Abn logo
Sep 27 2021 @ 12:20PM

అడుగడుగునా ఆపద

నిర్లక్ష్యంగా పనులు, లోపించిన అధికారుల పర్యవేక్షణ,  ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. ఏదో ఒకమూల ఒక దుర్ఘటన చోటుచేసుకుంటోంది. వర్షం వస్తే ఇళ్ల నుంచి బయటకు రావొద్దనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. 


వర్షం వస్తే వెన్నులో వణుకే

 అడుగడుగునా ప్రాణగండం

 నోర్లు తెరిచే నాలాలు కూలే గోడలు

 ప్రాణాలు తీస్తున్న రోడ్ల గుంతలు

 బలవుతున్న అమాయకులు

 నిర్లక్ష్యం వీడని అధికార యంత్రాంగం


హైదరాబాద్‌ సిటీ:  వివిధ ప్రాజెక్టుల పరిశీలనకు కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్నారు. అభివృద్ధి పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అనేక దుర్ఘటనలు జరుగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో మల్కాజిగిరి దీన్‌దయాల్‌ నగర్‌లో సుమేధ (12) సైకిల్‌పై వెళుతూ ఓపెన్‌ నాలాలో పడి 2 కిలోమీటర్లు కొట్టుకుపోయింది. బండ చెరువు వద్ద బాలిక మృతదే హం దొరికింది. సరూర్‌నగర్‌ అల్మా్‌సగూడ బాలాజీ కాలనీకి చెందిన ఎలక్ర్టీషియన్‌ నీవన్‌బాబు (43) తపోవన్‌ కాలనీ నుంచి గ్రీన్‌పార్క్‌ కాలనీ మీదుగా వెళ్లే ప్రయత్నంలో మరణించాడు. తన స్కూటీని వెనుకనుంచి నెడుతూ రోడ్డు పక్కన గుంతలో నిలిచిన నీటిలో పడిపోయి సరూర్‌నగర్‌ చెరువులో శవంగా దొరికాడు. 2020 జూన్‌లో బోడుప్పల్‌ హేమానగర్‌ వద్ద తెరిచి ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో పీర్జాదిగూడ బుద్దానగర్‌ నివాసి సుదర్శన్‌గౌడ్‌ (57) ద్విచక్ర వాహనం పడడంతో అతడి తలకు బలమైన గాయాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో ఈ ఏడాది జూన్‌ 5న ఆనంద్‌సాయి(7) బోయినపల్లి ఓపెన్‌ నాలాలో పడి మృతిచెందాడు. రెండు నెలల క్రితం సాహెబ్‌నగర్‌లో డ్రైనేజీ లైన్లు బాగు చేసేందుకు ట్రంక్‌లైన్‌లో దిగి ఇద్దరూ కార్మికులు అంతయ్య, శివకుమార్‌ మరణించారు.


పలు ప్రాంతాల్లో నేటికి ఇలా...

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సివరేజ్‌ప్లాంట్ల నిర్మాణం మూడుచోట్ల పూరైనప్పటికీ ఔట్‌లెట్‌లు కలపక పోవడంతో పరిస్థితుల్లో ఎలాంటి మార్పురాలేదు. కొండాపూర్‌లో చౌరస్తా నుంచి రాఘవేంద్రకాలనీ వరకు, మియాపూర్‌ న్యూకాలనీ, వడ్డెరబస్తీ, హఫీజ్‌పేటలోని పలు ప్రాంతాలు, పాపిరెడ్డికాలనీలో ప్రాంతాల్లో డ్రైనేజీ పొంగిపొర్లుతుంటాయి. ఔట్‌లెట్లు కలపడంతోపాటు పాతపైపులైన్లు మారిస్తే తప్ప సమస్య పరిష్కారం కాని పరిస్థితి. 


వర్షం వస్తే గంటలకొద్దీ ఆగాల్సిందేనా...

 రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో ఇటీవల కురుస్తున్న  వర్షాలకు  ఉప్పర్‌పల్లి పిల్లర్‌నెంబర్‌ 191 వద్ద వరద నీరు చేరి  గంటల తరబడి  రాకపోకలు స్తంభించిపోతున్నాయి. ఈ సమస్య గత ఐదేళ్లుగా స్థానికులను వెంటాడుతుంది. వర్షం వచ్చిందంటే చాలు  చింతల్‌మెంట్‌, ఈరన్నగుట్ట, అక్బర్‌హిల్స్‌, పీడీపీ చౌరస్తా ప్రాంతాలనుంచి వచ్చే వరద నీరు పిల్లర్‌ నెంబర్‌ 191 వద్దకు చేరుతుంది. వర్షం వెలసిన సుమారు గంట సేపటి వరకు ఇక్కడ రోడ్డుపై నీరు నిలిచి ఉంటుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  


శివారులో మరిన్ని ఇబ్బందులు

 శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయలు కరువయ్యాయి. సరైన రోడ్లు లేవు. సరైన డ్రైనేజీ వ్యవస్థలు కూడా లేవు. శివారు ప్రాంతాల్లో వేర్వేరుగా సీవరేజీ వ్యవస్థ, వర్షపు నీటి డ్రెయిన్ల వ్యవస్థ ఏర్పడలేదు. ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారు.  నెలల తరబడి పనులు చేస్తుండడంతో కొన్ని ప్రాంతాల్లో రోడ్లను బంద్‌ చేస్తున్నారు. వీధులను మూసేస్తున్నారు. అడిగే నాథుడే లేడు.