Abn logo
Sep 28 2021 @ 10:17AM

Huzurabad ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

కరీంనగర్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠకు తెరలేపుతున్న హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. వచ్చే నెల 30 హుజురాబాద్ ఉప ఎన్నిక జరుగనుంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు అక్టోబర్ 8 వరకు గడువు ఉంటుంది. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అవుతుంది. అక్టోబర్ 30(శనివారం)న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరుగగా.. అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి.


జూన్ 4న ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దాన్ని అసెంబ్లీ స్పీకర్ 12న ఆమోదించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక ఎప్పుడెప్పుడా అంటూ తీవ్రమైన ఉత్కంఠ కొనసాగుతోంది. దాదాపు మూడు నెలలుగా హుజురాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. కానీ ఉప ఎన్నికల షెడ్యూల్ ఆలస్యమవుతుండటంతో ఎన్నిక ఎప్పుడా అనే ఆసక్తి నెలకొంది. దేశ వ్యాప్తంగా పండుగలు ఉన్న నేపథ్యంలో కరోనా తీవ్రత పెరిగే అవకాశం ఉందంటూ వచ్చిన నివేదికలతో ఎన్నికలను కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. ఎట్టకేలకు వచ్చే నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఇన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది.


ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ప్రధాని మోదీ,  పలువురు కేంద్ర మంత్రులు, పలువురు ఢిల్లీ పెద్దలను కలిసిన నేపథ్యంలో ఈ ఎన్నికల ఆలస్యమైతేనే టీఆర్ఎస్‌కు కలిసి వస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో  జరుగుతోంది. మరోవైపు ఎంత తొందరగా ఎన్నిక నిర్వహిస్తే బీజేపీ అంత లాభమనే చర్చ బీజేపీ వర్గాల్లో కొనసాగుతోంది. కాగా ఇప్పటి వరకు ఎన్నిక ఆలస్యమైన తరుణంలో టీఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. కాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఇప్పటి నుంచి హుజురాబాద్‌లో రాజకీయం మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇవి కూడా చదవండిImage Caption