వాటర్‌.. డేంజర్‌

ABN , First Publish Date - 2020-09-27T09:39:34+05:30 IST

శుక్రవారం రాత్రి మొదలై.. శనివారం కొనసాగిన వాన అనేక ప్రాంతాలను వణికించింది. మధ్య మధ్య విరామంతో దఫధపాలుగా దాడి చేసినట్లు పడ్డ వాన..

వాటర్‌.. డేంజర్‌

వరుస వానలు.. నగరం నలుమూలలా..

ఈ నెలలో ఇప్పటి వరకు 13 సార్లు వర్షాలు

శుక్రవారం రాత్రి మళ్లీ మొదలైన ముసురు

మధ్యమధ్యలో విరామం.. మళ్లీ జడివాన

పొంగుతున్న ఓపెన్‌ నాలాలు.. చెరువులు

బస్తీల్లోకి, కాలనీల్లోకి చొరబడుతున్న వరద నీళ్లు

మురుగునీటి కాలువల లీకేజీలతో.. 

సమస్య మరింత తీవ్రతరం..

నిద్రపోని బస్తీలు, కాలనీలు..   

వెంటాడుతున్న ముంపుభయం

లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం.. 

ఉధృతంగా మూసీ ప్రవాహం

హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తే అవకాశం 


శుక్రవారం రాత్రి మొదలై.. శనివారం కొనసాగిన వాన అనేక ప్రాంతాలను వణికించింది. మధ్య మధ్య విరామంతో దఫధపాలుగా దాడి చేసినట్లు పడ్డ వాన.. శనివారం రాత్రి కొన్ని గంటల పాటు ఆగింది. అయితే, ఏ క్షణం అయినా మళ్లీ ముసురు ముంచుకు రావచ్చనే భయం నగరజీవిని వెంటాడుతోంది. పొంగుతున్న నాలాలు, చెరువులు.. ఎక్కడ ఏ బస్తీని, కాలనీని ముంచెత్తుతాయో అన్న భయం అనేక ప్రాంతాల్లో ఉంది. వరదనీరు ఎటు వీలయితే అటు కాలనీల్లోకి, బస్తీల్లోకి చొరబడి స్థానికుల దైనందిన జీవితాన్ని ఇక్కట్లమయం చేసింది. వరదనీరు.. బస్తీల కంట కన్నీరు పెట్టిస్తోంది. 


మదీన, సెప్టెంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): పాతబస్తీలో శుక్రవారం అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది.  బహదూర్‌పురా, ఛత్రినాక చౌరస్తా, ఉప్పుగూడ అండర్‌ రైల్వే బ్రిడ్జి కింద మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచింది. బహదూర్‌పురా చౌరస్తాలోని ఇళ్లలోకి నీరు చేరింది. చౌరస్తాలోని ఓ ఆస్పత్రిలో కూడా నీరు చేరడంతో రోగులు, సిబ్బంది ఇబ్బంది పడ్డారు. 


బాలానగర్‌/ఓల్డుబోయినపల్లి/ఫతేనగర్‌,  సెప్టెంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): బాలానగర్‌ నర్సాపూర్‌ చౌరస్తా వద్ద మురుగు నీటికి తోడు వర్షం నీరు కూడా వచ్చి చేరడంతో రోడ్డు  చెరువును తలపించింది. ఫ్లైఓవర్‌ బ్రిడ్జి పనులు, రోడ్డు పనులు సాగుతుండటంతో ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. 


మాదాపూర్‌: ఐటీ కారిడార్‌లోని మాదాపూర్‌, కొండాపూర్‌, అయ్యప్ప సొసైటీ, దుర్గం చెరువు, కావూరి హిల్స్‌ ప్రాంతాల్లో వరదనీరు భారీగా చేరింది. నెక్టర్‌ గార్డెన్‌లో రోడ్లు, ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గతేడాది వర్షాలు కురిసిన సమయంలో నెక్టర్‌గార్డెన్‌లో భారీగా నీరు చేరింది. నీరు ప్రమాదకరస్థాయిలో చేరిందని, స్థానికులు ఖాళీ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కావూరి హిల్స్‌, అమర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలో సెల్లార్‌లలో వర్షపు నీరు చేరింది.


