Abn logo
Sep 25 2021 @ 12:25PM

సమస్యలు జాస్తి.. సౌకర్యాలు నాస్తి

 అధ్వానంగా ప్రభుత్వ బడులు

 నిర్వహణ లోపంతో అస్తవ్యస్తం

 శిథిలావస్థకు చేరిన పలు పాఠశాలలు

 వర్షానికి తడిసి ముద్దవుతున్న తరగతి గదులు

 పలుచోట్ల పెచ్చులూడిపోతున్న పరిస్థితి

 స్కావెంజర్లు లేక టీచర్లు, విద్యార్థులకు ఇబ్బందులు

 చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోన్న అధికారులు

 పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రుల ఆందోళన


హైదరాబాద్‌ సిటీ: సర్కారు విద్యాలయాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. కనీస సదుపాయాలు కరువవడంతో విద్యార్థులు అసౌకర్యాల నడుమ విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. ‘‘నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నాం.. వారి చదువు కోసం ఏటా కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నాం..’’ అని సమావేశాల్లో గొప్పలు చెప్పుకుంటున్న అధికారులు ఆచరణలో విఫలమవుతున్నారు. ఇందుకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి..’’ గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌ జిల్లాలో 690, రంగారెడ్డిలో 1,318, మేడ్చల్‌లో 505 సర్కారు స్కూళ్లు ఉన్నాయి. మూడు జిల్లాల్లో కలిపి సుమారు 2,82,132 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి తగిన మౌలిక సదుపాయాలు కల్పించి మెరుగైన విద్యనందించాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు తమకేం పట్టిందిలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇటు విద్యార్థులు, అటు ఉపాధ్యాయులు నిత్యం సమస్యలతోనే కాలం వెళ్లదీస్తున్నారు.


పెచ్చులూడి.. తలుపులు విరిగి..

ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 8 నుంచి 12 శాతం వరకు తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. దాదాపు 25 నుంచి 30 ఏళ్ల క్రితం నిర్మించిన గదులు నిర్వహణ లోపంతో కునారిల్లిపోయాయి. ఇదే క్రమంలో కరోనాతో ఏడాదిన్నర కాలంగా పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిలిచిపోవడంతో అధ్వానంగా తయారయ్యాయి. పలుచోట్ల ఫ్లోరింగ్‌ను ఎలుకలు తవ్వడంతో భయానకంగా మారాయి. మరికొన్నిచోట్ల గుర్తు తెలియని వ్యక్తులు తరగతి గదుల తలుపులను ధ్వంసం చేశారు. దీంతోపాటు ఇటీవల కురుస్తున్న వరుస వర్షాలకు స్లాబులు నిమ్ముపట్టి కూలిపోతుండడంతో విద్యార్థులు భయంభయంగా చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.


స్కావెంజర్ల కొరతతో ఇబ్బందులు..

మూడు జిల్లాల పరిధిలోని పాఠశాలల్లో స్కావెంజర్లు లేకపోవడంతో ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా ముందు వరకు పాఠశాలల్లో స్కావెంజర్లు ఉండగా, కరోనా కారణంగా బడులు మూసి వేయడంతో వారిని తొలగించారు. ప్రస్తుతం పాఠశాలల్లో స్కావెంజర్లు లేకపోవడంతో ఉపాధ్యాయులు తలా కొంత డబ్బు సమకూర్చుకుని టాయిలెట్లను క్లీనింగ్‌ చేయించుకుంటున్నారు. మరికొన్ని స్కూళ్లలో దాతల సహకారంతో కార్మికుడిని ఏర్పాటు చేసుకున్నారు. స్కూళ్లలోని టాయిలెట్లకు నీటి వసతి కూడా లేదు. 


పట్టించుకోని విద్యాశాఖ అధికారులు..

విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని తరచూ చెబుతున్న పాలకులు పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోవడంపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కరోనాతో ఏడాదిన్నర కాలంగా పాఠశాలలు మూతపడినప్పటికీ ఆయా చోట్ల నెలకొన్న సమస్యలను పట్టించుకునేనాథుడే కరువయ్యాడని ఏబీవీపీ సెంట్రల్‌ వర్కింగ్‌ కమిటీ మెంబర్‌ పగిడిపల్లి శ్రీహరి విమర్శించారు.  

హైదరాబాద్మరిన్ని...