ఊసే లేని ‘ఉద్దానం’ వాగ్దానాలు

ABN , First Publish Date - 2021-04-08T05:50:30+05:30 IST

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. దీనిపై ప్రభుత్వాలు చేస్తున్న హడావుడి మాటలకే...

ఊసే లేని ‘ఉద్దానం’ వాగ్దానాలు

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. దీనిపై ప్రభుత్వాలు చేస్తున్న హడావుడి మాటలకే పరిమితమవడం అత్యంత విచారకరం. ఈ వింత వ్యాధి వెలుగులోకి వచ్చి మూడు దశాబ్దాలైనా నేటికీ దీనికి గల కారణాలను తెలుకోలేకపోవడం ఇంకా విడ్డూరం. కిడ్నీ వ్యాధి దేశంలో సగటున 7 శాతం మందిలో ఉండగా ఇక్కడ మాత్రం ఏకంగా 37 శాతం మందిని పీడిస్తుందని ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌’ (ఐసిఎంఆర్‌) గుర్తించింది. ఉద్దానంలో కిడ్నీ వ్యాధితో ఇప్పటి వరకు 20 వేల మందికి పైగా చనిపోయి ఉంటారని కొన్ని సంస్థల ప్రాథమిక అంచనా. శ్రీకాకుళం జిల్లా ఉత్తరాన ఒడిషా వైపు వెళ్ళే జాతీయ రహదారిలో గల ఏడు మండలాలను ఉద్దానం ప్రాంతంగా పిలుస్తారు. సముద్రతీరం, కొబ్బరి, జీడి, అరటి తోటలతో నిత్యం ఉద్యానవనంలా ఉండడంతో ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. అయితే ఆ సుందర సీమ నేడు నిత్య మరణాలతో ఉడుకుతోంది. 


జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఆయన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తాము అధికారంలోనికి వచ్చిన వెంటనే ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల నివారణా చర్యలు చేబడతామని హామీ ఇచ్చారు. 2019 సెప్టెంబరు 3న జిఓ నెంబరు 102 జారీ చేశారు. 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, డయాలసిస్‌ కేంద్రం, రీసెర్చ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామని అందులో పేర్కొన్నారు. ఆసుపత్రి నిర్మాణానికై 50 కోట్ల రూపాయలు, సిబ్బంది వేతన భత్యాలకు అయ్యే ఖర్చులకు సాలుకు 8.3 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఆ జిఓలో ఉత్తర్వులు జారీ చేశారు. అదే నెల 6న స్వయంగా ముఖ్యమంత్రి చేతుల మీద గానే పలాసలో ఆ ఆసుపత్రికి శంకుస్థాపన కూడా జరిగింది. శాసన సభ స్పీకర్‌, అనేక మంది మంత్రులు పాల్గొన్న సభలో ఇక ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీరిపోయినట్లేనని వక్తలు పేర్కొన్నారు. ఇప్పటికైనా తమకు ఉపశమనం కలుగుతోందని ప్రజలు కూడా చాలా సంతోషించారు. అయితే నేటికి 20నెలలు గడుస్తున్నా వారి సంతోషం, ప్రభుత్వ హామీ నీటి బుడగలే అయ్యాయి. ప్రభుత్వం చేసిన హడావుడిలో వీసమెత్తు కూడా ఆచరణకు నోచుకోకపోవడంతో ప్రజల ఆశలు అడియాసలయ్యాయి.


1993లో వెలుగులోనికి వచ్సిన ఈ వింత వ్యాధిపై ఇప్పటికే కొన్ని సంస్థలు పరిశోధనలు జరిపాయి. విశాఖపట్నంలోని కేజిహెచ్‌, ఐసిఎంఆర్‌, బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌, ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ, నిమ్స్, సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్ మాలిక్యులర్‌ బయాలజీ (సిసిఎంబి), కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక రంగ శాఖ, ఆంధ్ర మెడికల్‌ కాలేజి వంటి వివిధ సంస్థలు ఉద్దానం వ్యాధి గురించి కొంతమేరకు అధ్యయనం చేశాయి. 2010, 2011 సంవత్సరాలలో హార్వర్డ్‌ మెడికల్‌ యూనివర్సిటీ, విశాఖలోని కెజిహెచ్‌ సంయుక్తంగా మొదటిదశ అధ్యయనం పూర్తిచేశాయి. అయితే నిధులలేమితో ఆ అధ్యయనాన్ని అర్ధాంతరంగా నిలిపివేయవలసి వచ్చిందని ప్రముఖ కిడ్నీ వ్యాధి నిపుణులు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ మెడికల్‌ డైరక్టర్‌ టి.రవి రాజు తెలిపారు. 


