ఇప్పటికీ ఇంట్లోనే !

ABN , First Publish Date - 2021-05-12T17:11:05+05:30 IST

వాడిన టవల్స్‌నే వాడటం మొదలు పెట్టి ఒకటే షేవింగ్‌ బ్రష్‌ను వందలమంది మొహానికి పామే సలోన్‌లు మొదలు, గాలి కూడా

ఇప్పటికీ ఇంట్లోనే !

గ్రూమింగ్‌ సేవలను ఇంటి వద్దనే పొందుతున్న నవతరం

కటింగ్‌, షేవింగ్‌ సేవలకు జై కొడుతున్న పురుషులు

లాక్‌డౌన్‌ తరువాత బుకింగ్స్‌ పెరిగాయంటున్న సేవా యాప్‌లు

తమను కూడా ఇంటికే రమ్మంటున్నారంటున్న బార్బర్‌లు

మహమ్మారి భయంతో రెట్టింపు చెల్లింపులకూ నగరవాసులు సై 


కరోనా భయాలు ఇంకా తొలిగిపోలేదు. ఓ పక్క కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరో పక్క యూకే స్ట్రెయిన్‌, యూఎస్‌ స్ట్రెయిన్‌... చాలదన్నట్లు దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌... కరోనా కొత్త రూపాలు కలవర పెడుతూనే ఉన్నాయి. భౌతికదూరం, శానిటైజర్‌ వినియోగం, మాస్కు ధారణ మరికొన్నాళ్లపాటు మన జీవితంలో అంతర్భాగం కావాల్సిందేననే  డాక్టర్ల సూచనలు... మహమ్మారి బారిన పడి బయట పడ్డ వారు చెబుతున్న అనుభవాలు... కరోనా బారిన పడిన వ్యక్తులలో సైతం లక్షణాలు బయటపడేందుకు నాలుగైదు రోజులు పడుతుందనే అధ్యయనాలు... వెరసి ఇప్పటికీ జాగ్రత్తపరులు బయటకు రావడానికి మరీ ముఖ్యంగా కొన్ని రకాల సేవలను వినియోగించుకోవడానికి సందేహిస్తున్నారు. అలాంటి వాటిలో ఒకటి... గ్రూమింగ్‌, బ్యూటీ సేవలు. 


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి) : వాడిన టవల్స్‌నే వాడటం మొదలు పెట్టి ఒకటే షేవింగ్‌ బ్రష్‌ను వందలమంది మొహానికి పామే సలోన్‌లు మొదలు, గాలి కూడా జొరబడనీయకుండా డిజైన్‌ పేరిట మొత్తం మూసేసిన గదులలో సేవలను అందించే స్టూడియోల వరకూ గ్రూమింగ్‌ సేవలంటేనే ఎక్కువ శాతం మంది నగరవాసులు భయపడుతున్నారు. అలాగని ఆ సేవలను వినియోగించుకోకుండా ఉండలేని వారు ఇంటి వద్దనే ఆ సేవలను వినియోగించుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం అధికంగా చెల్లింపులనూ చేస్తున్నారు. మొదటి లాక్‌డౌన్‌ తరువాత కూడా ఇంటి వద్దనే గ్రూమింగ్‌ సేవలను వినియోగించుకుంటున్న వారి సంఖ్య గణనీయంగానే ఉందంటున్నారు పలువురు సలోన్‌ నిర్వాహకులు. ఇది వాస్తవమే అని అంగీకరిస్తున్నారు ఈ రంగంలోని నిపుణులు. ఓ అంచనా ప్రకారం ఇప్పటికీ 50ు మంది ఇంటి వద్దనే గ్రూమింగ్‌ సేవలను పొందుతున్నారు.


మగువల కన్నా మగమహారాజులే ఎక్కువ ?

