Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏడేళ్లు.. 67 వేల కోట్లు..

 స్వయం పాలనలో సిటీ అభివృద్ధికి ప్రాధాన్యం

 విశ్వనగరం దిశగా అడుగులు

 నిరుపేదలకు ఆత్మగౌరవ నివాసాలు

 ట్రాఫిక్‌ చిక్కులకు చెక్‌ పెట్టేలా ఎస్‌ఆర్‌డీపీ

 12 కు పైగా జాతీయ రక్షణ సంస్థలకు నెలవు

 అభివృద్ధి నివేదికలో వివరించిన ప్రభుత్వం

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా విడుదల

వరల్డ్‌ క్లాస్‌ ఏరోస్పేస్‌ యూనివర్సిటీ

బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్‌ వరకు (26.2 కి.మీ) మెట్రో కారిడార్‌ 4 

ఐదేళ్లలో మరో రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తామంటోన్న సర్కారు


హైదరాబాద్‌ సిటీ:  ఏడేళ్ల స్వయం పాలనలో తెలంగాణ గుండెకాయ హైదరాబాద్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ప్రభుత్వం పేర్కొంది. బహుముఖ వ్యూహంతో మౌలిక వసతుల కల్పన, నగర బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేందుకు కృషి చేస్తున్నట్టు వెల్లడించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గ్రేటర్‌లో చేపట్టిన అభివృద్ధి పనులు, కల్పించిన మౌలిక సౌకర్యాలు, పారదర్శక పౌర సేవల కోసం తీసుకువచ్చిన సంస్కరణలను ఈ ప్రకటనలో వివరించింది. ప్రాజెక్టులు, మెట్రో, నగరం, పరిసర ప్రాంతాల పురోగతి, మూసీ ప్రక్షాళన, తీర ప్రాంత అభివృద్ధితో పాటు విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటి వరకు రూ.67,351 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపింది. అంతేకాకుండా రానున్న ఐదేళ్ల కాలంలో రూ.50 వేట కోట్లతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. భారీ, మాధ్యమిక, చిన్న, సూక్ష్మ పరిశ్రమలు, సేవల సంస్థకు వేదికైన హైదరాబాద్‌ ఆర్థిక వ్యవస్థ అక్షరాలా 74 బిలియన్‌ డాలర్లుగా ఈ ప్రకటనలో పేర్కొంది. 


ఈ ప్రకటనలో ప్రస్తావించిన మరి కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి..

గ్రేటర్‌లో ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెట్టేందుకు రూ.29,695.20 కోట్ల అంచనా వ్యయంతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ)కు శ్రీకారం చుట్టింది. వివిధ దశల్లో రూ.6 వేల కోట్లతో పనులు మొదలయ్యాయి. ఇప్పటి వరకు తొమ్మిది ప్రాంతాల్లో వంతెనలు, నాలుగు చోట్ల అండర్‌పా్‌సలు అందుబాటులోకి వచ్చాయి. మరో ఏడు ప్రాంతాల్లో పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఆరు వంతెనలు నిర్మించే ప్రతిపాదనను పర్యావరణ అనుమతుల జాప్యంతో తాత్కాలికంగా విరమించారు. రూ.184 కోట్లతో దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్‌ వంతెన నగరానికి మరో కలికితురాయిగా మారింది. ఐకానిక్‌ స్ట్రక్చర్‌గా పేర్కొంటున్న ప్రభుత్వం.. కేబుల్‌ వంతెన నిర్మాణ అనంతరం దుర్గం చెరువు పరిసరాలను అభివృద్ధి చేసి ఆ ఏరియాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు. 


నగరం నలువైపులా ఎక్స్‌ప్రెస్‌ హైవేలు నిర్మించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి తూంకుంట, ఉప్పల్‌ నుంచి ఘట్‌కేసర్‌, ఎల్‌బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ మార్గాల్లో ఎక్స్‌ప్రెస్‌ కారిడార్లు నిర్మించాలన్నది ప్రతిపాదన. ఉప్పల్‌ - ఘట్‌కేసర్‌ పనులు పురోగతిలో ఉన్నాయి. 


దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. 2019లో భాగ్యనగరం అందాలను తిలకించేందుకు దేశంలోని పర్యాటకులు క్యూ కట్టారని బుకింగ్‌డాట్‌ కామ్‌ డిజిటల్‌ ట్రావెలింగ్‌ కంపెనీ సర్వేలో వెల్లడించింది. టాప్‌ 5 నగరాల్లో హైదరాబాద్‌ తర్వాత పుణే, జైపూర్‌, కొచ్చి, మైసూర్‌ ఉన్నాయి. విదేశీ పర్యాటకులు కూడా హైదరాబాద్‌ను ఎక్కువగానే సందర్శించారని ఆ సర్వేలో పేర్కొన్నారు. 