మన్సూరాబాద్‌: ఎల్‌బీనగర్‌ సమీపంలోని సాగర్‌ రింగ్‌ రోడ్డు చౌరస్తా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రధా న రోడ్డుపై దుకాణాలన్నీ వరదలో చిక్కుకుపోయాయి. కొన్ని చోట్ల నడుములోతు నీరు చేరగా, మరికొన్ని చోట్ల మోకాలు లోతు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బైరామల్‌గూడ చెరువు వెనుక భాగం, కింది భాగంలోని ఇళ్లన్నీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. రెడ్డికాలనీ, సాగర్‌ ఎన్‌క్లేవ్‌ కాలనీలు నీటిలో చిక్కుకుపోయాయి. 


దిల్‌సుఖ్‌నగర్‌: గడ్డి అన్నారం డివిజన్‌ పరిధి చెరువుకట్ట లోతట్టు ప్రాంతాల్లో వరదనీటి పైప్‌లైన్‌ డొల్లతనం తేటతెల్లమైంది. కొన్నేళ్లుగా వరదనీరు రాకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకోగా, తాజా వర్షంతో లోతట్టు కాలనీలను వరదనీరు ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సరూర్‌నగర్‌ చెరువుకట్ట లోతట్టు ప్రాంతాలైన శారదానగర్‌, కోదండరామ్‌నగర్‌, సీసల బస్తీ, వివేకానందనగర్‌ కాలనీలు జలమయమయ్యాయి. శారదానగర్‌, కోదండరామ్‌నగర్‌, సీసలబస్తీలలో ఏకంగా ఇళ్లలోకి మోకాళ్లలోతు వరదనీరు చేరడంతో వస్తువులు, సామగ్రి తడిచిపోయాయి. సరూర్‌నగర్‌ చెరువుకట్ట కింద పలు కాలనీల్లో రోడ్లపై వరదనీరు ఏరులై పారింది.  వరదనీటి ఉధృతి  ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల కార్ల ఇంజన్లలోకి నీరు చేరింది. 


సరూర్‌నగర్‌:  బాలాపూర్‌ పెద్దచెరువు, బతుకమ్మకుంట, అల్మా్‌సగూ డ కోమటిచెరువు, పోచమ్మకుంట తదితర చెరువులు అలుగుపారాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత చెరువులు అలుగుపారడంతో ఆసక్తిగా తిలకించారు. 


అబ్దుల్లాపూర్‌మెట్‌: పెద్దఅంబర్‌పేట్‌  మునిసిపాలిటీ పరిధి కాల్వంచలోని ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.   


రామంతాపూర్‌: రామాంతాపూర్‌లోని డిమార్ట్‌ నుంచి వాసవీ శివనగర్‌ వెళ్లే రహదారిలో శివసాయినగర్‌ సాయిబాబా దేవాలయం వద్ద వర్షం పడితే పరిసరాల్లోని ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరుతోంది.  


పుష్కరిణిల్లోకి చేరిన వరదనీరు..

సరూర్‌నగర్‌, సెప్టెంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): భారీవర్షానికి బడంగ్‌పేట్‌లోని కాశీబుగ్గ క్షేత్రం పుష్కరిణిలోకి వరద నీరు చేరి, మండపం మునిగిపోయింది. ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి. జిల్లెలగూడలోని బాలాజీ దేవాలయ పుష్కరిణి(స్నాన గుండం) పూర్తిగా నిండింది. అందులోని దేవతామూర్తుల విగ్రహాలు మునిగిపోయాయి. 

వనస్థలిపురం: బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌ హరిహరపురం కాలనీలోని కాప్రాయి చెరువు నిండుకుండలా మారింది.  నీరు ఎఫ్‌టీఎల్‌ దాటి త్రిశక్తి ఆలయంలోకి చేరింది.  

చర్చి పరిసరాల్లోకి నీరు.. 

