పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్న భర్త.. ఇదే అదనుగా భావించి.. కొడుకుతో కలిసి..

ABN , First Publish Date - 2021-09-07T06:13:18+05:30 IST

ఓ మహిళ..

పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్న భర్త.. ఇదే అదనుగా భావించి.. కొడుకుతో కలిసి..
సంపత్(ఫైల్ ఫొటో), నిందితుల అరెస్టు చూపిస్తున్న డీసీపీ వెంకటలక్ష్మి

డామిట్ కథ అడ్డం తిద

కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య

తీగరాజుపల్లి హత్యను ఛేదించిన పోలీసులు

వివరాలను వెల్లడించిన డీసీపీ వెంకటలక్ష్మి


వరంగల్‌: జల్సాలకు అలవాటు పడి కుటుంబ సభ్యులను వేధిస్తుండడంతో తట్టుకోలేక కొడుకుతో కలిసి ఓ మహిళ కట్టుకున్న భర్తను హత్య చేసింది. తల్లీకొడుకు హత్యను పాలివారిపై నెట్టే ప్రయత్నం చేసి కేసులో చిక్కుకున్నారు. సీపీ కార్యాలయంలో సోమవారం వరంగల్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మి నిందితుల అరెస్టు చూపించి వివరాలను వెల్లడించారు. 


వరంగల్‌ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామానికి చెందిన హంస సంపత్‌(55)-సుగుణ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నర్సంపేట తహసీల్దార్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తుండగా, చిన్న కుమారుడు అశోక్‌ ఇంటి వద్దనే ఉండి వ్యవసాయం చేస్తున్నాడు. కొద్ది రోజుల పాటు మీ సేవ నిర్వహించి మూసేశాడు. అయితే సంపత్‌ కుటుంబానికి అతడి పాలివాడైన చలపతికి మధ్య భూతగాదాలు ఉండగా పలుమార్లు పంచాయితీలు జరిగాయి.


సంపత్‌ గ్రామంలో ఏ పని చేయకుండా వరంగల్‌కు వచ్చి జల్సా చేసేవాడు. లాడ్జీలలో బస చేస్తూ పరిచయం ఉన్న మహిళలను తీసుకెళ్లి తిరిగేవాడు. డబ్బులన్నీ ఖర్చు చేస్తూ మహిళలతోనే ఎక్కువ సమయం కేటాయించేవాడు. ఈ విషయమై భార్య సుగుణ, చిన్న కుమారుడు అశోక్‌ పలుమార్లు మందలించినా సంపత్‌లో మార్పు రాలేదు. గత ఆగస్టు 31న భార్య సుగుణ, కుమారుడు అశోక్‌తో పెద్దఎత్తున గొడవ జరిగి దాడి చేసుకున్నారు. నాపై చేయి చేసుకుంటారా.. అని సంపత్‌ మనోవేదనకు గురై ఈనెల 3న తెల్లవారుజామున ఇంట్లో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇది చూసిన భార్య సుగుణ మరో ఇంట్లో అద్దెకు ఉంటున్న చిన్నకుమారుడు అశోక్‌కు తెలిపింది. ఇదే అదనుగా భావించిన తల్లీ కుమారుడు తండ్రిని కత్తితో గొంతులో పొడిచి హత్య చేసినట్లు డీసీపీ వెంకటలక్ష్మి తెలిపారు. అయితే చలపతి నుంచి భూమి లాక్కోవచ్చని పథకం పన్ని మృతుడి లుంగీ రెండు ముక్కలుగా చేసి కాళ్లకు, చేతులకు కట్టి మృతదేహాన్ని చలపతి ఇంటి సమీపంలో చింతచెట్టు కింత పడేసి వెళ్లారు. అందరిని నమ్మించేందుకు బోరున విలపిస్తూ అదే రోజు సాయంత్రం అశోక్‌ తన తండ్రిని చలపతిని చంపేశాడని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.


పలు కోణాల్లో పోలీసుల దర్యాప్తు

సంపత్‌ హత్య ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. పర్వతగిరి సీఐ విశ్వేశ్వర్‌ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గ్రామంలో విచారించగా సుగుణ, అశోక్‌పై అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సోమవారం ఇద్దరిని స్టేషన్‌కు పిలిచి విచారించగా తామే హత్య చేసి చలపతి ఇంటి ముందు వేసినట్టు ఒప్పుకున్నారని డీసీసీ పేర్కొన్నారు. ఇద్దరిపై హత్య కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. కేసులో ప్రతిభ కనబరిచిన మామునూరు ఏసీపీ నరేష్‌కుమార్‌, పర్వతగిరి సీఐ విశ్వేశ్వర్‌, సంగెం ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి, ప్రొబేషనరీ ఎస్‌ఐలు భరత్‌, నవీన్‌కుమార్‌ను సీపీ అభినందించారు.


Updated Date - 2021-09-07T06:13:18+05:30 IST