ఈటలపై పోటీ చేసేది ఈయనేనా..!?

ABN , First Publish Date - 2021-06-12T05:39:59+05:30 IST

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో...

ఈటలపై పోటీ చేసేది ఈయనేనా..!?

  • హుజూరాబాద్‌’ రేసులో ప్రవీణ్‌రెడ్డి?
  • పరిశీలిస్తున్న టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం 


భీమదేవరపల్లి, జూన్‌ 11 : హుజూరాబాద్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ముల్కనూర్‌ సహకార బ్యాంకు అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరును అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో 2.05లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో సగం బీసీలు కాగా, 40 వేలకు పైగా రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. హుజూరాబాద్‌ నియోజవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి పట్టు ఉండడంతో సౌమ్యుడు, వివాదరహితుడైన ప్రవీణ్‌రెడ్డి పేరు తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది. గత పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా ప్రవీణ్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు.  గతంలో హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి ప్రవీణ్‌రెడ్డి తండ్రి అల్గిరెడ్డి కాశీవిశ్వనాథ్‌రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు.


వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవీణ్‌రెడ్డి హుస్నాబాద్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. హుజూరాబాద్‌ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే ప్రవీణ్‌రెడ్డికి సీట్‌ దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఈటల రాజేందర్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఆరు నెలల్లో ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌తో పాటు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేర్లు విస్తృతంగా వినిపిస్తున్నాయి.  





Updated Date - 2021-06-12T05:39:59+05:30 IST