వైమానిక, రక్షణ రంగంలో హైదరాబాద్‌ పాత్ర కీలకమైనది. ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ సహా ఇతరరంగాల్లో ఆవిష్కరణలను ప్రభుత్వం ప్రొత్సహిస్తోంది. స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించేందుకు దేశంలోనే అతిపెద్దదైన టీ- హబ్‌ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేయగా, బోయింగ్‌, ప్రాట్‌ అండ్‌ విట్నీ, కాలిన్‌ ఏరోస్పేస్‌ తదితర అమెరికా కంపెనీలు ఇందులో భాగస్వామ్యంగా ఉండి పని చేస్తున్నాయి. ఏరోస్పేస్‌, రక్షణ రంగాల్లో హైదరాబాద్‌ చారిత్రకంగా డిఫెన్స్‌ ఎకోసిస్టమ్‌ కలిగి ఉంది. 


రక్షణ విభాగానికి సంబంధించి 12 వరకు జాతీయ సంస్థలు నగరంలో ఉన్నాయి. దశాబ్దాల నుంచి డీఆర్డీవో ఇక్కడి నుంచే సేవలందిస్తోంది. ఏరోస్పేస్‌, రక్షణ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌ మొత్తంలో మెరుగైన వాతావరణం తెలంగాణలో ఉంది. ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన బోయింగ్‌, జీఈ తదితర సంస్థలు ఆదిబట్ల, నాదర్‌గుల్‌లో యూనిట్లు ఏర్పాటు చేసుకొని ఉత్పత్తులు ప్రారంభించాయి. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే హెలికాప్టర్‌తో పాటు ఎఫ్‌ -16 యుద్ధ విమానం విడిభాగాలు సైతం హైదరాబాద్‌లోనే తయారవ్వడం ఇక్కడి విధానాల విజయానికి నిదర్శనం. రక్షణ రంగానికి అవసరమయ్యే లీప్‌ ఇంజిన్లు, ఎఫ్‌- 16 యుద్ధ విమానాల రెక్కలు, అపాచీ హెలికాప్టర్ల విడిభాగాలు, ఆదానీ ఎల్పిదా డిఫెన్స్‌ సిస్టమ్‌ ద్వారా డ్రోన్ల తయారీ, సూపర్‌ హెర్క్యులస్‌ ఎయిర్‌ లిఫ్టర్‌ తదితర భాగాలను నగరంలోనే ఉత్పత్తి చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే నాలుగు ఏరోస్పేస్‌ పార్కులు ఉండగా, మరో రెండు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. నైపుణ్యం గలవారిని తయారు చేసేందుకు తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్స్‌ ద్వారా అధికారులు శిక్షణ ఇస్తున్నారు. 


హైదరాబాద్‌లో వరల్డ్‌ క్లాస్‌ ఏరోస్పేస్‌ యూనివర్సిటీని ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో పాలుపంచుకునేందుకు యూఎస్‌ డిఫెన్స్‌ మేజర్స్‌, ట్రైనింగ్‌ పార్టనర్స్‌ ముందుకురావాలని మంత్రి కేటీఆర్‌ ఆహ్వానించారు. 


దేశంలో ఎక్కడా లేని విధంగా టీఎ్‌సఐపాస్‌ పాలసీని తెలంగాణలో అమలు చేస్తున్నారు. పెద్దపెద్ద కంపెనీలు హైదరాబాద్‌కు రాగా, అమెజాన్‌ ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయాన్ని ఇక్కడ నెలకొల్పింది. జీఈ, హనీవెల్‌, ప్రాట్‌ అండ్‌ విట్నీ, లాక్‌ హీడ్‌ మార్టిన్‌ వంటి పెద్ద కంపెనీల పెట్టుబడులను కూడా హైదరాబాద్‌ ఆకర్షించింది. 


ప్రపంచస్థాయి సౌకర్యాలు, ప్రభుత్వ విధానాల కారణంగా ఇళ్ల ధరల పెరుగుదలలో నగరం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ప్రాంక్‌ తన సర్వేలో వెల్లడించింది. 2019లో 150 నగరాల్లో ఇళ్ల ధరల పెరుగుదలను పరిశీలించిన నైట్‌ ఫ్రాంక్‌ సంస్థ..అంతర్జాతీయ స్థాయిలో చూస్తే 9 శాతం పెరుగుదలతో హైదరాబాద్‌ 14 వ స్థానంలో నిలిచిందని నివేదికలో పేర్కొంది. 


స్మార్ట్‌ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు సీస్కోతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. స్మార్ట్‌ సిటీ సొల్యుషన్స్‌ ద్వారా ప్రజలకు ఆధునిక సదుపాయాలు అందించేందుకు మార్గం ఏర్పడింది.

 నగరంలో 80 ఏసీ బస్సులను నాలుగు మార్గాలలో నడుపుతున్నారు.

హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వెళ్లే మార్గంలో ఉప్పల్‌ - ఘట్‌కేసర్‌ వరకు 40 కిలోమీటర్ల ఎలివేటేడ్‌ కారిడార్‌ నిర్మిస్తున్నారు.

పాదచారుల కోసం ప్రత్యేకంగా మెహిదీపట్నం, ఉప్పల్‌లో స్కైవాక్‌ల నిర్మాణ పనులు ప్రారంభించారు.

Advertisement
Advertisement