Abn logo
Sep 28 2021 @ 10:46AM

HYD: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణి..మానవత్వం చాటిన పోలీసులు

హైదరాబాద్/బౌద్ధనగర్‌: చిలకలగూడ పోలీసులు మానవత్వం చాటారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని రక్షక్‌ వాహనంలో గాంధీ ఆస్పత్రికి తరలించారు. రావుల పల్లవి, బాలకృష్ణ భార్యాభర్తలు. సీతాఫల్‌మండి డివిజన్‌ మధురానగర్‌ కాలనీలో నివసిస్తున్నారు. నిండు గర్భిణి అయిన పల్లవి ఆదివారం అర్ధరాత్రి పురిటినొప్పులతో బాధపడుతోంది. ఆస్పత్రిలో చేరేందుకు ఆటోలో వెళ్తోంది. ఎస్‌ఆర్‌ ఆస్పత్రి సమీపంలోకి వెళ్లగానే నొప్పులు ఎక్కువ అవడంతో ఆటోను ఆపేశారు. అదే సమయంలో గస్తీలో ఉన్న కానిస్టేబుల్‌ అంబోజి కిరణ్‌కుమార్‌, హోంగార్డు ఇమ్రాన్‌ అటువైపు వెళ్లారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న పల్లవిని వెంటనే రక్షక్‌ వాహనంలో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగం వద్ద స్ట్రెచర్‌ అందుబాటులో లేకపోవడంతో రెండు చేతులతో ఎత్తుకుని ఆమెను ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. మానవత్వంతో వ్యవహరించిన కానిస్టేబుల్‌, హోంగార్డును సీఐ నరేష్‌, అధికారులు అభినందించారు.