హుజూరాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ ఈ నెలలోనే?

ABN , First Publish Date - 2021-08-01T07:58:06+05:30 IST

రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారిన హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు షెడ్యూల్‌ ఆగస్టులోనే వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ ఈ నెలలోనే?

  • ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా!
  • రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు సంకేతాలు
  • ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై సర్కారుకు ఈసీ లేఖ
  • సిద్ధంగా లేమని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం!
  • ఎన్నికలు ఇప్పుడు వద్దనే ఉద్దేశంలో టీఆర్‌ఎస్‌
  • దేశవ్యాప్తంగా ఎమ్మెల్సీ, ఉప ఎన్నికలు
  • నిర్వహించే యోచనలో ఎన్నికల కమిషన్‌


హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారిన హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు షెడ్యూల్‌ ఆగస్టులోనే వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కూడా షెడ్యూల్‌ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు ఢిల్లీ నుంచి సంకేతాలందాయి. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్‌, కడియం శ్రీహరి, ఆకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఫరీదుద్దీన్‌ల పదవీకాలం ఈ ఏడాది జూన్‌ 3తో ముగిసింది. నిబంధనల ప్రకారం అంతకంటే ముందుగానే ఈ ఖాళీలను భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ, కరోనా పరిస్థితుల కారణంగా దేశ వ్యాప్తంగా వివిధ స్థానాలకు జరగాల్సిన ఎన్నికలను ఈసీ వాయిదా వేసింది. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అభిప్రాయం తెలపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. అయితే రాష్ట్రాల అభిప్రాయాలు ఎలా ఉన్నా.. ఖాళీగా ఉన్న లోక్‌సభ, అసెంబ్లీ, ఎమ్మెల్సీ స్థానాలన్నింటికీ ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది.


హుజూరాబాద్‌ కూడా ఆ జాబితాలో ఉన్నట్లు సమాచారం. దీంతోపాటే ఎమ్మెల్సీ ఎన్నికలకూ ఆగస్టు నెలాఖరు వరకు షెడ్యూల్‌ విడుదల కావచ్చని, సెప్టెంబరులో ఎన్నికలు ఉంటాయని రాజకీయ పార్టీల ముఖ్యులు అంచనా వేస్తున్నారు. కాగా, అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ సంఖ్యా బలం దృష్ట్యా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలన్నీ ఆ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుచుకోవటం లాంఛనమే. కాగా, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎం.శ్రీనివా్‌సరెడ్డి కూడా జూన్‌ 16న పదవీ విరమణ చేశారు. ఈ స్థానం భర్తీపై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొని, గవర్నర్‌కు సిఫారసు చేస్తే సరిపోతుంది. ఈ లెక్కన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పార్టీ అభ్యర్థులను షెడ్యూల్‌ వెలువడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఖరారు చేసే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలోనూ షెడ్యూల్‌ విడుదలయ్యాకే స్పష్టత రావచ్చంటున్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పుడే ఏ ఎన్నికలూ వద్దనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా లేమని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఈసీకి తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది.  


రాష్ట్రంలో రాజకీయ వేడి..

ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌తో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. టీఆర్‌ఎ్‌సకు, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అనంతర పరిణామాలు, సీఎం కేసీఆర్‌ ప్రకటించిన దళిత బంధు సహా ఇతర ప్రభుత్వ పథకాల ప్రకటనల ఎత్తుగడలు, ప్రతిగా విపక్షాల విమర్శలతో పార్టీల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కొంత ఆలస్యంగా జరిగితే, అక్కడ రాజకీయంగా తమకు ప్రయోజనం కలుగుతుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో వీలైనంత త్వరగా ఎన్నిక జరగాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని ఈసీ కోరింది. ఇందుకు సానుకూలంగా స్పందిస్తే, హుజూరాబాద్‌ ఉప ఎన్నికకూ పరోక్షంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు అవుతుందనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ఇప్పుడు సాధ్యపడదని ప్రభుత్వం ఈసీకి బదులిచ్చినట్లు తెలుస్తోంది.


తమ అభిప్రాయానికి కరోనా థర్డ్‌ వేవ్‌ను కారణంగా చూపినట్లు సమాచారం. అయితే ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారులో ఉన్న ఇబ్బంది కూడా ఇందుకు మరో కారణమని సమాచారం. టీఆర్‌ఎస్‌ నుంచి ఆశావహులు 20 మందికి పైగానే ఉన్న నేపథ్యంలో వారిలో ఏడుగురిని ఎంపిక చేస్తే మిగిలిన ఆశావహులు, వారి సామాజికవర్గాలకు నిరాశ తప్పదు. దీని ప్రభావం హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై పడే ప్రమాదం ఉందని పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు. అయితే ఈసీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై కొన్ని రోజులు వేచిచూడాల్సి ఉందని ఉన్నతాధికార వర్గాలు అంటున్నాయి.

Updated Date - 2021-08-01T07:58:06+05:30 IST