టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై స్పష్టత.. టికెట్ ఆయనకే..!

ABN , First Publish Date - 2021-08-02T06:09:30+05:30 IST

టీఆర్‌ఎస్‌..

టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై స్పష్టత.. టికెట్ ఆయనకే..!

ఫలించిన కౌశిక్‌రెడ్డి కల

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి

రాష్ట్ర కేబినెట్‌ సిఫారసు


(ఆంధ్రజ్యోతి ప్రతిని, కరీంనగర్‌): కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాలని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం రాష్ట్ర కేబినెట్‌లో తన మంత్రివర్గ సహచరులతో చర్చించిన ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ మేరకు పాడి కౌశిక్‌రెడ్డి పేరును కేబినెట్‌ గవర్నర్‌కు సిఫారసు చేసింది. ఈటల రాజేందర్‌ బర్తరఫ్‌ ఎపిసోడ్‌ ప్రారంభమైన నాటినుంచే కౌశిక్‌ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరతారని ఆయనకే టీఆర్‌ఎస్‌ టికెట్‌  ఇస్తారని ప్రచారం జరిగింది. కేటీఆర్‌ పాల్గొన్న ఒక ప్రైవేట్‌ ఫంక్షన్‌లో కౌశిక్‌రెడ్డి ఆయనతో భేటీ కావడం, కేటీఆర్‌ తిరిగి వెళ్తున్న సమయంలో కారు వద్దకు వెళ్లి కొద్దిసేపు మాట్లాడి సాగనంపడం ఈ ప్రచారాన్ని మరింత బలపర్చాయి.


ఆ ప్రచారాన్ని ఖండిస్తూ తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని, ఆ పార్టీ అభ్యర్థిగానే మరోమారు హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌పై పోటీ చేస్తానని కౌశిక్‌ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించడం, తాను టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తానని తమ మద్దతుదారులందరిని కూడగట్టాలని కౌశిక్‌రెడ్డి ఒకరిద్దరితో మాట్లాడిన ఆడియో బయటకు వచ్చాయి. దీంతో ఆయనకు కాంగ్రెస్‌ క్రమశిక్షణ సంఘం సంజాయిషీ కోరుతుందని ప్రచారం జరగగా కౌశిక్‌ రెడ్డి తానే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 


ఎమ్మెల్యే కావాలనుకుని.. ఎమ్మెల్సీగా..

కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా హుజూరాబాద్‌ నుంచి పోటీ చేయాలనే కోరికతోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరినా అదేరోజు కేసీఆర్‌ తన ప్రసంగంలో కౌశిక్‌రెడ్డి సేవలను రాష్ట్రవ్యాప్తంగా వినియోగించుకుంటామని చెప్పారు. ఆరోజే ఆయనకు అసెంబ్లీ టికెట్‌ ఇవ్వడం లేదని, స్వయంగా క్రీడాకారుడైనందువల్ల శాప్‌ చైర్మన్‌ పదవిని అప్పగిస్తారని అందరు భావించారు. పార్టీని నమ్ముకొని వచ్చినందున ఆయనకు సముచిత రీతిలో అవకాశం కల్పించాలని భావించిన కేసీఆర్‌ గవర్నర్‌ నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవిని అప్పగించాలని భావించినట్లు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరి శాసనసభ్యుడు కావాలనుకున్న కౌశిక్‌ రెడ్డి శాసనమండలిలో అడుగుపెట్టబోతున్నారు. ఒకరకంగా ఆయనకు ఇది కలిసొచ్చిన అదృష్టంగానే చెబుతున్నారు. 


టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై స్పష్టత

కౌశిక్‌ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయబోతున్నారని తేలడంతో ఇంతకాలం రెడ్డి, బీసీ వర్గాల్లో ఎవరికి అసెంబ్లీ టికెట్‌ ఇవ్వాలనే విషయంలో టీఆర్‌ఎస్‌లో నెలకొన్న సందిగ్ధం వీడిపోయింది. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి మాజీ మంత్రి, శాసనసభ్యుడు ఇనుగాల పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరినా ఆయనకు టికెట్‌ ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ఈటల రాజేందర్‌ బీసీ నినాదంతో ఎన్నికల్లో పోటీ చేయనున్నందున తాము కూడా బీసీ అభ్యర్థినే పోటీలోకి దింపాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు చెబుతున్నారు. బీసీ వర్గం నుంచి బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌,  మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పొనగంటి మల్లయ్య ఇక్కడ నుంచి టికెట్‌ ఆశిస్తూ పోటీలో ఉన్నారు. కృష్ణమోహన్‌రావు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఈటలపై రెండుసార్లు పోటీచేసి 15 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో తక్కువ తేడాతో ఓడిపోయిన అభ్యర్థి కృష్ణమోహన్‌రావు మాత్రమే. ఆయనకు నియోజకవర్గంలో విస్తృత సంబంధాలు ఉన్నాయి. బీసీ విద్యార్థి సంఘం నాయకునిగా రాజకీయాల్లో వచ్చిన ఆయన రెండు దశాబ్ధాలుగా బీసీల ఉద్యమాల్లో కృష్ణయ్యతోపాటు క్రియాశీలపాత్ర వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇక్కడ నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు.


మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పొనగంటి మల్లయ్య కూడా టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తుండగా ఆయనకు కూడా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సంబంధాలున్నాయి. వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా రైతాంగంతో విస్తృత సంబంధాలు కలిగి ఉన్న ఆయన తనకు టికెట్‌ ఇస్తే సునాయసంగా గెలుస్తాననే భావనతో ఉన్నారు. టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ఇక్కడ టికెట్‌ రేసులో ఉన్నారు. ఆయనకు కేటీఆర్‌ ఆశీస్సులు ఉన్నట్లు పార్టీలో ప్రచారంలో ఉంది. విద్యార్థి సంఘం నాయకుడిగా ఉద్యమంలో పాలుపంచుకున్న ఆయన నియోజకవర్గంలో పెద్దగా సంబంధాలు లేకపోయినా పార్టీ అభ్యర్థిగా అధినాయకుల ఆశీస్సులతో తెరపైకి వచ్చారు. యాదవ సామాజికవర్గానికి హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌ సామాజికవర్గమైన ముదిరాజ్‌లతో సమానమైన ఓట్లు ఉన్నాయి. 


మరిన్ని కార్పొరేషన్‌ పదవులు

రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కౌశిక్‌ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి, దళిత సామాజికవర్గానికి చెందిన బండ శ్రీనివాస్‌కు ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని ఇచ్చారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పొనగంటి మల్లయ్యకు కూడా ఏదో ఒక కార్పొరేషన్‌ పదవిని, వకుళాభరణం కృష్ణమోహన్‌కు బీసీ కమిషన్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ టికెట్‌ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌నే వరించబోతున్నది విశ్వసనీయ సమాచారం. గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన సమావేశంలో గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను అధికారిక సభ్యుడు కాకున్నా కూర్చోబెట్టుకోవడంతోనే ఆయనకు టికెట్‌ ఇవ్వబోతున్నారని ప్రచారం ప్రారంభమయింది. త్వరలోనే గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ అభ్యర్థిత్వాన్ని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రకటించి ప్రచారబరిలోకి దింపుతారని చెబుతున్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ నుంచి బీసీ అభ్యర్థులు తలపడబోతున్నందున కాంగ్రెస్‌ ఎవరిని రంగంలోకి దింపుతుందో వేచి చూడాల్సి ఉన్నది. 

Updated Date - 2021-08-02T06:09:30+05:30 IST