కాలువలకు కేటాయింపుల మేరకు నిధులను విడుదల చేయకపోతుండడమే సమస్యకు మూలకారణంగా మారిందంటున్నారు. 

వెంటాడుతున్న నిధుల గ్రహణం

జిల్లాలోని అనేక అభివృద్ది పనులకు నిధుల కొరత గ్రహణంగా మారిందంటున్నారు. ముఖ్యంగా బాసర సరస్వతీ ఆలయ అభివృద్ది కోసం రూ. 50 కోట్లతో మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేస్తామని రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. అయితే స్థానికుల డిమాండ్‌ను సర్కారు పక్కన పెట్టింది. ఇటీవల ఒత్తిడి తీవ్రం అవ్వడంతో రూ. 50 కోట్లకు గాను కేవలం రూ. 7 కోట్లను మాత్రమే విడుదల చేయడం చర్చకు తావిస్తోంది. జిల్లా కేంద్రంలో నిర్మించిన అంబేడ్కర్‌ భవనం పరిస్థితి కూడా నిధుల కొరతతో మూలనపడింది. అలాగే ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన చెక్‌డ్యాంలు, కాలువలు, ఇతర పనులను సైతం నిధుల కొరత వెంటాడుతోంది. పంచాయతీ రాజ్‌ , ఆర్‌ అండ్‌ బీ శాఖ ఆధ్వర్యంలో కూడా రోడ్లు, వంతెనల నిర్మాణ పనులకు నిధుల సమస్య ఆటంకమవుతోంది. మొత్తానికి జిల్లా అభివృద్దికి నిధుల కొరత శాపంగా మారిందన్న అభిప్రాయాలు సాధారణ ప్రజలు, ప్రతిపక్షాల నుంచే కాకుండా స్వయంగా అధికార పార్టీ నేతల నుండి కూడా వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-02-27T06:06:48+05:30 IST