ఉద్దానం కిడ్నీ వ్యాధి నీటి వల్ల అని కొంతమంది, వాతావరణ మార్పుల వల్ల అని మరికొంతమంది, ఆహారపు అలవాట్ల వల్ల అని ఇంకొంతమంది, ఇవన్నీ కారణమే నని ఎంతోమంది... ఎవరికి తోచిన విధంగా వారు కారణాలు తెలుపుతున్నారు. ప్రభుత్వం కూడా దీనిపై పూర్తి అధ్యయనం చేయక పోవడంతో ప్రజలను గాలికి వదిలేసి నట్లయింది. సంవత్సరాలు గడుస్తున్నా ప్రజలకు ఏ మాత్రం ఉపశమనం లేదు సరికదా వ్యాధి తీవ్రత మరింత పెరిగింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా నేడు అనేక గ్రామాలలో కనీసం ఇంటికో మనిషి ఈ వ్యాధితో బాధ పడుతున్నారు. మందులకు నెలకు కనీసం ఐదు నుంచి పదివేల వేల రూపాయల వరకు ఖర్చవుతోంది. వ్యాధివల్ల పనికి వెళ్ళలేక, మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేక అనేక మంది అప్పుల పాలవడం, ఆస్తులు అమ్ముకోవడం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది. 


రాష్ట్ర ప్రభుత్వం 2019–20, 20-21 ఆర్థిక సంవత్సరాల బడ్జెట్లలో 50కోట్ల రూపాయలు చొప్పున కేటాయించినట్లు లెక్కలు ఉన్నా అక్కడ నిర్మాణ పనులేమీ జరగడం లేదు సరికదా కేవలం తుప్పు పట్టిన ఇనుప రాడ్లు మాత్రమే దర్శనమిస్తున్నాయి. మెడికల్‌ సూపరింటెండెంట్‌, ఇద్దరు కిడ్నీ వ్యాధి నిపుణులు, మూత్ర వ్యాధి నిపుణులతో సహా 33 మంది వివిధ రకాల స్పెషలిస్టులు, 60 మంది నర్సులు, 8 మంది రీసెర్చ్‌ సిబ్బంది, 18 మంది టెక్నీషియన్లు, మరో 45 మంది ఇతర సిబ్బంది నియామకం జరగాలని జి.ఓ నిర్దేశించింది. భవనమే లేకపోతే, ఇక ఈ సిబ్బంది సంగతి వేరే చెప్పనవసరం లేదు. వెరసి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అక్కడి స్థితి ఉంది. 


ప్రతి ఐదు వందల మంది రోగులకు ఒక హెల్త్‌ వర్కర్‌, కిడ్నీ పేషంట్లకూ వారి సహాయలకూ ఉచిత బస్‌ పాస్‌ వంటి అనేక ప్రకటనలు అమలుకు నోచుకోలేదు. శంకుస్థాపన సందర్భంగానే బాధితులందరికీ వ్యాధి తీవ్రతను బట్టి నెలకు 10 వేలు, 5 వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. అయితే విచిత్రంగా వేలల్లో వ్యాధిగ్రస్తులు ఉంటే కేవలం పదుల్లో మాత్రమే సాయం అందుతోంది. పలాస మండలంలోని నీలావతి గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు ఒకరికి వృధ్యాప్య పింఛన్‌ ఉందని ముఖ్యమంత్రి ప్రకటించిన సహాయం అందివ్వడం లేదు. ఆయనకు మందులకై నెలకు ఐదు వేల రూపాయలకు పైగా ఖర్చవుతోంది. ఇలాంటివారు ఈ ఉద్దానం ప్రాంతం లో అనేకమంది ఉన్నారు. ప్రభుత్వం చేసిన ఆర్భాటానికి, ఆచరణకు ఎక్కడా పొంతనే లేకపోవడం శోచనీయం. 


రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదలచేసి, ఉద్దానంలో ఆసుపత్రి నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి. స్పెషలిస్టు డాక్టర్లతో పలాసలో తాత్కాలిక ఆసుపత్రిని నడపాలి. ఐసిఎంఆర్‌, హార్వర్డ్‌ యూనివర్సిటీలతో సంప్రదించి వ్యాధి కారణాలను అధ్యయనం చేయడానికి రీసెర్చ్‌ బృందాన్ని ఏర్పాటు చేయాలి. శ్రీకాకుళం రిమ్స్‌లో నెఫ్రాలజిస్టులను నియమించాలి. వ్యాధిగ్రస్థులందరికి ముఖ్య మంత్రి ప్రకటించిన విధంగా ఆర్థిక సహాయం అందించాలి.

ఎ. అజ శర్మ

ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక

Updated Date - 2021-04-08T05:50:30+05:30 IST