కొవిడ్‌పై పోలీస్‌ వార్‌

ABN , First Publish Date - 2021-06-16T17:26:45+05:30 IST

అనాథలు, ట్రాన్స్‌జెండర్ల కోసం పశ్చిమ మండలం పోలీసులు నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్‌ శిభిరానికి అనూహ్య స్పందన వచ్చింది. బంజారాహిల్స్‌ ముఫకంజా కళాశాలలో

కొవిడ్‌పై పోలీస్‌ వార్‌

మెగా వ్యాక్సినేషన్‌ సక్సెస్‌ 

5వేల మందికి వ్యాక్సిన్‌

హైదరాబాద్/బంజారాహిల్స్‌: అనాథలు, ట్రాన్స్‌జెండర్ల కోసం పశ్చిమ మండలం పోలీసులు నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్‌ శిభిరానికి అనూహ్య స్పందన వచ్చింది. బంజారాహిల్స్‌ ముఫకంజా కళాశాలలో మంగళవారం ఈ శిభిరం నిర్వహించారు. సుమారు ఐదువేల మంది టీకా వేయించుకున్నారు. నగరంలో వ్యాక్సినేషన్‌ విషయంలో ఇదే అతి పెద్ద శిబిరం కావడం విశేషం. 


అవగాహన లేని వారి కోసం.. 

ప్రభుత్వం సూపర్‌ స్ర్పైడర్ల కోసం వ్యాక్సినేషన్‌ నిర్వహిస్తోంది. నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే వ్యాక్సిన్‌ గురించి అవగాహన లేని అనేక వర్గాలు దూరంగానే ఉంటున్నాయి. ముఖ్యంగా పేదలు, అనాఽథలు, కూలీలు ఇలా అనేక మందికి వ్యాక్సిన్‌ అందడం లేదు. ఒక వేళ వేయించుకోవాలనుకున్నా రిజిస్ట్రేషన్‌ తదితర అంశాలపై అవగాహన లేకపోవడంతో వ్యాక్సిన్‌కు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వారిని గుర్తించి వ్యాక్సిన్‌ వేయిస్తే వైర్‌సకు అడ్డుకట్ట వేయవచ్చుననే ఆలోచన పశ్చిమ మండలం డీసీపీకి తట్టింది. దీంతో వ్యాక్సిన్‌ అందని వారు ఎంతమంది ఉంటారు అనే దానిపై ఓ అధ్యయనం చేశారు. అనుకున్న దానికన్నా ఎక్కువ మంది ఉన్నారని తేలింది. మొదట పోలీస్‌ స్టేషన్‌ల వారీగా అనుకున్నారు. కానీ వ్యాక్సిన్‌ అందని వర్గాలు ఎక్కువగా ఉండటంతో మెగా వ్యాక్సినేషన్‌కు రూపకల్పన జరిగింది. వ్యాక్సిన్‌లు ఉచితంగా అందించేందుకు మెగా ఇంజనీరింగ్‌, వైద్య సహాయం కోసం రెయిన్‌బో ఆస్పత్రులు ముందుకు వచ్చాయి. స్థలం ఇచ్చేందుకు ముఫకంజా సిద్ధమైంది.  


అన్నీ తామై... 

మెగా వ్యాక్సిన్‌ శిబిరాన్ని విజయవంతం చేసేందుకు పశ్చిమ మండలంలో 13 పోలీస్‌స్టేషన్‌లు సిద్ధమయ్యాయి. వారం రోజులుగా వ్యాక్సిన్‌ వేయించుకోని వారిని గుర్తించారు. వారి నుంచి ఆధార్‌కార్డులు, ఫోన్‌ నెంబర్లు తీసుకున్నారు. బస్తీ వాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక బస్సులను పెట్టి వ్యాక్సినేషన్‌ కేంద్రానికి తరలించారు. ఠాణాల వారీగా రిజిస్ట్రేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆడిటోరియంలో వ్యాక్సిన్‌ వేసేందుకు 26 కౌంటర్లను పెట్టారు. టీకా తీసుకున్నాక అరగంటపాటు విశ్రాంతి తీసుకునేందుకు కూడా సదుపాయాలు సమకూర్చారు. దీంతో వ్యాక్సినేషన్‌ ప్రణాళికాబద్ధంగా సాగిపోయింది. 

 

ట్రాన్స్‌జెండర్లకూ.. 

 మెగా శిబిరంలో పోలీసులు ట్రాన్స్‌జెండర్లకు పెద్ద పీట వేశారు. ట్రాన్స్‌జెండర్లు ఉండే ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక ప్రతినిధులను నియమించారు. సుమారు రెండు వేల మంది వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. 1900కు పైగా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అంతే కాకుండా దివ్యాంగులు, వృద్ధ్దులు కూడా పెద్ద ఎత్తున టీకా వేయించుకునేందుకు మొగ్గు చూపించారు.


అందరి సహకారంతోనే విజయవంతం 

వ్యాక్సిన్‌ ప్రతి ఒక్కరికీ అందాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు. 13 పోలీస్‌ స్టేషన్‌లకు చెందిన అధికారులు, సిబ్బంది పూర్తి శక్తి సామర్ధ్యాలు పెట్టారు. వ్యాక్సిన్‌కు అర్హులైన వారిని గుర్తించగలిగారు. మెగా శిబిరానికి మెగా ఇంజనీరింగ్‌, రెయిన్‌బో ఆస్పత్రి నిర్వాహకులు ముందుకు వచ్చారు. అందరి సహకారంతో శిబిరాన్ని విజయవంతం చేయగలిగాం. ఇంకా ఎవరైనా మిగిలితే మరోసారి శిబిరం నిర్వహించే ఆలోచనలో ఉన్నాం. లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తాం. 

- ఏఆర్‌ శ్రీనివాస్‌, పశ్చిమ మండలం డీసీపీ


  వ్యాక్సిన్‌ వేయించడం ఆనందంగా ఉంది 

మమ్మల్ని గుర్తించి వ్యాక్సిన్‌ వేయించడం ఆనందంగా ఉంది. వారం రోజులుగా పోలీసులు మమ్మల్ని సంప్రదిస్తూ వ్యాక్సిన్‌పై అవగాహన తీసుకువచ్చారు. వ్యాక్సిన్‌ కేంద్రానికి తరలించేందుకు ప్రత్యేక వాహనాలు కేటాయించారు. మాలో 90 శాతం మంది ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకున్నారు.  

- జాస్మిన్‌, ట్రాన్స్‌జెండర్‌


 ప్రభుత్వం కూడా గుర్తించాలి 

మాకు వ్యాక్సిన్‌ అవసరం అని పోలీసులు గుర్తించారు. మా సమస్యలను ప్రభుత్వం కూడా గుర్తించాలి. ఉపాధి అవకాశాలు, పెన్షన్‌, ఇల్లు, రేషన్‌కార్డులు అందించేందుకు కృషి చేయాలి. అప్పుడే మా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. 

- రచన, ట్రాన్స్‌జెండర్‌

Updated Date - 2021-06-16T17:26:45+05:30 IST