Abn logo
Sep 26 2021 @ 10:35AM

HYD: ‘నీకు ఎక్కువ మార్కులు వచ్చాయి ఏమిట్రా.. మళ్లీ పరీక్ష పెట్టమంటావా’ అంటూ..

ఆత్మహత్యా ప్రయత్నమా?  

పలుకోణాల్లో విచారిస్తున్న పోలీసులు


హైదరాబాద్/బోయినపల్లి: ఓ స్కూల్‌ భవనంపై నుంచి దూకిన పదోతరగతి విద్యార్థి తీవ్రగాయాల పాలయ్యాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఓల్డ్‌ బోయినపల్లిలో శనివారం జరిగింది. సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి పెయింటర్‌గా, అతని భార్య రోజువారీ కూలీగా పనిచేస్తూ ఓల్డ్‌ బోయినపల్లిలో నివాసముంటున్నారు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు (14) ఓల్డ్‌ బోయినపల్లిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలలో నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థికి గతంలోకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. దీంతో సంబంధిత టీచర్‌ మాట్లాడుతూ ‘నీకు ఎక్కువ మార్కులు వచ్చాయి ఏమిట్రా.. మళ్లీ పరీక్ష పెట్టమంటావా’ అంటూ చలోక్తిగా అన్నారు. దీంతో విద్యార్థి బాత్‌రూమ్‌కు వెళ్లొస్తానని వెళ్లి  పాఠశాల భవనం మూడో అంతస్తు కారిడార్‌ నుంచి కిందికి దూకాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలైన విద్యార్థిని చికిత్స నిమిత్తం వెంటనే సుచిత్ర సర్కిల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. విద్యార్థి కోలుకుని నోరు విప్పితేగాని అసలు విషయం బయటపడదని, పాఠశాల యాజమాన్యం ఫీజుల గురించి ఏమైనా వత్తిడి చేసిందా.. మరేదైనా కారణం ఉండొచ్చా... అనే కోణాల్లో పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుడి తండ్రి గోపి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్మరిన్ని...