హైదరాబాద్‌ నుంచి తొలి యూనికార్న్‌

ABN , First Publish Date - 2022-01-26T06:51:30+05:30 IST

యూనికార్న్‌లకు వేదికైన నగరాల జాబితాలో హైదరాబాద్‌ కూడా చేరింది. డార్విన్‌బాక్స్‌ అనే హెచ్‌ఆర్‌ టెక్నాలజీ స్టార్టప్‌.. ..

హైదరాబాద్‌ నుంచి తొలి యూనికార్న్‌

బిలియన్‌ డాలర్‌ కంపెనీగా డార్విన్‌బాక్స్‌ 

హైదరాబాద్‌: యూనికార్న్‌లకు వేదికైన నగరాల జాబితాలో హైదరాబాద్‌ కూడా చేరింది. డార్విన్‌బాక్స్‌ అనే హెచ్‌ఆర్‌ టెక్నాలజీ స్టార్టప్‌.. తొలి హైదరాబాదీ యూనికార్న్‌గా అవతరించింది. కనీసం బిలియన్‌ డాలర్ల విలువ కలిగిన స్టార్ట్‌పలను యూనికార్న్‌లుగా పిలుస్తారు. తాజా విడత ఫండింగ్‌లో భాగంగా పలువురు ఇన్వెస్టర్ల నుంచి 7.2 కోట్ల డాలర్లు (సుమారు రూ.540 కోట్లు) సమీకరించడం జరిగిందని, తద్వారా కంపెనీ మార్కెట్‌ విలువ బిలియన్‌ డాలర్ల (100 కోట్ల డాలర్లు=రూ.7,500 కోట్లు)కు చేరుకుందని డార్విన్‌బాక్స్‌ వెల్లడించింది. టెక్నాలజీ క్రాస్‌ఓవర్‌ వెంచర్స్‌ (టీసీవీ)తో పాటు ప్రస్తుత ఇన్వెస్టర్లైన సేల్స్‌ఫోర్స్‌ వెంచర్స్‌, సికోయా, లైట్‌స్పీడ్‌, ఎండియా పార్ట్‌నర్స్‌, 3వన్‌4క్యాపిటల్‌ ఈసారి కంపెనీలో పెట్టుబడులు పెట్టాయని తెలిపింది. కంపెనీ ఉత్పత్తుల ఆవిష్కరణను వేగవంతం చేయడంతో పాటు అంతర్జాతీయ విస్తరణకు ఈ నిధులను ఉపయోగించుకోవాలనుకుంటోంది. ఈ ఏడాదిలోనే అమెరికాకు విస్తరించనున్నట్లు తెలిపింది. 


2015లో ఏర్పాటు: డార్విన్‌బాక్స్‌ 2015 నవంబరులో ఏర్పాటైంది. చైతన్య పెద్ది, జయంత్‌ పాలేటి, రోహిత్‌ చెన్నమనేని ఈ కంపెనీ సహ వ్యవస్థాపకులు. జేఎ్‌సడబ్ల్యూ, అదానీ, మహీంద్రా, వేదాంత, ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌, కోటక్‌, టీవీఎస్‌, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ), రామ్‌కీ, అరబిందో, యశోదా, బిగ్‌బాస్కెట్‌, స్విగ్గీ, మేక్‌మైట్రిప్‌ వంటి దేశీయ కంపెనీలు సహా అంతర్జాతీయంగా 650 కంపెనీలకు హెచ్‌ఆర్‌ టెక్నాలజీ సేవలందిస్తోంది. ‘‘ఆధునిక ఉద్యోగుల కోసం మరింత మెరుగైన, తెలివైన టెక్నాలజీని అభివృద్ధిని చేయాలన్న ఉద్దేశంతో ఈ కంపెనీని ప్రారంభించాం. సేవలన్ని మరింత విస్తరింపజేయడంతోపాటు అంతర్జాతీయంగా అగ్రస్థానానికి చేరుకోవాలనుకుంటున్నాం. ఇందుకోసం అత్యంత ప్రతిభావంతులను కంపెనీలో చేర్చుకోవాలనుకుంటున్నాం. కంపెనీ సేవలందిస్తోన్న అన్ని మార్కెట్లలో భారీగా నియామకాలు చేపట్టనున్నాం’’ అని డార్విన్‌బాక్స్‌ సహ వ్యవస్థాపకుడు జయంత్‌ పాలేటి అన్నారు. డార్విన్‌బాక్స్‌కు ప్రపంచవ్యాప్తంగా 12 కార్యాలయాలు ఉన్నాయి. వాటిల్లో 700కు పైగా మంది పనిచేస్తున్నారు. 

Updated Date - 2022-01-26T06:51:30+05:30 IST