పేదల రైలు పట్టాలపైకి

ABN , First Publish Date - 2021-06-23T14:03:45+05:30 IST

లోకల్‌ రైలు కోసం ఎదురుచూస్తున్న నగరవాసుల ఆశలు నెరవేరాయి. ఎంఎంటీఎస్‌ రైళ్లు తిరిగి అందుబాటులోకి వస్తున్నాయి. దాదాపు 15 నెలల సుదీర్ఘ విరామ అనంతరం మళ్లీ పట్టాలపైకి

పేదల రైలు పట్టాలపైకి

15 నెలల తర్వాత ఆగమనం 

నేటి నుంచి ప్రారంభం

తొలుత 10 సర్వీసులు మాత్రమే

పాత సీజన్‌ టికెట్ల గడువు పొడిగింపు


హైదరాబాద్‌ సిటీ: లోకల్‌ రైలు కోసం ఎదురుచూస్తున్న నగరవాసుల ఆశలు నెరవేరాయి. ఎంఎంటీఎస్‌ రైళ్లు తిరిగి అందుబాటులోకి వస్తున్నాయి. దాదాపు 15 నెలల సుదీర్ఘ విరామ అనంతరం మళ్లీ పట్టాలపైకి చేరనున్నాయి. కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి 16 నుంచి నిలిచిపోయిన ఎంఎంటీఎస్‌ రైళ్లు బుధవారం నుంచి నగర పరిధిలో తిరగనున్నాయి. మొత్తం 121 సర్వీసుల్లో ప్రస్తుతం 10 సర్వీసులను మాత్రమే నడిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 7.50  నుంచి రాత్రి 7.05 గంటల వరకు మాత్రమే రైళ్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఏడాదిన్నర కాలంగా మౌలాలి షెడ్డులో ఉన్న రైళ్లకు ఇప్పటికే మరమ్మతులు పూర్తిచేసిన సిబ్బంది నేటి నుంచి సాధారణ ప్రజల చెంతకు తీసుకొస్తున్నారు. 


సీజన్‌ టికెట్ల పొడిగింపు

కొవిడ్‌ ఆంక్షలకు లోబడి బుధవారం నుంచి పునరుద్ధరిస్తున్న ఎంఎంటీఎస్‌ రైళ్లలో సీజన్‌ టికెట్లను పొడిగిస్తున్నారు. కరోనా కారణంగా గతేడాది మార్చిలో సర్వీసులను రద్దు చేయడంతో సీజన్‌ టికెట్‌ కలిగిన కొంతమంది వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయారు. దీంతో నష్టపోయిన కాలాన్ని, రైళ్లు ప్రారంభించినప్పటి నుంచి అంటే జూన్‌ 23 నుంచి పొడిగించాలని రైల్వే బోర్డు నిర్ణయించిందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వీటికోసం ఎంఎంటీఎస్‌, సబర్బన్‌ స్టేషన్లలో బుకింగ్‌ కౌంటర్లలో సంప్రదించవచ్చన్నారు. 


అదనపు ప్రయోజనాలు

నగదు రహిత టికెట్ల కొనుగోలును ప్రోత్సహించడానికి రైల్వే అదనపు ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో అందుబాటులో ఉన్న ఏటీవీఎంల వద్ద స్మార్ట్‌ కార్డుల ద్వారా టికెట్లు పొందవ చ్చు. ఈ టికెట్ల కొనుగోలుపై అదనంగా 3 శాతం బోనస్‌ లభిస్తుంది. యాప్‌లో ఆర్‌-వ్యాలెట్‌ ద్వారా చెల్లింపు చేసే ప్రయాణికులకు 5 శాతం బోనస్‌ లభిస్తుంది. సీజనల్‌ టికెట్ల గడువు పెంపు, నగదు రహిత టికెటింగ్‌ సదుపాయాలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య సూచించారు.

Updated Date - 2021-06-23T14:03:45+05:30 IST