డిసెంబర్‌లో రయ్‌.. రయ్‌..

ABN , First Publish Date - 2021-10-27T18:05:20+05:30 IST

షేక్‌పేట వంతెన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. రెండు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి డిసెంబర్‌లో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌

డిసెంబర్‌లో రయ్‌.. రయ్‌..

అందుబాటులోకి షేక్‌పేట వంతెన

తుది దశలో పనులు

రెండు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం

రూ.333.55 కోట్లు.. 2.8 కి.మీలు 

ఐటీ కారిడార్‌ మార్గంలో సిగ్నల్‌ రహిత ప్రయాణం


హైదరాబాద్‌ సిటీ:  షేక్‌పేట వంతెన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. రెండు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి డిసెంబర్‌లో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం వర్గాలు చెబుతున్నాయి. పాతబస్తీ, మెహిదిపట్నం, గుడి మల్కాపుర్‌, అత్తాపూర్‌ తదితర ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌కు సిగ్నల్‌ చిక్కులు లేని రాకపోకల కోసం వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎ్‌సఆర్‌డీపీ)లో భాగంగా వంతెన నిర్మాణం ప్రతిపాదించారు. రూ.333.55 కోట్లతో 2.8 కిలోమీటర్ల మేర ఆరు లేన్లుగా వంతెన నిర్మిస్తున్నారు. టోలిచౌకి గెలాక్సీ థియేటర్‌ వద్ద ప్రారంభమయ్యే వంతెన ఓయూ కాలనీ, షేక్‌పేట, విస్పర్‌ వ్యాలేల మీదుగా మల్కం చెరువు వద్ద దిగుతుంది. వాస్తవంగా యేడాదిన్నర క్రితమే ఫ్లై ఓవర్‌ నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా.. పలు కారణాలతో తీవ్ర జాప్యం జరిగింది. రెండు ఆస్తుల సేకరణకు సంబంధించి కోర్టులో కేసు ఉండడం.. భూగర్భంలో ఉన్న పైపులైన్లు, విద్యుత్‌ కేబుళ్లు మార్చేందుకు సమయం పట్టింది. ఈ సమస్యలు కొలిక్కి వచ్చిన దశలో కరోనా మూలంగా లాక్‌డౌన్‌ విధించారు. దీంతో ఇతర రాష్ర్టాలకు చెందిన కార్మికులు సొంతూళ్లకు వెళ్లి పనుల్లో వేగం మందగించింది. అప్పటి నుంచి పూర్వపు స్థాయిలో పనులు జరగడం లేదని అధికారులు చెబుతున్నారు. వంతెనలో 74 పిల్లర్లు నిర్మించగా.. 72 పియర్‌ క్యాప్స్‌ పూర్తి చేశారు. 440 ప్రీకాస్ట్‌ స్ట్రక్చరల్‌ గర్డర్స్‌, 144 కాంపొజిగ్‌ గర్డర్స్‌ ఏర్పాటు జరిగింది. 73 శ్లాబ్‌ల నిర్మాణంతో కలిపి ఇప్పటి వరకు 93 శాతం పనులు పూర్తయ్యాయని, డిసెంబర్‌ నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని ఇంజనీరింగ్‌ విభాగం ఉన్నతాధికారొకరు తెలిపారు. ఎస్‌ఆర్‌డీపీలో ఇప్పటికే 11 వంతెనలు, నాలుగు అండర్‌ పాస్‌లు, ఓ ఆర్‌యూబీ అందుబాటులోకి వచ్చాయి. 


ఆ మార్గాల్లో జామ్‌జాటం లేకుండా... 

మూడున్నరేళ్ల క్రితం వంతెన నిర్మాణ పనులు మొదలయ్యాయి. పాతబస్తీ, మెహిదిపట్నం, అత్తాపూర్‌ తదితర ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌కు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. రద్దీ ఎక్కువగా ఉండే రోడ్డులో యేళ్లుగా పనులు జరుగుతుండడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో త్వరలో ఈ మార్గంలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పడనుంది. రేతిబౌలి నుంచి గచ్చిబౌలి వరకు సిగ్నల్‌ చిక్కులు లేకుండా ప్రయాణించేందుకు టోలిచౌకి వంతెన దోహదపడుతుంది. టోలిచౌకిలో వంతెన ఎక్కితే.. మల్కం చెరువు దగ్గర దిగి.. ఖాజాగూడ జంక్షన్‌ దాటిన అనంతరం బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌ మీదుగా గచ్చిబౌలి, సైబర్‌ టవర్స్‌ వైపు సులువుగా వెళ్లే అవకాశముంటుంది. దీంతో గచ్చిబౌలి, మాదాపూర్‌, ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌ తదితర ప్రాంతాల కు రాకపోకలు సులువవుతాయి. 

Updated Date - 2021-10-27T18:05:20+05:30 IST