Abn logo
Jul 26 2021 @ 12:07PM

తగ్గిన ఫ్లైఓవర్‌ ఎత్తు..వాహనాల రాకపోకలకు ఇబ్బంది

 ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) ప్రమాణాల ప్రకారం నగరంలో వంతెనలను 5.5 మీటర్ల ఎత్తులో నిర్మించాలి. గ్రేటర్‌లో ఈ ప్రమాణాలు పాటిస్తున్నారా..? వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎ్‌సఆర్‌డీపీ)లో భాగంగా నిర్మిస్తున్న వంతెనలకు ఈ ప్రమాణాలను అమలు చేస్తున్నారా ..? అన్నది చర్చనీయాంశంగా మారింది. బైరామల్‌గూడ చౌరస్తా వద్ద వంతెన నిర్మాణం తక్కువ ఎత్తులో ఉండడంతో ఇతర ప్రాంతాల్లో నిర్మాణాలు ఎలా సాగాయన్నది ఆసక్తికరంగా మారింది. 


బైరామల్‌గూడ చౌరస్తాలో 5.5 మీటర్ల కంటే తక్కువే..  

పెద్ద వాహనాలు వెళ్తే ప్రమాదమే..

కార్పెటింగ్‌, రీ కార్పెటింగ్‌తో రోడ్‌ ఎత్తు పెరిగే అవకాశం

అదే జరిగితే మరింత ఇబ్బంది


వంతెన స్వరూపం...

పొడవు - 780 మీటర్లు 

లేన్‌లు - 3 

వెడల్పు - 12 మీటర్లు 

నిర్మాణ వ్యయం రూ.26.45 కోట్లు


హైదరాబాద్‌ సిటీ: రూ.26.45కోట్లతో ఎల్‌బీనగర్‌ నుంచి శంషాబాద్‌ వైపు వెళ్లేందుకు సాగర్‌ చౌరస్తా వద్ద కుడి వైపు నిర్మించిన వంతెనను గతేడాది ప్రారంభమైంది. వంతెనపై ప్రస్తుతం రాకపోకలు సాగుతున్నాయి. ఇదే మార్గంలో ఎడమ వైపు వంతెన పనులు పురోగతిలో ఉన్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా, వంతెన ఎత్తు నిర్ణీత ప్రమాణాల ప్రకారం 5.5 మీటర్ల ఎత్తులో లేకపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. లోడ్‌తో వచ్చే కొన్ని వాహనాల ఎత్తు 5 మీటర్ల వరకు ఉంటుంది. ఈ క్రమంలో వంతెన స్పాన్‌కు కింది వైపున వాహనాలు తగులుతున్నాయి.


అధునాతన పరిజ్ఞానం.. అయినా... 

అధునాతన ఇంజనీరింగ్‌ పరిజ్ఞానంతో ఎస్‌ఆర్‌డీపీ వంతెనల నిర్మాణం జరుగుతోంది. ప్రీ కాస్ట్‌ ఇంజనీరింగ్‌లో భాగంగా యార్డ్‌లో తయారుచేసిన పిల్లర్లు, పియర్‌ క్యాప్‌లు, వయాడక్ట్‌లు, గర్డర్లను సైట్‌కు తీసుకువచ్చి అమర్చుతున్నారు. చౌరస్తాల వద్ద 50 మీటర్ల స్టీల్‌ స్పాన్‌లు వినియోగిస్తున్నారు. నగరంలో ఇంత పెద్ద స్పాన్‌లు వాడడం ఎస్‌ఆర్‌డీపీలోనే ప్రథమం. ఇంతటి సాంకేతికత అందుబాటులో ఉన్నా.. వంతెన ఎత్తు విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా వంతెన కింది నుంచి వాహనాలు వెళ్లే మార్గాలు/చౌరస్తాలు ఉన్న చోట ఫ్లై ఓవర్‌ కనీస ఎత్తు 5.5 మీటర్లు ఉండాలి. ఎస్‌ఆర్‌డీపీ వంతెనలన్నీ అదే ప్రాతిపదికన డిజైన్‌ చేశారు. కానీ, ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన కుడివైపు వంతెన నిర్ణీత ఎత్తులో లేదని స్పష్టంగా కనిపిస్తోంది. ఎడమ వైపు నిర్మిస్తోన్న వంతెన కూడా దాదాపు అంతే ఎత్తులో ఉండవచ్చని ఓ అధికారి అనుమానం వ్యక్తం చేశారు. ఎత్తు తక్కువగా ఉంటే.. ప్రస్తుతానికి ఇబ్బందులు లేకున్నా మున్ముందు వంతెన నిర్మాణ స్థిరత్వంపైనా ప్రభావం చూపుతుందని ఇంజనీరింగ్‌ నిపుణుడొకరు తెలిపారు. నగరంలోకి భారీ వాహనాలు రాత్రి వేళలో ఎక్కువగా వస్తుంటాయి. చీకట్లో డ్రైవర్లు గమనించక వేగంగా వాహనాలను నడుపుతూ వచ్చి వంతెన కిందిభాగానికి తగిలిస్తే స్టక్చర్‌పై ప్రభావం పడే ప్రమాదముంది. స్పాన్‌ పొడవు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముప్పు మరీ ఎక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కార్పెటింగ్‌, రీ కార్పెటింగ్‌తో నగరంలో రోడ్ల ఎత్తు అనూహ్యంగా పెరుగుతోన్న నేపథ్యంలో మున్ముందు మరింత ఇబ్బంది అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగుతల్లి వంతెన వద్ద ఇదే పరిస్థితి ఉంది. కొన్ని వాహనాలు వంతెన శ్లాబ్‌కు తగులుతుంటాయి. వంతెనల ఎత్తు తక్కువగా ఉంటే హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తారు. నిర్ణీత స్థాయి కంటే ఎత్తయిన వాహనాలు వంతెన కింది నుంచి వెళ్లకూడదనే సందేశం ఉంటుంది. బైరామల్‌గూడ చౌరస్తా అలాంటి సూచికలూ కనిపించడం లేదు. 


ఔను.. వాస్తవమే :  జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ అధికారులు

ఆ వంతెన 5.5 మీటర్ల కంటే కొంత తక్కువ ఎత్తులో ఉందన్నది వాస్తవం. ఎస్‌ఆర్‌డీపీలోని ఇతర వంతెనలన్నీ 5.5 మీటర్లు.. అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి 4.5 నుంచి 5 మీటర్ల ఎత్తులో వంతెన నిర్మించవచ్చని ఐఆర్‌సీ చెబుతోంది. కొంచెం తక్కువ ఎత్తున్నా.. అదేం పెద్ద ఇబ్బంది కాదు. అక్కడి రోడ్‌ ప్రొఫైల్‌ను సరి చేస్తే సరిపోతుంది. రహదారి ఎత్తు తగ్గిస్తే వంతెనకు, రోడ్డుకు మధ్య గ్యాప్‌ ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో వాహనాల రాకపోకలు, వరద ప్రవాహానికి ఇబ్బంది లేకుండా రోడ్‌ డిజైన్‌ చేయాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి కొంత మినహాయింపు ఉన్నప్పటికీ.. ఆ మార్గంలో వంతెన ఎత్తు పెంచినా పెద్దగా ఆస్తుల సేకరణ, ఇతరత్రా ఇబ్బందులు లేవు. అయినా ఎందుకిలా చేశారంటే అధికారులు సమాధానం దాట వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించే సమయంలో జరిగిన చిన్న తప్పిదం వల్ల ఇలా జరిగిందని బల్దియా ఇంజనీరింగ్‌ అధికారొకరు తెలిపారు.