ఇంటి ముంగిట సేవలను వినియోగించుకుంటున్న వారిలో మగువులకన్నా మగమహారాజులే ఎక్కువగా ఉంటున్నారన్నది సలోన్‌ రంగంలోని నిపుణుల మాట. మగవారు ఎక్కువగా షేవింగ్‌, కటింగ్‌ సేవలను వినియోగించుకుంటున్నా పెడిక్యూర్‌, మేనిక్యూర్‌, హెయిర్‌ స్పా లాంటి సేవలనూ కోరుకుంటున్నారు. ఇదే విషయమై నగరంలో ఓ మల్టీ చైన్‌ సలోన్‌, స్పాల సంస్ధ మేనేజర్‌ (పేరు వెల్లడించవద్దన్నారు) మాట్లాడుతూ లాక్‌డౌన్‌ తరువాత ఇంటి వద్దనే గ్రూమింగ్‌ సేవల పరంగా డిమాండ్‌ నాలుగు రెట్లు పెరిగింది. దీనిలోనూ మహిళలతో పోలిస్తే మగవారే ఎక్కువగా ఉంటున్నారు. మహిళలు బయట తిరిగే అవకాశాలు తక్కువగా ఉండటం కూడా దీనికి ఓ కారణం కావొచ్చు’ అని అన్నారు. నిజానికి లాక్‌డౌన్‌ కాలం అనంతరం చాలా వరకూ బ్రాండెడ్‌ సలోన్స్‌ భద్రత పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కానీ అసంఘటిత రంగంలో ఇంకా ఆ దిశగా వినియోగదారుల నమ్మకాన్ని పొందలేకపోవడమే ఇంటి వద్ద గ్రూమింగ్‌ సేవలను ఎక్కువ మంది కోరుకుంటుండటానికి కారణంగా అభివర్ణించారాయన. 


వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ మాత్రమే కాదు... వర్క్‌ ఎట్‌ హోమ్‌ కూడా 

లాక్‌డౌన్‌ కాలంలో చాలామంది తమంతట తాముగా లేదంటే భార్యామణుల సహాయంతో కటింగ్‌ చేయించుకున్నారు. గత ఏడాది లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో ప్రొఫెషనల్‌ గ్రూమింగ్‌ సేవలను వినియోగించడానికి ఆసక్తి చూపారు. అయితే గతానుభవాలు, తాజాగా వచ్చిన శుభ్రత ఆవశ్యకతలు... తప్పనిసరై ఆ సేవలను తమ ఇంటి వద్దనే వినియోగించుకునేలా ప్రోత్సహించాయి. ఇదే విషయమై మోతినగర్‌లో ఓ సలోన్‌ షాప్‌ నిర్వాహకుడు మారుతి మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ అవకాశాలు వచ్చిన తరువాత చాలామంది తమ ఇళ్ల వద్దనే కటింగ్‌, షేవింగ్‌ చేయమని ఫోన్‌ చేస్తున్నారు. గతంలో పేషంట్లు, వయసు మీద పడిన వారికి మాత్రమే ఈ తరహా సేవలు అందించే వారం. కానీ ఇప్పుడు అందరికీ సేవలను అందిస్తున్నాం.  కాకపోతే సలోన్‌లో రూ.100 కటింగ్‌కు తీసుకుంటే, ఇంటికి వెళ్లినందుకు 200 తీసుకుంటున్నాం. అయినా ఇస్తున్నారు..’అని అన్నారు. 


ఇంటి వద్దనే గ్రూమింగ్‌ సేవలను పొందుతున్న వారి సంఖ్య కరోనా తరువాత పెరిగిందనే అంటున్నారు అర్బన్‌ కంపెనీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా సేవలందిస్తున్న తిరుపతి. లాక్‌డౌన్‌కు ముందు రోజుకు రెండు మూడు ఆర్డర్స్‌ అంటే గొప్పగా ఉండేది. ఇప్పుడు కనీసం 4-6 ఉంటున్నాయి. షాప్‌లో కన్నా ఇళ్ల వద్దనే తాను ఎక్కువగా ఉంటున్నానన్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తరువాత ప్రజల కదలికలు పెరిగినా ఎందుకు ఇంకా ఇంటి వద్దనే గ్రూమింగ్‌ సేవలను వినియోగించుకుంటున్నారంటే భద్రత పట్ల భయాల వల్లనే అన్నది ఎక్కువ మంది మాట. చాలా వరకు వ్యాధులకు సలోన్‌లు కూడా కారణమని, మరీ ముఖ్యంగా హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ లాంటి వాటితో పాటు కరోనా లాంటి మహమ్మారులకూ అవి నిలయాలనే అధ్యయనాలు.. అటు వైపు చూడాలంటేనే భయపడేలా చేస్తుందన్నారు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నవనీత్‌. బ్లేడ్‌ మారుస్తారు కానీ ఒకటే టవల్‌, దువ్వెన, షేవింగ్‌ బ్రష్‌ వాడే వారే ఎక్కువ. ఎంత జాగ్రత్తలో ఉంటున్నా వ్యాధులు వస్తోన్న కాలంలో తెలిసి అక్కడకు వెళ్లడమెందుకు. అందుకే ఇంటికి రమ్మంటున్నాను. శానిటైజర్‌ రాసుకుంటారు. మాస్క్‌ వాడతారు. వారి ఎక్వి్‌పమెంట్‌ తెస్తారు. కానీ మనదే వాడమంటాం. ఆల్‌ హ్యాపీస్‌.. అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2021-05-12T17:11:05+05:30 IST