Abn logo
Jun 23 2021 @ 12:50PM

అటు కరోనా, ఇటు సీజనల్‌ వైర్‌సలు

మారిన వాతావరణంతో ఇమ్యూనిటీ తగ్గే అవకాశం

ఆస్తమా, న్యుమోనియా, డయేరియా ఇబ్బందులు

ఇతర జబ్బులున్నవారు జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు


ప్రజలను కరోనా ఇంకా వెంటాడుతూనే ఉంది. దీనికి తోడు వర్షాకాలం మొదలు కావడంతో అప్పుడప్పుడూ వానలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో వాతావరణం సీజనల్‌ వైర్‌సకు అనుకూలంగా మారుతోంది. అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చల్లటి వాతావరణంలో వైరస్‌ విజృంభించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇమ్యూనిటీ దెబ్బతిని, ఇన్‌ఫెక్షన్‌ను తట్టుకునే శక్తి తగ్గుతుందని పేర్కొంటున్నారు. 


హైదరాబాద్‌ సిటీ : ఈ సీజన్‌లో స్వైన్‌ ఫ్లూ, ఆస్తమా, న్యుమోనియా, సీవోపీడీ తదితర శ్వాసకోశ వ్యాధులు విజృంభించే ప్రమాదముంది. తేమ వాతావరణంలో పిల్లలు, మహిళలు త్వరగా అలిసిపోతారని వైద్యులు చెబుతున్నారు. వర్షాల్లో ఎక్కువగా తడిసే వారికి సమస్య జటిలమవుతుందని హెచ్చరిస్తున్నారు.


కలుషిత నీటితో ముప్పు

వర్షాకాలంలో వాన నీరు, డ్రైనేజీ నీరు కలవడం వల్ల తాగేనీరు కలుషితం అవుతూ ఉంటుంది. కలుషిత నీటిని తాగిన వారు వాంతులు, విరోచనాల బారిన పడతారు. దీంతో పాటు అపరిశుభ్ర పరిసరాలు, అపరిశుభ్ర ఆహారం వల్ల హెపటైటి్‌స-ఎ, హెపటైటి్‌స-ఇ, ఇన్‌ఫెక్షన్‌ బారిన పడే అవకాశం ఉంది. కలుషిత నీటితో కడిగిన ఆహార పదార్థాలు తిన్నా, నీళ్లు తాగినా కలరా, టైఫాయిడ్‌ వచ్చే ప్రమాదముంది. పచ్చిది లేదా, సరిగ్గా ఉడకని సీ ఫుడ్స్‌ తినడం మంచిదికాదని, మధుమేహం, గుండెజబ్బులు, ఇతర వ్యాధులు ఉన్న వారు ఈ వాతావరణంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.


వ్యాక్సిన్‌ అవసరం

హెపటైటిస్‌ బారిన పడిన వారిలో జ్వరం, నీరసం, ఆకలి లేకపోవడం, తల తిరగడం, కడుపులో అసౌకర్యంతో పాటు క్రమంగా జాండిస్‌ లక్షణాలు బయటపడవచ్చు. హెపటైటిస్‌ - ఎ, ఇ ఇన్‌ఫెక్షన్‌ తగ్గించడానికి మందులేమీ లేవు. ఈ వ్యాధి రిస్క్‌ ఉన్నవాళ్ళు వాక్సినేషన్‌తీసుకోవడం అవసరం. 


ఇలా జాగ్రత్త పడితే

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు జబ్బుల బారిన త్వరగా పడుతుంటారు. శ్వాసకోశ వ్యాధులున్న వారు ఈ వాతావరణంలో ఎక్కువగా బయట తిరగొద్దు. పౌష్టికాహారం తీసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఆహారం తినాలి. బయటి ఆహారానికి దూరంగా ఉండాలి. ఫ్రిజ్‌ నీళ్లు తాగడం మానేయాలి. శరీరం పూర్తిగా కవర్‌ అయ్యేలా వెచ్చటి దుస్తులు ధరించడం మంచిది. కాచి వడపోసి చల్లార్చిన నీటినే తాగాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మల, మూత్ర విసర్జన అనంతరం శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఈగలు, దోమలు ముసిరే ప్రాంతాల్ని వెంటనే శుభ్రం చేసుకోవాలి. దగ్గేటప్పుడు చేతి రుమాలను నోటికి అడ్డంగా పెట్టుకోవాలి. కొవ్వు ఆహారం, నాన్‌వెజ్‌కు దూరంగా ఉండాలి.

- డాక్టర్‌ రమేష్‌ బాబు దంపూరి, ఆర్‌ఎంఓ, నిలోఫర్‌ ఆస్పత్రి


అప్రమత్తంగా ఉండాలి

చల్లటి వాతావరణంతో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశముంది. ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోవడం, రక్తనాళాలు కుంచించుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, న్యుమోనియా మొదలైనవి ఏర్పడతాయి. నుమోనియా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి కావడంతో శ్వాస వ్యవస్థపై దాడి చేస్తే ప్రమాదంగా మారుతుంది. ఈ సీజన్‌లో పిల్లలకు నీళ్ల విరోచనాలు (డయేరియా) అయ్యే అవకాశముంది. అప్రమత్తంగా ఉండాలి. వ్యాధుల బారిన పడితే వైద్యులు సూచించిన ప్రకారం మందులు వాడాలి. 

 - డాక్టర్‌ మురళీ, పల్మనాలజిస్టు, శ్రీకర్‌ ఆస్పత్రి