హైబ్రిడ్‌ మిర్చి విత్తనాలు కిలో రూ.2.5 లక్షలు

ABN , First Publish Date - 2021-05-19T09:43:53+05:30 IST

తెలంగాణకు చెందిన ఒక కంపెనీ హైబ్రిడ్‌ మిర్చి విత్తనాలను కిలో రూ.2.5 లక్షలకు అమ్మినట్లు వ్యవసాయశాఖ అధికారుల దృష్టికి వచ్చింది.

హైబ్రిడ్‌ మిర్చి విత్తనాలు కిలో రూ.2.5 లక్షలు

  • తెలంగాణకు చెందిన కంపెనీ రకానికి భారీ డిమాండ్‌
  • పెదకూరపాడు, మంగళగిరి, తాడికొండల్లో అమ్మకాలు


(గుంటూరు - ఆంధ్రజ్యోతి): తెలంగాణకు చెందిన ఒక కంపెనీ హైబ్రిడ్‌ మిర్చి విత్తనాలను కిలో రూ.2.5 లక్షలకు అమ్మినట్లు వ్యవసాయశాఖ అధికారుల దృష్టికి వచ్చింది. గుంటూరు జిల్లా పెదకూరపాడు, సత్తెనపల్లి, మంగళగిరి, తాడికొండ తదితర ప్రాంతాలలో కొత్తరకం పేరుతో వీటిని అమ్మినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణాకు చెందిన సంస్థ ఈ ఏడాది ఏపీలో ప్రభుత్వ అనుమతి లేకుండా అమ్మకాలు ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కిలో రూ.2.5 లక్షలకు అమ్ముతున్న విత్తనాలను 8 గ్రాముల పాకెట్‌ ధర రూ.840 ఎంఆర్‌పీగా నిర్ణయించారు. మార్కెట్‌లో ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నా, ప్రభుత్వ అనుమతిలేని విత్తనాలను అదుపుచేయటంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


అధిక ధరకు అమ్మకాలు

రాష్ట్రంలో హైబ్రిడ్‌ మిర్చి విత్తనాల విక్రయాలపై వ్యవసాయ, ఉద్యానవన శాఖలు దృష్టిపెట్టాయి. ఎనిమిది గ్రాములు రూ.2 వేల చొప్పున విత్తనాలు కొనుగోలు చేసిన రైతుల నుంచి గుంటూరు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు వివరాలు సేకరించి కమిషనర్‌ కార్యాలయానికి పంపినట్లు తెలిపారు. తెలంగాణకు చెందిన ఆ కంపెనీ ఏపీలో లైసెన్స్‌ తీసుకోలేదని విశ్వసనీయ సమాచారం. విత్తనాలు అమ్మిన వ్యక్తులను అధికారులు గుర్తించినా ఇంతవరకు చర్యలు తీసుకోకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. 


క్షేత్రస్థాయిలో తనిఖీలేవీ?

గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలున్నాయి. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, రైతు భరోసా కేంద్రాల ఛైర్మన్‌లున్నారు. వీరితోపాటు వ్యవసాయ, ఉద్యానవన, రెవెన్యూ, పోలీసు, ఇతర నిఘా వ్యవస్థలున్నాయి. ప్రతి నియోజకవర్గంలో వ్యవసాయ సలహా కమిటి ఛైర్మన్‌లున్నారు. ఇన్ని ఉన్నా మార్కెట్‌లో అనుమతిలేని, నకిలీ, కల్తీ ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, బయోలు విచ్చలవిడిగా వస్తున్నాయి. రోడ్ల వెంబడి వేసవిలో ఖాళీ పొలాల్లో మిరప కాయలను కటింగ్‌ చేసి విత్తనాలను అమ్ముతున్నారు. ఈ కటింగ్‌ వ్యవహారాలు యఽథేచ్ఛగా సాగుతున్నా పోలీసు, రెవెన్యూ, ఇతర అధికారులు జోక్యం చేసుకోవటం లేదు. 


అధికారుల వైఫల్యమే

ఆర్మూర్‌ అనే రకాన్ని బహిరంగంగానే కిలో రూ.లక్షన్నరకు విక్రయిస్తున్నారు. తెలంగాణకు చెందిన ద్వారకా కంపెనీ ప్రభుత్వ అనుమతి లేకుండా స్టార్‌ బిందు అనే 8 గ్రాముల మిరప విత్తనాలను రూ.2 వేలకు అమ్ముతోంది. అధికారుల వైఫల్యం, నిర్లక్ష్యం, వ్యాపారులతో చేతులు కలపటం వలనే ఎక్కువ ధరకు అనుమతి లేని విత్తనాలను అమ్ముతున్నారు.

 నల్లమోతు శివరామకృష్ణ, ఛైర్మన్‌,


 జిల్లా వ్యవసాయ సలహా కమిటి ఎక్కువరేట్లకు అమ్మేవారిపై కేసులు 

మిర్చికి జాతీయస్థాయిలో గుంటూరు కేంద్రంగా ఉంది. అదే స్థాయిలో కల్తీ, నకిలీలు కూడా ఎక్కువగా ఉన్నాయి. హైబ్రిడ్‌ మిర్చి విత్తనాలు కిలో రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల చొప్పున అమ్ముతున్నారు. తెలంగాణ నుంచి వచ్చిన ఒక రకం విత్తనాలు 8 గ్రాముల పాకెట్‌ను రూ.2వేలకు అమ్మినట్లు తేలింది. అమ్మినవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. 

- దినేష్కుమార్‌, జేసీ, రైతుభరోసా

Updated Date - 2021-05-19T09:43:53+05:30 IST