హైదరాబాద్‌ బస్సులన్నీ ఖాళీ !

ABN , First Publish Date - 2021-01-16T06:29:22+05:30 IST

పండగ బస్సులకు కొవిడ్‌ దెబ్బ బలంగా తాకింది. ప్రయాణికులను వెంటాడు తున్న కరోనా భయం ప్రజా రవాణాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.

హైదరాబాద్‌ బస్సులన్నీ ఖాళీ !

ఏలూరు, జనవరి 15(ఆంధ్రజ్యోతి):పండగ బస్సులకు కొవిడ్‌ దెబ్బ బలంగా తాకింది. ప్రయాణికులను వెంటాడు తున్న కరోనా భయం ప్రజా రవాణాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. హైదరాబాద్‌ నుంచి జిల్లాకు రాకపోకలు సాగించే సంఖ్య కనీవినీ ఎరుగనంత తగ్గిపోవడంతో ప్రజా రవాణా శాఖ పండగ ఆదాయానికి భారీ గండి పడింది. గత ఏడాది సంక్రాంతికి హైదరాబాద్‌ నుంచి 272 బస్సులు నడపగా, ఈ ఏడాది కరోనాతో 132కి పరిమితం చేసింది. ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గడంతో వాటిని కుదించి 79 మాత్రమే నడిపింది. బస్సుల సంఖ్య తగ్గినా ఆక్యుపెన్సీ 70 శాతానికి మించలేదు. పండుగ తర్వాత హైదరాబాద్‌కు 122 బస్సులు నడపాలని షెడ్యూల్‌ ప్రకటించిన అధికారులు ప్రస్తుతం ఆ సంఖ్యను 38కి తగ్గించుకున్నారు. 16, 18 తేదీలలో తొమ్మిది చొప్పున, 17వ తేదీ 20 బస్సులు నడుపుతున్నారు. వీటిలో ఆదివారం బుక్కయిన 532 సీట్లు మినహా మిగిలిన రెండు రోజుల్లో 50 సీట్లు మాత్రమే బుక్‌ అయ్యాయి. విశాఖపట్నం వైపు నడిచే బస్సుల్లో  రద్దీ అనూహ్యంగా పెరిగింది. ప్రైవేటు వాహన సదుపాయం, రైల్వే సౌకర్యం ఈ రూటులో తగినంతగా లేకపోవడంతో అందరూ బస్సు ప్రయాణానికే మొగ్గు చూపారు. దీంతో ముందస్తు షెడ్యూల్‌ లేకపోయినా అప్పటికప్పుడు 41 పండగ స్పెషల్‌ బస్సులు జిల్లా నుంచి నడపాల్సి వచ్చింది. పండగ ముందు రోజుల్లో వేసిన ఈ బస్సుల్లో 80 శాతానికిపైగా ఓఆర్‌ నమోదవడం ప్రజా రవాణా శాఖకు కొంతలో కొంత ఊరట.

ప్రైవేటుకే మొగ్గు..

కరోనా, లాక్‌డౌన్‌ దగ్గర నుంచి చాలా వరకూ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అమలులో ఉండడంతో చాలా మంది సొంత ఊళ్లలోనే ఉంటున్నారు. ఒక వేళ ఆఫీసులకు వెళ్లినా నిన్న, మొన్నటి వరకూ ఇళ్ల వద్దే గడిపి వెళ్లడంతో సొంత ఊళ్లకు వచ్చే విషయంలో కొంత వెనుకడుగు వేశారు. వచ్చే వారెవరున్నా వారు ప్రజా రవాణా వైపు మొగ్గు చూపలేదు. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో సొంత, ప్రైవేటు కార్లకే మొగ్గు చూపారు. నలుగురైదుగురు కలిసి ఒకే కారును బుక్‌ చేసుకుని సొంత గూటికి చేరారు. దీంతో ప్రైవేటు వాహనాల రద్దీ జిల్లాలో బాగా పెరిగింది. 

Updated Date - 2021-01-16T06:29:22+05:30 IST