Hyderabad City: ఇంట్లోనే పార్టీలు

ABN , First Publish Date - 2021-08-01T16:09:58+05:30 IST

కరోనా నగర వాసుల ప్రాధాన్యతలనూ మార్చింది. సాయంత్రమైతే చాలు పార్టీలు, పబ్‌లు అంటూ ఊగిపోయే యువతరం కూడా ఆలోచించే పరిస్థితి తీసుకువచ్చింది. ఇక వైన్‌ అండ్‌ చీజ్‌...

Hyderabad City: ఇంట్లోనే పార్టీలు

వర్చువల్‌లో సెషన్స్‌ నిర్వహిస్తున్న కంపెనీలు

కరోనా కాలంలో నయా ట్రెండ్‌గా ఆదరణ


హైదరాబాద్‌ సిటీ : కరోనా నగర వాసుల ప్రాధాన్యతలనూ మార్చింది. సాయంత్రమైతే చాలు పార్టీలు, పబ్‌లు అంటూ ఊగిపోయే యువతరం కూడా ఆలోచించే పరిస్థితి తీసుకువచ్చింది. ఇక వైన్‌ అండ్‌ చీజ్‌ పార్టీలతో కాలక్షేపం చేసే హై-ఫై వర్గమైతే అసలు హోటల్స్‌లో ఆ తరహా పార్టీలే లేక డీలాపడింది. సోషలైట్లు దాదాపు ఏడాది కాలంగా ఇళ్లలోనే పార్టీలనూ చేసుకుంటున్నారు. దావత్‌ అంటే దోస్తులు ఉండాల్సిందే... మజా చేయాల్సిందే. కానీ కరోనా భయం. అందుకే వర్చువల్‌ పార్టీయింగ్‌కు తెరతీశారు. ‘మీ ఇంట్లో మీరుండండి.. మా ఇంట్లో మేముంటాం.. గ్లాసులు లేపుదాం.. చీర్స్‌ చెప్పుకుందామంటూ’ వర్చువల్‌ పార్టీయింగ్‌ జరుపుకుంటున్నారు. అయితే తమకు లభించిన ఏ చిన్న అవకాశాన్నీ వదలని వ్యాపార సంస్థలు ఇప్పుడు ఈ వర్చువల్‌ పార్టీలనే వైన్‌ టేస్టింగ్‌ పార్టీలుగా మార్చాయి.  


గతంలో హోటళ్లలో పార్టీలను నిర్వహించే వైన్‌కంపెనీలు ఇప్పుడు నేరుగా వినియోగదారుల లివింగ్‌రూమ్‌లోకి వర్చువల్‌ గా వచ్చేస్తున్నాయి. ‘మీకు మా కొత్త తరహా వైన్‌ బాటిల్‌ పంపించాము. ఫలానా రోజు రాత్రి 8 గంటలకు పార్టీ. మీ ఇంటినుంచే వేడుకలో పాల్గొనండి. రుచుల ఆస్వాదనను, ఫలవంతమైనచర్చలతో సాగించండి’ అంటూ ఆహ్వానాలూ పంపుతున్నాయి. ఈ కరోనా కాలంలో  ఈ తరహా నాలుగు వైన్‌ టేస్టింగ్‌ పార్టీలను  నిర్వహించామని హైబ్రిడ్‌ ఈవెంట్స్‌ నిర్వహణలోని ఓ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన వైన్‌ బ్రాండ్‌ కోసం చేసిన ఈ పార్టీలో నగరానికి చెందిన పలువురు వ్యాపారవేత్తలు పాల్గొన్నారన్నారు.


తెలుసుకునేందుకు అవకాశం...

వర్చువల్‌ వైన్‌ టేస్టింగ్‌ అంటే ముందు బాటిల్స్‌ పెట్టుకుని వైన్‌ ఆస్వాదించడం మాత్రమే కాదు, వైన్‌ గురించి మరింతగా తెలుసుకునే అవకాశమూ వస్తుందంటున్నారు ఈ పార్టీలకు హాజరైన వ్యక్తులు. ఇటీవలనే ఈ పార్టీకి హాజరైన సోషలైట్‌ పూనమ్‌ మాట్లాడుతూ ‘వైన్‌ టేస్టింగ్‌ సెషన్‌లలో కేవలం టేస్ట్‌ చేయడం మాత్రమే కాదు, దాని ప్రత్యేకతలు, ఏ తరహా వంటకాలతో కలిపి తీసుకుంటే దాని రుచులు మరింతగా పెరుగుతాయి లాంటివి కూడా వివరించారు. ఇదో విభిన్న అనుభవం’ అని చెప్పారు. అయితే ఇతరులతో కూర్చుని ఈ రుచుల ఆస్వాదనలో ఉన్న ఆనందం, వర్చువల్‌గా మాత్రం పొందలేం. కానీ, ప్రస్తుత పరిస్థితులలో ప్రతి చిన్న అవకాశాన్ని ఆస్వాదించడం  నేర్చుకుంటే మాత్రం తప్పనిసరిగా ఆనందానుభూతులనే కలిగిస్తుందంటున్నారు మరికొంతమంది సోషలైట్లు.

Updated Date - 2021-08-01T16:09:58+05:30 IST