బేగంపేట: బేగంపేట చికోటీగార్డెన్‌లోని హోలీ ట్రినిటీ చర్చి ప్రాంతంతో పాటు పలు కాలనీల్లో వరద నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 

 

మంత్రి సందర్శన 

మీర్‌పేట్‌ పరిధిలోని లెనిన్‌నగర్‌ బస్తీ నీట మునగడంతో మంత్రి సబితారెడ్డి సందర్శించారు. ముంపు బాధితులు మంత్రికి వర దనీటి కష్టాలు చెప్పుకున్నారు. బాధితులను ఆదుకుంటామని, సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహార పదార్థాలు సరఫరా చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 

నిజాంపేట: నిజంపేట కాలనీల్లో కమిషనర్‌ గోపీతో కలిసి మేయర్‌ నీలా గోపాల్‌రెడ్డి పర్యటించారు.  


జంట జలాశయాలకు భారీగా నీరు

నార్సింగ్‌, సెప్టెంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): గండిపేట, హిమాయత్‌సాగర్‌ జలాశయాల పైభాగంలోని ఈసీ, మూసీ నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో  జంట జలాశయాల్లో నీటిమ ట్టం పెరుగుతోంది. గండిపేట జలాశ యం పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగు లు కాగా, శనివారం 1768.05 అడుగులకు చేరింది. 


అడుగు దూరంలో..

హిమాయత్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 1780 అడుగులు కాగా, శనివారం రాత్రి 1.30కి 1759 అడుగులకు చేరింది. 1760 అడుగులకు నీటి మట్టం పెరిగితే గేట్లు ఎత్తి నీటిని కిందికి వదలాలని అధికారులు నిర్ణయించారు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో  ఆదివారం ఉదయం వరకు పూర్తిస్థాయిలో నిండుతుందని అంచనా వేస్తున్నారు.  జలాశయంలోకి పూర్తిస్థాయి 1780 అడుగుల మేర నీరు చేరితే, పై భాగంలో కొన్ని ఊర్లు మునిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో పై నుంచి వచ్చే నీటి ప్రవాహం లెక్క ఆధారంగా గేట్లు తెరవాల్సి ఉంటుంది. దీంతో జలమండలి ఉన్నతాధికారులు హియాయత్‌సాగర్‌లోనే బస చేస్తున్నారు.


అధికారులు అప్రమత్తం 

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): వర్షాల నేపథ్యంలో మూసీ పరీవాహక ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు వివిధ శాఖల అధికారులంతా రంగంలోకి దిగారు. మూసీ పరీవాహక ప్రాంతాలైన చాదర్‌ఘాట్‌, పురానాపూల్‌, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో మూసీనదిని ఆనుకుని ఉన్న ఇళ్లను ఖాళీ చేయించి. కమ్యూనిటీ హాల్స్‌, ఫంక్షన్‌ హాళ్లకు తరలిస్తున్నారు. ఆసిఫ్‌నగర్‌, గోల్కొండ మండల పరిధిలోని జియాగూడ, ఆసిఫ్‌నగర్‌, లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్‌, పాతబస్తీలోని పలు ప్రాంతాలలో మూసీని ఆనుకుని నివసిస్తున్న ప్రజలతో ఆర్డీఓ ఎస్‌ఎస్‌ఈ జి.అనిల్‌కుమార్‌ మాట్లాడారు. డివిజినల్‌ అడ్మినిస్ర్టేషన్‌ అధికారి జహుర్‌, గోల్కొండ, ఆసిఫ్‌నగర్‌ తహసీల్దార్లు అయ్యప్ప, నవీన్‌లు పర్యవేక్షిస్తున్నారు. 


 శనివారం రాత్రి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం లేకపోవడంతో హిమాయత్‌సాగర్‌లోకి ఇన్‌ఫ్లో కొంత తగ్గింది. ఇన్‌ఫ్లో పెరిగితే గేట్లు ఎత్తాల్సి ఉండటంతో వాటర్‌బోర్డు అధికారులు ముగ్గురు కలెక్టర్లతో పాటు జీహెచ్‌ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకున్నారు. ముంపునకు గురవ్వకుండా తీసుకోవాల్సిన చర్యలపై వాటర్‌బోర్డు ఎండీ దానకిషోర్‌ ఈవీడీఎం డైరెక్టర్‌ విశ్వజిత్‌కంపాటితో చర్చించారు. డీఆర్‌ఎఫ్‌ బృందాలు అప్రమత్తమయ్యాయి. 

Updated Date - 2020-09-27T09:39:34+05:30 IST