గ్రేటర్‌లో బీఓటీ పద్ధతిలో పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటుకు చర్యలు

ABN , First Publish Date - 2020-07-05T13:55:14+05:30 IST

గ్రేటర్‌లో బీఓటీ పద్ధతిలో పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటుకు చర్యలు

గ్రేటర్‌లో బీఓటీ పద్ధతిలో పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటుకు చర్యలు

హైదరాబాద్‌: బహిరంగ మల, మూత్ర విసర్జనరహితంగా మహానగరాన్ని తీర్చిదిద్దే దిశగా అడుగులు పడుతున్నాయి. గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో బిల్ట్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ (బీఓటీ) పద్ధతిలో పబ్లిక్‌ టాయిలెట్ల ఏర్పాటు మొదలైంది. పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే 140 చోట్ల టాయిలెట్ల నిర్మాణం పూర్తయ్యిందని, 237 ప్రాంతాల్లో పురోగతిలో ఉన్నాయని కమిషనర్‌ డీఎస్‌ లోకే్‌షకుమార్‌ శనివారం తెలిపారు. ముంబైకి చెందిన ఓ సంస్థ డిజైన్లు రూపొందించింది. మెజార్టీ ప్రాంతాల్లో ఒకే రకమైన నమూనాలో పబ్లిక్‌ టాయిలెట్లు ఏర్పాటు చేస్తుండగా, అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి కొన్ని చోట్ల మార్పులు చేస్తున్నారు.


గ్రేటర్‌లోని ఆరు జోన్లలో జోన్‌కు 500 చొప్పున  మూడు వేల టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ఆగస్టు 15వ తేదీలోపు పనులు పూర్తి చేయాలని కేటీఆర్‌ లక్ష్యంగా నిర్దేశించారు. నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయాల్సిన బాధ్యతను జోనల్‌ కమిషనర్లకు అప్పగించారు. ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, చార్మినార్‌, ఎల్‌బీనగర్‌ జోన్లలో 500 ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. సికింద్రాబాద్‌ జోన్‌లో మాత్రం 229 ఏరియాలు గుర్తించారు. మరో 271 ప్రాంతాల కోసం అన్వేషణ కొనసాగుతోందని ఆ జోన్‌ అధికారొకరు తెలిపారు. కేబీఆర్‌ పార్క్‌ కృష్ణకాంత్‌ పార్క్‌ తదితర ప్రాంతాల్లో టాయిలెట్లు ఏర్పాటు చేశారు. 


పర్యావరణహిత టాయిలెట్లు...

అధునాతన పరిజ్ఞానంతో కూడిన పర్యావరణహిత టాయిలెట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.  పర్యావరణంపై ప్రభావం పడకుండా విసర్జితాలు రీ సైక్లింగ్‌ అవుతాయి. బస్టాప్‌లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, కూడళ్లు, పర్యాటక ప్రాంతాలు, రైల్వేస్టేషన్లు, పార్కుల వద్ద టాయిలెట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయా ప్రాంతాలకు వచ్చే సందర్శకులతోపాటు రోడ్డుపై వెళ్తోన్న వారు కూడా వినియోగించుకునేలా ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టాయిలెట్ల ఏర్పాటు జరుగుతోంది. రాజస్థాన్‌లోని జైపూర్‌, ఉదయ్‌పూర్‌, అజ్మీర్‌, బికనీర్‌ తదితర నగరాల్లో ఇప్పటికే ఈ తరహా మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. నగరంలో ప్రస్తుతం 350 వరకు టాయిలెట్లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి  వెయ్యి మందికో టాయిలెట్‌ ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం ఉన్నవి 10 శాతం లోపే. ఈ నేపథ్యంలో విస్తృత స్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.






Updated Date - 2020-07-05T13:55:14+05:30 IST