HYD : మద్యం మానేయకపోతే పుట్టింటికెళ్తానని భర్తకు చెప్పి డ్యూటీకెళ్లిన భార్య.. సాయంత్రం ఇంటికొచ్చి తలుపులు తెరవగా..!
ABN , First Publish Date - 2021-11-09T18:07:16+05:30 IST
10 సంవత్సరాల క్రితం భార్య దేవిదుర్గతో కలిసి నగరానికి వచ్చాడు..
హైదరాబాద్ సిటీ/అమీర్పేట : నిత్యం తాగి ఇంటికొస్తున్న భర్తను మద్యం మానేయాలని భార్య మందలించినందుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఆర్నగర్ ఎస్ఐ కోటేశ్వర్రావు తెలిపిన వివరాలప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం తాళ్లతూర్పు గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్(30) బతుకుదెరువు కోసం 10 సంవత్సరాల క్రితం భార్య దేవిదుర్గతో కలిసి నగరానికి వచ్చాడు. దుర్గా ప్రసాద్ దినసరి కూలీ. భార్య హౌస్ కీపర్. సంవత్సరం కాలంగా రోజూ మద్యం తాగి ఇంటికివచ్చి భార్యతో గొడవపడుతున్నాడు.
మద్యం మానేయకపోతే పుట్టింటికి వెళతానని చెప్పి, భార్య పనికి వెళ్లిపోయింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న దుర్గాప్రసాద్ తలుపులకు గడియ వేసి వైరుతో ఇనుపరాడ్డుకు ఉరేసుకున్నాడు. పని ముగించుకుని ఇంటికి వచ్చిన భార్య దేవిదుర్గా తలుపులు తీసేందుకు ప్రయత్నించగా తెరుచుకోలేదు. గమనించిన దుర్గాప్రసాద్ సోదరుడు శివశంకర్ తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా వైరుతో ఉరేసుకుని కిందపడి ఉన్నాడు. స్థానిక ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. భార్య పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.