ఉఫ్‌.. డీఆర్‌ఎఫ్‌

ABN , First Publish Date - 2021-06-18T15:31:07+05:30 IST

వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ‘చెట్లు/కొమ్మలు విరిగిపడినా, వరద నీరు నిలిచినా.. ఒక్క ఫోన్‌ చేయండి.. వాట్సా్‌పలో ఫొటోలు పంపండి. వెంటనే తగిన చర్యలు

ఉఫ్‌.. డీఆర్‌ఎఫ్‌

ఫిర్యాదు చేసినా పట్టించుకోరు : నెటిజన్‌

నీరు నిలిచినా.. చెట్టు కూలినా

తమ దృష్టికి తీసుకురావాలంటున్న అధికారులు

సుశిక్షితులతో ప్రత్యేక బృందాలు


హైదరాబాద్‌ సిటీ:  వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ‘చెట్లు/కొమ్మలు విరిగిపడినా, వరద నీరు నిలిచినా.. ఒక్క ఫోన్‌ చేయండి.. వాట్సా్‌పలో ఫొటోలు పంపండి. వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం’ అని చెబుతోంది. 040 - 2955 5500, 90001 13667 నెంబర్‌కు ఫోన్‌, వాట్సాప్‌ చేయాలని అధికారులు చెప్పారు. మాన్‌సూన్‌ ఇబ్బందులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. సుశిక్షితులతో కూడిన బృందాలు, అవసరమైన యంత్రాలు, పరికరాలు సమకూర్చినట్టు తెలిపారు. మాన్‌సూన్‌ టీంలతో పాటు డీఆర్‌ఎఫ్‌ బృందాలు క్షేత్రస్థాయిలో పని చేయనున్నాయి. వరద సహాయక చర్యలు, చెట్లు, కొమ్మలు, కూలిన భవనాల శిథిలాలు ఎలా తొలగించాలనే దానిపై 360 మందికి శిక్షణ ఇచ్చామని ఓ అధికారి చెప్పారు. వీరిని 19 బృందాలుగా ఏర్పాటుచేసి.. ఎనిమిది లైట్‌ మోటార్‌ వెహికిల్స్‌, 11 ట్రక్కులపై ఇబ్బందులు ఉన్న ప్రాంతాలకు వెళ్లి పనిచేసేలా బాధ్యతలు అప్పగించారు. రెస్క్యూ బోట్లు, డీ వాటరింగ్‌ పంపులు, ట్రీ కట్టర్‌, చైన్‌ సాస్‌, బ్రేకర్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, గ్యాస్‌ కట్టింగ్‌ టూల్స్‌ తదితర పరికరాలు బృందాల వెంట ఉండనున్నాయి. రెస్క్యూ బోట్లలో సహాయక చర్యలు ఎలా చేపట్టాలనే విషయంపైనా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. వరదల నిర్వహణ ఎలా..? విపత్తులో చేపట్టాల్సిన సహాయక చర్యలపై ప్రతి మూడు నెలలకోమారు ఆరు రోజులపాటు శిక్షణ ఇస్తున్నామని డీఆర్‌ఎఫ్‌ అధికారొకరు చెప్పారు. ఈవీడీఎం ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేసి.. దానికి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా బృందాలకు సమాచారమిస్తారు. వర్ష సూచనకు సంబంధించి వాతావరణ  శాఖ హెచ్చరికల ఆధారంగా ముందస్తుగా బృందాలను అప్రమత్తం చేస్తారు. 


ఫిర్యాదు చేసినా...

చెట్టు విరిగిందని ఫిర్యాదు చేసినా.. జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌ విభాగం పట్టించుకోలేదని ఓ నెటిజన్‌ పేర్కొన్నారు. రామంతాపూర్‌ ప్రగతినగర్‌లో చెట్టు కొమ్మలు విరిగిపడి రోడ్డంతా బ్లాక్‌ అయ్యిందని జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు (రెఫరెన్స్‌ ఐడీ- 1706211379477) చేయగా.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. కూలిన చెట్టుతోపాటు ట్వీట్‌ చేసిన సిద్ధార్థ కమిషనర్‌ జీహెచ్‌ఎంసీ, విజయ్‌గోపాల్‌ (డీఆర్‌ఎఫ్‌ అధికారి)లను ట్యాగ్‌ చేశారు. 

Updated Date - 2021-06-18T15:31:07+05:30 IST